వామ్మో.. మనం చూస్తున్నది రాహుల్ గాంధీనేనా..!?
కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందంటూ 23 మంది సీనియర్ నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీళ్లంతా రేపోమాపో పార్టీకి గుడ్ బై చెప్పేసే ఆలోచనలో ఉన్నారు. పార్టీని చీల్చి వేరు కుంపటి పెడతారనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ బహిరంగంగానే ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించడం.. సీనియర్లంతా సోనియా గాంధీకి అసంతప్తి వ్యక్తం చేయడం లాంటి పరిణామాలు ఆ పార్టీ అంతర్గత పోరును చెప్పకనే చెప్పాయి.
ఓ వైపు సీనియర్లు జమ్ములో పార్టీని కాదని మీటింగ్ పెట్టుకున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ మాత్రం తమిళనాడులో తనపని తాను చేసుకుపోతున్నారు. పార్టీ సీనియర్లను, వారి హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని రాహుల్ గాంధీ.. పార్టీ బలోపేతానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రాహుల్ పావులు కదుపుతున్నారు. దక్షిణ భారతదేశాన్ని రాహుల్ చూసుకుంటుండగా.. ఉత్తర భారతాన్ని సోదరి ప్రియాంకకు అప్పగించారు. దీంతో పార్టీ బరువు బాధ్యతలను ఇప్పుడు వీళ్లిద్దరే మోస్తున్నారు.
ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీని చూసిన వాళ్లెవరయినా ఆశ్చర్యపోక మానరు. రాహుల్ లో చాలా ఛేంజ్ కనిపిస్తోంది. ఓ వైపు ప్రభుత్వాన్ని తనదైన ట్వీట్లతో విమర్శిస్తున్నారు. రాహుల్ ట్వీట్లలో కూడా ఈ మధ్య పదును కనిపిస్తోంది. ఆయన ఈ మధ్య చేసిన ట్వీట్లు ఆలోచింపజేసేలా ఉంటున్నాయి. ట్వీట్ల సంగతి పక్కనపెడితే.. ఆయన ప్రజల్లోకి వెళ్తున్న తీరు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ రాహుల్ పెద్దగా జనాల్లో కనిపించేవారు కాదు. కాని తమిళనాడులో మూడురోజుల పాటు పర్యటించిన రాహుల్ గాంధీలో కొత్త కోణం కనిపిస్తోంది.
గత నెలలో తమిళనాడులో పర్యటించిన రాహుల్ గాంధీ విలేజ్ కిచెన్ టీంతో కలిసి వంట చేశారు. వాళ్లతో సరదాగా గడిపారు. తాజాగా.. ప్రచారాన్ని షురూ చేసిన రాహుల్.. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరితో మమేకమయ్యారు. కేరళలో మత్స్యకారులతో కలిసి సముద్రంలోకి వెళ్లిన రాహుల్ చేపలు పట్టారు. వాళ్లతో కలిసి నడిసముద్రంలో ఈత కొట్టారు. తాజాగా తమిళనాడులో పిల్లలతో భేటీ అయిన యువనేత.. పుష్ అప్స్ ఛాలెంజ్ విసిరారు. వాళ్లతో కలిసి పుష్ అప్స్ తీసారు. ఒంటిచేత్తో పుషప్స్ తీసి ఆశ్చర్యపరిచారు. అంతేకాదు.. పిల్లల కోరికమేరకు డ్యాన్స్ చేశారు. దారి మధ్యలో ఆగి టీ తాగడం.. తాటిముంజలు తినడం.. లాంటివి రాహుల్ ని సరికొత్తగా ఆవిష్కరించాయి.
అన్నిటికీ మించి రాహుల్ ఆహార్యం కూడా మారిపోయింది. గతంలో ఎప్పుడూ కుర్తాపైజామాల్లో కనిపించేవారు. కానీ ఇప్పుడు ఆఫ్ షర్ట్స్ వేస్తున్నారు. ఫార్మల్ ప్యాంట్స్ తో మెరిసిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో టక్ చేస్తూ యూత్ ను ఆకట్టుకుంటున్నారు. కేవలం వైట్ కే పరిమితం కాకుండా కలర్ పుల్ ఆహార్యంతో కట్టిపడేస్తున్నారు రాహుల్. ఈ మధ్య కాలంలో రాహుల్ ను ఎవరు చూసినా.. మనం చూస్తున్నది రాహుల్ గాంధీనేనా అని ఆశ్చర్యపోతున్నారు. అంతలా మారిపోయారు రాహుల్ గాంధీ మరి.













