అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్టాపన..
శ్రీరాముని జన్మస్థలం, దివ్యపుణ్యక్షేత్రం అయోధ్య…. ఆధ్యాత్మిక సంద్రంగా మారింది. శ్రీసీతారామస్వామి, రామ్ లల్లా దర్శనాల కోసం పెద్దసంఖ్యలో భక్తులు అయోధ్య చేరుకుంటున్నారు. దీంతో అయోధ్యలో ఎక్కడ చూసినా జై శ్రీరామ్ నామం.. తారకమంత్రంలా మారింది. ఆ జగదభిరాముడిని చూసి, తరించడమే తమ లక్ష్యమంటున్నారు భక్తులు. మరోవైపు .. దేశవ్యాప్తంగా 11 వేల మంది వీఐపీలకు .. అయోధ్య ఆహ్వానం అందడంతో.. వారు సైతం రాముని సన్నిధికి తరలివస్తున్నారు.
అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంప్రదాయ క్రతువులు జనవరి 21 వరకు నిరంతరాయంగా జరుగుతాయి.
జనవరి 16- ఆలయ ట్రస్ట్ నియమించిన ప్రతినిధి ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సరయూ నది ఒడ్డున ‘దశవిధ’ స్నానం, విష్ణుపూజ, గోపూజ జరుగుతాయి. జనవరి 17- రామ్‌లల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకుంటుంది. మంగళ కలశంలో సరయూ జలాన్ని తీసుకొని భక్తులు ఆలయానికి చేరతారు.
జనవరి 18- గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, వాస్తు పూజలతో సంప్రదాయ క్రతువులు ప్రారంభమవుతాయి.
జనవరి 19- యజ్ఞం ప్రారంభం అవుతుంది. తర్వాత ‘నవగ్రహ’ ‘హవన్’ స్థాపన నిర్వహిస్తారు.
జనవరి 20- రామజన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నీళ్లతో శుభ్రం చేస్తారు. తర్వాత వాస్తు శాంతి ‘అన్నాదివస్’ ఆచారాలను పండితులు నిర్వహిస్తారు.
జనవరి 21- రామ్‌లల్లా విగ్రహానికి 125 కలశాలతో అభిషేకం చేస్తారు.
జనవరి 22- ప్రధాన ప్రాణ ప్రతిష్ఠ వేడుక మధ్యాహ్నం 12:30 గంటలకు మొదలవుతుంది. రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ఠాపన చేస్తారు. చివరి రోజు జరిగే మహోత్సవానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.
అయోధ్యలో ప్రతిష్ఠకు కర్ణాటకకు చెందిన మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారుచేసిన ప్రతిమను ఎంపిక చేశారు. దీన్ని రాయితో మలిచారని.. 150-200 కిలోల బరువు ఉంటుందని చెప్పారు. మొత్తం ముగ్గురు వేర్వేరు శిల్పులు మలిచిన మూడు విగ్రహాలను సిద్ధం చేయించగా.. యోగిరాజ్ చెక్కిన ప్రతిమను ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఐదేళ్ల వయసున్న బాలరాముడు నిలబడి ఉన్న రూపంలో విగ్రహం ఉంటుందని తెలిపారు. ‘రాముడి కళ్లు తామర రేకుల మాదిరిగా ఉంటాయి. ఆయన ముఖం చంద్రుడిలా ప్రకాశిస్తుంది. పెదవులపై నిర్మలమైన చిరునవ్వు ఉంటుంది. పొడవాటి చేతులతో విగ్రహం తయారైంది. దైవత్వం ఉట్టిపడుతున్న ఈ విగ్రహం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ విగ్రహంలో దశరథ కుమారుడు, విష్ణుమూర్తి అవతారమైన రాముడిని చక్కగా చూడవచ్చు’ అని చంపత్ రాయ్ గతంలో తెలిపారు. జనవరి 21, 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి లేదని తాజాగా రాయ్ తెలిపారు. జనవరి 23 నుంచి భక్తులకు రామ్‌లల్లా దర్శన భాగ్యం కల్పిస్తామని స్పష్టం చేశారు.గత 70 ఏళ్లుగా ఈ ప్రదేశంలో పూజలందుకుంటున్న రామ్‌లల్లా విగ్రహాన్ని సైతం గర్భగుడిలో ఉంచనున్నారు.













