గాంధీ కుటుంబం అమేఠీని వదిలి పారిపోయిందా..?

దేశవ్యాప్తంగా సార్వత్రి ఎన్నికల కోలాహలం నెలకొని ఉంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీలన్నీ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా మోదీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే యువనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని ఆ పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. అయితే మోదీని ఓడించడం సాధ్యమా అనేది పెద్ద ప్రశ్న. మరోవైపు ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ప్రధాని మోదీ ఎద్దేవా చేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా కొత్త సీటు వెతుక్కుంటారని గతంలో తాను చేసిన కామెంట్స్ ను ఆయన ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో అమేఠీ, వయనాడ్ లలో పోటీ చేశారు. అమేఠీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోగా వయనాడ్ లో గెలిచారు. ఈసారి కూడా ఆయన వయనాడ్ నుంచి మరోసారి బరిలో ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా అమేఠీ నుంచి పోటీ చేస్తారని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. రాయ్ బరేలి, అమేఠీ నుంచి రాహుల్, ప్రియాంక పోటీ చేయాలని కాంగ్రెస్ శ్రేణుల నుంచి డిమాండ్ వచ్చింది. అయితే ప్రియాంక గాంధీ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తాజాగా రాహుల్ గాంధీ అమేఠీ నుంచి కాకుండా రాయ్ బరేలి నుంచి పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
2004 నుంచి 2014 వరకూ రాహుల్ గాంధీ అమేఠీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో మాత్రం ఓడిపోయారు. ఈసారి కూడా అక్కడే పోటీ చేస్తారనుకుంటే అనూహ్యంగా తన తల్లి సోనియా ప్రాతినిధ్యం వహించిన రాయ్ బరేలి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. గత పాతికేళ్లలో అమేఠీ నుంచి గాంధీ ఫ్యామిలీ పోటీ చేయకపోవడం ఇదే తొలిసారి. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి కిశోరీ లాల్ బరిలో నిలిచారు. 1980లో సంజయ్ గాంధీ ఇక్కడ పోటీ చేసి గెలిచారు. ఆయన మరణంతో రాజీవ్ గాంధీ పోటీ చేసి 1991 వరకూ ఎంపీగా కొనసాగారు. 1999లో సోనియా పోటీ చేసి గెలిచారు. అనంతరం 2004 నుంచి రాహుల్ గెలుస్తూ వచ్చారు.
ఇప్పుడు రాహుల్ గాంధీ అమేఠీని వదిలేసి రాయ్ బరేలి నుంచి పోటీ చేస్తున్నారు. దీనిపై ప్రధాని మోదీ సెటైర్లు వేస్తున్నారు. సోనియా గాంధీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం చేయరని.. పారిపోతారని గతంలోనే తాను చెప్పానని .. ఇప్పుడామె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారని గుర్తు చేశారు. అలాగే రాహుల్ కూడా కేరళలో ఎన్నికలు పూర్తి కాగానే వయనాడ్ లో ఓడిపోతారని తెలిసీ ఇప్పుడు రాయ్ బరేలీకి వచ్చి పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పైగా అమేఠీని వదిలేసి రాయ్ బరేలికి వెళ్లడమంటేనే పారిపోతున్నట్టు అర్థమని సెటైర్లు వేస్తున్నారు. పారిపోవద్దని.. పోరాడాలని సూచించారు.