అంతర్యుద్ధం దిశగా రష్యా..?
ఉక్రెయిన్ యుద్ధం నెలల తరబడి సాగుతుండడం, పెరిగిపోతున్న రష్యన్ సైనికుల మరణాలు.. సైన్యంలో అసంతృప్తికి దారి తీసిందా? మరీ ముఖ్యంగా పుతిన్ పొరపాటు నిర్ణయంతో తమ ప్రతిష్ట మంటగలిసిందని రష్యన్ సైన్యం భావిస్తోందా? పుతిన్ ను గద్దె దించేందుకు రష్యా సైన్యంలోని ఓవర్గం, ఒలిగార్లు నిర్ణయించారా? రష్యాపై తిరుగుబావుటా ఎగురవేసిన ప్రిగోజిన్ ప్రకటనలు చూస్తే ఇదే అర్థం ధ్వనిస్తుంది.
‘మేం ఎవరికీ ద్రోహం చేయలేదు. అధ్యక్షుడు పొరబడ్డారు. మేం దేశభక్తులం. ఏ ఒక్కరూ కూడా లొంగిపోవడం లేదు. ఎందుకంటే మేం ఈ దేశాన్ని అవినీతి, అబద్ధాలు, బ్యూరోక్రసీలో మగ్గిపోవాలని కోరుకోవడం లేదు. పుతిన్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. రష్యాకు కొత్త అధ్యక్షుడు వస్తారు’అని పుతిన్ ప్రభుత్వాన్ని విమర్శించారు ప్రిగోజిన్.మరీ ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధంలో వాగ్నర్ గ్రూప్ సైన్యం .. చాలా మందిని కోల్పోయింది. కీలక సమయాల్లో రష్యా ఆయుధాలివ్వకుండా తమకు హ్యాండిచ్చిందని.. అందుకే ఇంత భారీగా మరణాలు చోటు చేసుకున్నాయని ఇదివరకే వాగ్నర్ గ్రూప్ హెడ్ ప్రిగోజిన్ ఆరోపించారు.
వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటుతో ప్రస్తుతం రష్యాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఆ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ రష్యా ప్రజలను వెన్నుపోటు పొడిచారంటూ అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా మండిపడ్డారు. దేశ ప్రజల రక్షణకోసం చేయగలిగిందంతా చేస్తామన్నారు. సైన్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. పలుప్రాంతాల్లో పౌరులపై ఆంక్షలు కూడా విధించారు. తాజా పరిణామాలు రష్యన్లలోనూ ఆందోళనకు కారణమవుతున్నాయి.
చెచెన్యా నేత, క్రూరుడిగా పేరున్న రంజాన్ కదిరోవ్ ప్రస్తుత తిరుగుబాటుపై ప్రకటన విడుదల చేశారు. ప్రిగోజిన్ చర్యలను ఖండించిన ఆయన.. రష్యాకు మద్దతు తెలిపారు. తాజా ఉద్రిక్తతలను తొలగించేందుకు సహకరిస్తానని వెల్లడించారు. ప్రిగోజిన్ తీరును వెన్నుపోటు చర్యగా అభివర్ణించారు. మరోపక్క..రష్యా పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న పొలండ్.. దేశంలో అత్యంత అప్రమత్తతను ప్రకటించింది.
అలాగే వాగ్నర్ దళాలు రష్యా దక్షిణ ప్రాంత నగరాల నుంచి ముందుకు సాగుతున్నట్లు సమాచారం. వారు ప్రయాణిస్తోన్న మోటార్ వే మాస్కో నగరాన్ని కలుపుతుంది. ఈ పరిణామంతో రష్యా అప్రమత్తమైంది.ఇన్నిరోజులు ఉక్రెయిన్‌లోని నగరాలపై బాంబుల వర్షం కురిపించిన రష్యా.. ఇప్పుడు సొంత నగరంపైనే దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాగ్నర్ సేనలను నిలువరించేందుకు.. వొరొనెజ్లోని ఆయిల్ రిఫైనరీ, డిపోపై బాంబు దాడి చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే.. తాజా పరిణామాల నేపథ్యంలో పుతిన్‌కు రష్యా పార్లమెంట్ పూర్తి మద్దతు ప్రకటించింది.













