రాజస్తాన్ ‘పైలట్’..
2018లో కాంగ్రెస్ ప్రచారంలో అన్నీ తానై అయ్యారు. బీజేపీపై సమరభేరి మోగించి, ప్రజాశీస్సులతో పార్టీని అధికారంలోకి తెచ్చారు. కానీ .. చివరిలో కాంగ్రెస్ రాజకీయాలకు బలయ్యారు. సీనియర్ నేత అశోక్ గహ్లోత్.. రాజతంత్రం ముందు ఓటమి తప్పలేదు. అధిష్టానాన్ని ఒప్పించి గహ్లోత్ సీఎం అయ్యారు. దీంతో సచిన్ పైలట్.. తిరుగుబాటు చేశారు. ఓ దశలో హైకమాండ్ తీరుపై ఆగ్రహించి.. హోంమంత్రి అమిత్ షాతో టచ్ లోకి వెళ్లారు. అయితే జ్యోతిరాదిత్య సింధియా వ్యవహారంతో అప్రమత్తమైన రాహుల్, ప్రియాంక బుజ్జగింపుతో శాంతించారు సచిన్ పైలట్.
అయితే అప్పటికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. పార్టీలో ఉంటే భవిష్యత్ ఉండదన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ నెమ్మదిగా పుంచుకుంటోంది. అందులోనూ అశోక్ గహ్లోత్ తర్వాత అంతటినేతగా పలుకుబడి ఉంది. వీటన్నింటినీ అవలోకనం చేసుకున్న సచిన్ పైలట్ రూటు మార్చారు. ఓపిక, విధేయత అస్త్రాలుగా ముందుకు సాగుతున్నారు. అసమ్మతి రాగాలకు, సొంత ప్రభుత్వంపై విమర్శలకు ఫుల్స్టాప్ పెట్టారు. అవకాశం చిక్కినప్పుడల్లా అధిష్టానానికి విధేయతను చాటుకుంటూ వస్తున్నారు. విధేయత, వెయిటింగ్ గేమ్ అంతిమంగా తనను అందలమెక్కిస్తాయని ఆశిస్తున్నారు…
ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొత్తం వన్ మ్యాన్ షోగా మారిపోయింది. ముఖ్య బాధ్యతలు ఏవీ సచిన్ పైలట్ కు అప్పగించలేదు. అయినా సరే .. సహనంతో వ్యవహరిస్తున్నారు సచిన్ పైలట్. ఓవైపు అశోక్ గహ్లోత్ .. తనను కార్నర్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు.పైగా గహ్లోత్ సర్కారుపై బీజేపీ విమర్శలను పైలట్ దీటుగా తిప్పికొడుతూ కాంగ్రెస్ నేతలనే ఆశ్చర్యపరుస్తున్నారు! అంతేగాక ఇటీవల గహ్లోత్ కుమారుడికి ఈడీ సమన్లను, పీసీసీ చీఫ్ గోవింద్‌సింగ్ నివాసంపై ఈడీ దాడులను కూడా పైలట్ తీవ్రంగా ఖండించారు.
గహ్లోత్‌పై విమర్శలు, ఆరోపణలకు పూర్తిగా ఫుల్స్టాపే పెట్టడమే గాక ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధమని సంకేతాలిచ్చారు. వాటిని గహ్లోత్ పట్టించుకోకపోయినా, చాన్స్ దొరికినప్పుడల్లా తనకు చురకలు వేస్తున్నా, పార్టీ పట్ల తన చిత్తశుద్ధిని పదేపదే ప్రశ్నిస్తున్నా, వ్యూహాత్మక మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఎన్నికల ప్రచారమంతా గహ్లోత్ వన్ మ్యాన్ షోగానే సాగుతున్నా ఇదేమని ప్రశ్నించడం లేదు.పార్టీ గెలిస్తే సీఎం పదవి డిమాండ్ చేస్తారా అని ప్రశ్నించినా అది అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయమని ఆచితూచి బదులిస్తున్నారు. అదే సమయంలో, వ్యక్తిగత ప్రతిష్ట కోసం సీఎం కావాలన్న దుగ్ధ తనకు లేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు.
పైలట్ విధేయత వ్యూహం బాగానే ఫలిస్తోందంటున్నారు కాంగ్రెస్ నేతలు. గాంధీ త్రయం సోనియా, రాహుల్, ప్రియాంక కొద్ది రోజులుగా ఆయన అభిప్రాయానికి బాగా విలువ ఇస్తున్నారని పీసీసీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. పైలట్ విధేయత, గహ్లోత్ గతేడాది చూపిన అవిధేయత రెండింటినీ అధిష్టానం బేరీజు వేసుకుంటోందని కూడా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.













