రణ క్షేత్రం…
ఇజ్రాయెల్ పై హమాస్ విరుచుకుపడింది. గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి. జెరూసలెం, టెల్ అవివ్ సహా దేశవ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ప్రయోగించారు. దీంతో పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఓవైపు రాకెట్ దాడులు జరుగుతుండగానే హమాస్ మిలిటెంట్లు చొరబాటుకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడికి దిగింది. తాజా పరిణామాలతో ఇజ్రాయెల్‌లో యుద్ధ మేఘాలు అలుముకున్నట్లు సైన్యం ప్రకటించింది.
ఇజ్రాయెల్‌పై మిలిటరీ ఆపరేషన్‌ను ప్రారంభించామని హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మొహమ్మద్ డెయిఫ్ ప్రకటించాడు. ‘ఆపరేషన్ ఆల్-అక్సా స్ట్రామ్’ ప్రారంభమైందని, ఇప్పటివరకు 5వేల రాకెట్లను ప్రయోగించామని డెయిఫ్ చెప్పినట్లు ఓ వీడియో సందేశం బయటికొచ్చింది. డెయిఫ్‌పై గతంలో అనేకసార్లు దాడులు జరిగాయి. దీంతో కొంతకాలంగా బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్న డెయిఫ్…ఇప్పుడిలా వీడియో విడుదల చేయడం.. యుద్ధ తీవ్రతను అద్దం పడుతోంది.
ఇజ్రాయెల్ ‘ఐరన్ స్వార్డ్స్’..
తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్పందించారు. తాము యుద్ధంలో ఉన్నామన్నారు. హమాస్ ఘోర తప్పిదం చేసిందని, ఈ యుద్ధంలో తామే గెలుస్తామని తెలిపారు.. ‘ఇజ్రాయెల్ సైన్యం ప్రతి చోటా శత్రువులతో పోరాడుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. భద్రతాపరమైన సూచనలను పాటించండి’ అని నెతన్యాహు తెలిపారు. అటు హమాస్‌ను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ఆపరేషన్ ‘ఐరన్ స్వార్డ్స్’ను ప్రారంభించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నాయి.
పాలస్తీనా మిలిటెంట్లు తమ భూభాగాల్లోకి చొచ్చుకొచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. సరిహద్దుల్లోని ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది. హమాస్ మిలిటెంట్లతో ఇతర ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ముఠాలు కూడా చేరినట్లు సమాచారం..సరిహద్దుల్లో హమాస్ మిలిటెంట్లు దారుణాలకు పాల్పడుతున్నారని ఇజ్రాయెల్ మీడియా ఆరోపించింది. తమ దేశానికి చెందిన 35 మంది సైనికులను కిడ్నాప్ చేసినట్లు తెలిపింది.
హమాస్ అధీనంలో పోలీస్ స్టేషన్.. అటు ఇజ్రాయెల్-గాజా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాజా స్ట్రిప్‌లో స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ ఆర్మీ వాహనాలు, పారాచ్యూట్లతో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. సరిహద్దుల్లోని ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి దాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. అటు ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో పలువురు సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సరిహద్దుపై ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం.
ప్రపంచ దేశాల ఖండన.. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి పలు ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. హమాస్ అకృత్యాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని పలు దేశాలు విచారం వ్యక్తం చేశాయి.













