Shashi Tharoor: నరేగా పేరు మార్చడంపై శశిథరూర్ ఏమన్నారంటే..?
ఇటీవలి కాలంలో మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుల కోపానికి గురైన మాజీ కేంద్రమంత్రి. ఎంపీ శశిథరూర్.. లేటెస్టుగా రూట్ మార్చారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథకం స్థానంలో తీసుకొస్తున్న కొత్తచట్టాన్ని ఆయన వ్యతిరేకించారు.. ఈ పథకానికి గాంధీ పేరును తొలగించడం అనైతికమని అన్నారు. అంతేగాక, రాముడి పేరును అపవిత్రం చేయొద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
‘‘ఎంజీనరేగా (MGNREGA) పేరు మార్చి.. కేంద్రం కొత్తగా వీబీ-జీ రామ్ జీ బిల్లు తీసుకురావడంపై జరుగుతున్న వివాదం దురదృష్టకరం. గ్రామ స్వరాజ్ సిద్ధాంతాలు, రామరాజ్య ఆదర్శాలు ఎన్నటికీ ఒకదానితో ఒకటి పోటీపడేవి కాదు. గాంధీజీ దృక్పథానికి అవి రెండు మూల స్తంభాల్లాంటివి. ఇప్పుడు పథకానికి పేరు మార్చడం అంటే ఆయన ఆదర్శాలను విస్మరించినట్లే. ఆయన వారసత్వాన్ని అగౌరపర్చే ప్రయత్నం చేయొద్దు’’ అని థరూర్ రాసుకొచ్చారు.
శశి థరూర్ గత కొంతకాలంగా కాంగ్రెస్ (Congress)తో విభేదిస్తూ మోదీ ప్రభుత్వంపై బహిరంగంగానే ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో సొంత పార్టీ నేతల ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బిల్లు విషయంలో కాంగ్రెస్కు మద్దతుగా మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.






