ఈసారి అమేథీ నుంచి బరిలో దిగబోతున్న రాహుల్ గాంధీ..!!
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు కాంగ్రెస్ యువనేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఇందుకోసం బీజేపీయేతర పార్టీలన్నింటినీ కలిపి మరీ ఇండియా అనే కూటమి ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని దించితేనే ఈ దేశానికి మంచి రోజులు వస్తాయని విపక్షాలన్నీ ముక్తకంఠంతో చెప్తున్నాయి. మొదట కాంగ్రెస్ లేకుండానే కూటమి కడదామనుకున్న పార్టీలు.. ఆ తర్వాత హస్తం పార్టీ లేకుండా కేంద్రంలో సర్కార్ ను ఏర్పాటు చేయడం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చాయి. ఇప్పుడు అన్నీ ఏకతాటిపైకి రావడంతో రాష్ట్రాలవారీగా ఎలా ముందుకెళ్లాలనేదానిపై చర్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
గాంధీ ఫ్యామిలీకి అమేథి, రాయిబరేలి కంచుకోటలు. గతంలో ఈ నియోజకవర్గాల నుంచే గాంధీ ఫ్యామిలీకి చెందిన వారంతా పోటీ చేసి గెలుపొందారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఈ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ, వయనాడు నుంచి బరిలోకి దిగారు. అనూహ్యంగా అమేథీలో ఓడిపోయారు. ఇదీ అప్పట్లో సంచలనం కలిగించింది. ఇక్కడి నుంచి బీజేపీ తరపున స్మృతి ఇరానీ బరిలోకి దిగి నెగ్గారు. దీంతో రాహుల్ గాంధీకి వయనాడ్ మాత్రమే మిగిలింది. ప్రస్తుతం అక్కడి నుంచి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే పోటీ చేస్తారా.. లేకుంటే మళ్లీ అమేథీకి వెళ్తారా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వయనాడ్ నుంచి గెలిచిన తర్వాత రాహుల్ గాంధీ తరచుగా అక్కడ పర్యటిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. కేరళ ప్రజలు కూడా రాహుల్ గాంధీ పట్ల మమకారం చూపిస్తున్నారు. దీంతో రాహుల్ గాంధీ మళ్లీ వయనాడ్ నుంచే బరిలోకి దిగుతారని అందరూ అనుకున్నారు. అయితే తనను ఓడించిన ప్రజల మద్దతు, ఆదరాభిమానాలను చూరగొనేందుకు రాహుల్ గాంధీ మళ్లీ అమేథీలో పోటీ చేసే అవకాశం ఉందని కొందరు చెప్తూ వచ్చారు.
తాజాగా ఉత్తరప్రదేశ్ పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ … రాహుల్ గాంధీ పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ మళ్లీ అమేథీ నుంచే పోటీ చేస్తారని ప్రకటించారు. ప్రియాంక గాంధీ తనకు నచ్చిన నియోజకవర్గాన్ని ఎంచుకోవచ్చని చెప్పారు. అయితే ఇవి అజయ్ రాయ్ వ్యక్తిగత వ్యాఖ్యలా… లేకుంటే పీసీసీ చీఫ్ హోదాలో ఆయన మాట్లాడారా.. అనే దానిపై క్లారిటీ లేదు. ఒకవేళ నిజంగానే అమేథీ నుంచి రాహుల్ పోటీ చేస్తే అది పెద్ద వార్తే. అలాంటప్పుడు గతంలోలాగే వయనాడ్ నుంచి కూడా పోటీ చేస్తారా.. లేకుంటే కేవలం అమేథీకి మాత్రమే పరిమితం అవుతారా.. అనేది వేచి చూడాలి.













