వయనాడ్ కు రాహుల్ బైబై..?

కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ .. వయనాడ్, రాయ్ బరేలీ నుంచి విజయభేరీ మోగించారు. ఈ రెండు స్థానాల్లో ఒకదాన్ని వదులుకోవాల్సి ఉంది. అయితే ఈ స్థానం వయనాడ్ అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ.. ఆ స్థానానికి ఇవాళో, రేపో రాజీనామా చేస్తారనే ప్రచారం నడుస్తోంది. దీనిపై రాహుల్ గాంధీ త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. ఇటీవల వయనాడ్ నియోజకవర్గంలో పర్యటించారు రాహుల్.. వయనాడ్, రాయబరేలీ నియోజకవర్గ ప్రజలకు సంతోషంగా ఉండే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. మరి రాహుల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ప్రియాంక పోటీ..?
రాహుల్ గాంధీ వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేస్తే ఆ చోటు నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ కూడా అప్పుడే ప్రారంభమైంది. వయనాడ్ నియోజకవర్గానికి రాహుల్ రిజైన్ చేస్తే.. అక్కడి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. లేదంటే కేరళకు చెందిన సీనియర్ నేతను అక్కడి నుంచి పోటీకి దించే అవకాశం కూడా ఉందంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు.
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే యూపీలో కాంగ్రెస్ పుంజుకోవడం అనివార్యం. అందుకే.. రాహుల్ గాందీ రాయబరేలీ స్థానంలోనే కొనసాగాలని యూపీ కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. దీంతో రాహుల్ సైతం రాయబరేలీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. మరోవైపు కొన్నాళ్లుగా యూపీలో కాంగ్రెస్ ను జాకీలు పెట్టి లేపేందుకు ప్రియాంకగాంధీ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఎన్నికల వేళ పలుసభల్లో మాట్లాడారు కూడా. కానీ కాంగ్రెస్ కు అనుకున్నంత మైలేజ్ రావడం లేదు. ఫలితంగా రాహుల్ వస్తే యూపీలో సమీకరణాలు మారే అవకాశముందన్నది అక్కడి కాంగ్రెస్ నేతల అంచనా.
గతంలో పప్పుగా రాహుల్ ను పిలిచే విపక్షాలు, ముఖ్యంగా బీజేపీనేతలు.. ఇటీవలి కాలంలో యువరాజు అని సంభోదిస్తున్నారు. ఇటీవలి కాలంలో రాహుల్ రాజకీయ స్ట్రాటజీ మారింది. భారత్ జోడో యాత్రతో తానో సీరియస్ పొలిటీషియన్ అని నిరూపించుకున్నారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను చీల్చి చెండాడుతున్నారు రాహుల్. యువనేత సామర్థ్యాన్ని గుర్తించిన తర్వాతే మిత్రపక్షాలు సైతం.. ఇప్పుడిప్పుడే రాహుల్ ను తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా అంగీకరించే స్థాయికి చేరాయి. ఈపరిణామంతో దేశప్రజల్లో కూడా రాహుల్ పై సానుకూల అభిప్రాయం ఏర్పడేందుకు దోహదం చేస్తోంది.