‘ప్రత్యేక’ అజెండా..?
ఇటీవలే పార్లమెంటు సమావేశాలు ముగిశాయి. స్వల్పవ్యవధిలోనే ప్రత్యేక సమావేశాలను కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ఇందులో కొన్ని బిల్లులు ఆమోదం కోసం ఈ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీంతో తమను సంప్రదించకుండా, ఎలాంటి అజెండా తెలియజేయకుండా సమావేశాలు ఏర్పాటు చేయడంపై .. విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీనివెనక నిగూఢమైన రహస్య అజెండా ఉందని ఆరోపిస్తున్నాయి. అసలు అజెండా లేకుండా సమావేశాల ఏర్పాటు ఎందుకని ప్రశ్నిస్తున్నాయి.
అయితే సమావేశాల విషయంలో కేంద్రాన్ని అంత ఈజీగా వదలకూడదని విపక్షాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ .. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే.. ఈ ఎజెండాలో 9 అంశాలను చేర్చాలని ఆమె లేఖలో సూచించారు. అదానీ అక్రమాలు, మణిపుర్ అల్లర్లు, రైతు సమస్యలు, కనీస మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీ, కులాల వారీగా జనగణన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రోజురోజుకీ దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను ఆదుకోవడం, హరియాణా సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చెలరేగుతున్న మత ఘర్షణలు, సరిహద్దుల్లో కొనసాగుతున్న చైనా ఆక్రమణలపై చర్చ చేపట్టాలని ప్రధాని మోడిని కోరారు సోనియా.
మరోవైపు.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఇండియా కూటమిలోని పలు భాగస్వామ్య పక్షాల నేతలు ఇప్పటికే ఓదఫా భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఆప్, టీఎంసీ, ఆర్జేడీ, ఎస్పీ, జేఎంఎం తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు. మోడీ చాలీసా కోసం మేము పార్లమెంటుకు వెళ్లం. సమావేశాల్లో ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు విపక్ష నేతలు.
సెప్టెంబరు 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ ప్రత్యేకం వెనుక ఆంతర్యం ఏంటనేదానిపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే, జమిలి ఎన్నికల కోసం బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి అమలు, ఓబీసీ వర్గీకరణ వంటి అంశాలపై చర్చించడానికే ఈ సమావేశాలను ఏర్పాటు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.













