విజయం దిశగా ఉక్రెయిన్..?
ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభించి 17 నెలలు గడుస్తోంది. గెలుపు సంగతి దేముడెరుగు… రష్యా సైన్యం గట్టి ఎదురుదెబ్బలు తింటోంది. కొన్నాళ్లు యుద్ధం చేసి లొంగిపోతుందని భావించిన ఉక్రెయిన్.. రణతంత్రాల్ని మరింత పదునుదేరుస్తోంది. మరింత పటిష్టంగా యుద్ధవ్యూహాలు అమలు చేస్తోంది. మొన్నటివరకూ సరిహద్దుల్లో దాడులకే పరిమితమైన ఉక్రెయిన్ .. నెమ్మదిగా అత్యంత కీలకమైన క్రిమియా వంతెనపైనా దాడులు చేస్తోంది. ఇప్పుడు ఏకంగా రష్యా రాజధాని మాస్కో పై డ్రోన్ల సాయంతో దాడికి దిగింది కీవ్. ఈ దాడిలో ఓభవనం స్వల్పంగా ధ్వంసమైంది.
రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కీవ్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. నాటోదేశాల నుంచి అందుతున్న ఆయుధాలతో.. రష్యన్ సైన్యంపై విరుచుకుపడుతోంది. ముందుగా క్రిమియాను రష్యాను కలిపే వంతెనను పేల్చివేస్తే, క్రెమ్లిన్‌ను బలహీనపర్చవచ్చని భావిస్తోంది. దీనిలో భాగంగా క్రిమియా వంతెనను టార్గెట్ చేసింది. అయితే సరిహద్దుకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాస్కోపై ఉక్రెయిన్ దాడితో రష్యన్ రక్షణ నిపుణులు సైతం షాక్‌కు గురయ్యారు.
మొన్నటివరకూ బిగుసుకు కూర్చుని, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. తప్పనిసరి పరిస్థితుల్లో ఓ మెట్టుదిగారు. ఉక్రెయిన్ తో శాంతి చర్చలను తాము తోసిపుచ్చడంలేదన్నారు. అయితే, ఉక్రెయిన్ చేస్తున్న దాడులు ఈ ప్రక్రియలో ముందడగు పడనీయవని అభిప్రాయపడ్డారు. శాంతి చర్చలకు ఇరు దేశాల ఏకాభిప్రాయం అవసరమన్నారు. రష్యా-ఆఫ్రికా సదస్సు తర్వాత పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే.. కాల్పుల విరమణ ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తిరస్కరించారు. ‘‘ఇప్పటికీ రష్యా బలగాల ఆధీనంలో ఉక్రెయిన్ లోని ఐదోవంతు భాగముందన్నారు జెలెన్స్కీ. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంటే.. పుతిన్ బలగాలు తిరిగి బలోపేతం కావడానికి తగిన సమయం ఇచ్చినట్లు అవుతుందని స్పష్టం చేశారు. పూర్తిగా తమ భూభాగాలను స్వాధీనం చేసుకునేవరకూ తమ పోరాటం ఆగదన్నారు.













