లోక్సభలో రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ గోల..!!
మోదీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటోంది. దీనిపై హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న మొదలైన ఈ చర్చ ఇవాళ్ కూడా కంటిన్యూ అయింది. అవిశ్వాస తీర్మానంపై చర్చను రాహుల్ గాంధీయే ప్రారంభిస్తారని అందరూ భావించారు. అయితే నిన్న రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగానే మౌనం పాటించారు. ఇవాళ మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. మోదీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాహుల్ బాగా మాట్లాడారని అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత స్మృతి ఇరానీ మాట్లాడుతూ రాహుల్ గాంధీపై రెచ్చిపోయారు.. అనంతరం రాహుల్ సభ నుంచి వెళ్లిపోతూ ఓ వివాదానికి తెరలేపారు.
అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ ఇవాళ లోక్ సభలో మాట్లాడారు. మణిపూర్ లో భరతమాతను చంపేశారన్నారు. మణిపూర్ ను రెండుగా చీల్చేశారన్నారు. రావణుడు ఇద్దరి మాటలే వినేవారని.. ప్రధాని మోదీ కూడా ఇద్దరి మాటలే వింటారని ఎద్దేవా చేశారు. అమిత్ షా, అదానీ మాటలు తప్ప మరెవరిమాటనూ మోదీ వినరని రాహుల్ అన్నారు. ఆ తర్వాత స్పీచ్ ముగిసింది. వెంటనే రాహుల్ గాంధీ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. పోతూపోతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆ తర్వాత స్మృతి ఇరానీ సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంలో రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్త్రీ వ్యతిరేకులే లోక్ సభలో ఇలాంటి చర్యలకు పాల్పడతారని.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. కేంద్రమంత్రి శోభా కరంద్లాజే నేతృత్వంలో బీజేపీ మహిళా ఎంపీలందరూ సంతకాలు చేసిన లేఖను స్పీకర్ కు అందించారు. ఇలాంటి అసభ్యకర సన్నివేశం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. దీంతో పార్లమెంటులో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమి సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అంశంపై చర్చ జరుగుతున్నంతసేపు లోక్ సభలో గందరగోళం కంటిన్యూ అయింది.
మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించింది కోర్టు. దానిపై స్టే తెచ్చుకున్న ఆయన.. రెండ్రోజుల కిందటే పార్లమెంటులో అడుగు పెట్టారు. ఇంతలోనే ఈ ఫ్లయింగ్ కిస్ వివాదం తెరపైకి రావడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. రాహుల్ గాంధీకి హుందాతనం తెలియదని, చట్టసభల్లో చిన్నపిల్లాడి చేష్టలు చేస్తారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. గతంలో ప్రధాని మోదీ సీటు దగ్గరకు వెళ్లి రాహుల్ గాంధీ హగ్ ఇచ్చారు. ఇప్పుడు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారో వేచి చూడాలి.













