కీలక ఒప్పందానికి బ్రేక్…?
ఇజ్రాయెల్, అరబ్ ప్రపంచం మధ్య దూరాన్ని పెంచడంలో హమాస్ విజయవంతమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అరబ్ దేశాలతో యూదు దేశమైన ఇజ్రాయెల్ సంబంధాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇరాన్, హమాస్.. వాటి సఖ్యతను ఆదిలోనే దెబ్బతీయగలిగాయి. ఇజ్రాయెల్ తో ఒప్పందంపై సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ఉద్దేశించిన ఒప్పంద చర్చలకు బ్రేక్ పడినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌తో ఒప్పంద చర్చలను నిలిపివేయాలని సౌదీ నిర్ణయించిందని, ఇదే విషయాన్ని అమెరికా అధికారులకు సౌదీ తెలియజేసినట్లు అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి.
గత కొన్నాళ్లుగా అరబ్‌లీగ్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇజ్రాయెల్ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 1979లో ఈజిప్టుతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంది. ఇటీవల కాలంలో యూఏఈ, బహ్రెయిన్ దేశాలు ఆ దేశంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తాజాగా సౌదీ అరేబియాను ఆ జాబితాలోకి చేర్చే ప్రయత్నం అగ్రరాజ్యం అమెరికా ఆరంభించింది. యుద్ధానికి ప్రారంభానికి కొద్ది రోజులు ముందు ఇజ్రాయెల్- సౌదీ అరేబియా దేశాలు సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొచ్చాయి. ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తోంది. సరిగ్గా ఈ ప్రయత్నమే.. గాజా-ఇజ్రాయెల్ మధ్య తాజా యుద్ధానికి కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
అరబ్‌లీగ్‌లో బలమైన దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియా.. ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఏర్పరచుకుంటే మిగతా ముస్లిం దేశాలకు అది బలమైన సంకేతాన్ని పంపుతుంది. ఇతర దేశాలూ సౌదీ బాట పట్టే అవకాశం ఉంది. సాధారణంగా పాలస్తీనా సమస్య.. అరబ్ దేశాలకు ఓ భావోద్వేగపరమైన అంశం. అందుకే మెజారిటీ ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ విషయంలో ఇన్నాళ్లూ కఠిన వైఖరినే అవలంబిస్తూ వచ్చాయి. ఆ దేశ సార్వభౌమత్వాన్ని అధికారికంగా గుర్తించడానికి తిరస్కరిస్తూ వచ్చాయి. అలాంటి దేశాలు యూదు దేశంతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల పాలస్తీనీయుల హక్కులకు వెన్నుపోటు పొడవడమే అవుతుందని ఇరాన్ కూడా స్పష్టం చేసింది. అదే జరిగితే హమాస్ ఆశయాలకు గట్టి దెబ్బే తగులుతుంది.
ఇలాంటి సమయంలో హమాస్ దాడితో అంతా తలకిందులైందనే చెప్పవచ్చు. హమాస్ ఏరివేతలో భాగంగా ఇజ్రాయెల్.. గాజాపై పెనుదాడులు చేస్తోంది. దీంతో ఇజ్రాయెల్ తీరుపై అరబ్ ప్రపంచం మండిపడుతోంది. ఫలితంగా సౌదీ అరేబియా.. ఇజ్రాయెల్ తో ఒప్పందంలో ముందడుగు వేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అందరూ ఊహించినట్లుగానే సౌదీ వెనక్కి తగ్గింది. ఇది పశ్చిమాసియాలో శాంతి ప్రక్రియకు చేసిన ప్రయత్నాలకు గండి కొట్టినట్లైంది. అంటే హమాస్ చర్య, ఇజ్రాయెల్ ప్రతిచర్య..ఉద్రిక్తతలను మళ్లీ మొదటికి తెచ్చాయని చెప్పక తప్పదు.













