రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. క్షమాపణ చెప్పేందుకు యువనేత నిరాకరణ..!
రాహుల్ గాంధీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీయే మోదీని నేరుగా టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా అదానీ వ్యవహారంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదానీ- మోదీ సంబంధాలపై చర్చించేందుకు పార్లమెంటులో అవకాశం ఇవ్వకపోవడంతో వారికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ రోజూ సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇది బీజేపీకి పెద్ద సమస్యగా మారింది.
ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే రాహుల్ గాంధీపై నమోదైన ఒక పాత కేసు బయటికొచ్చింది. నాలుగేళ్ల క్రితం ఒక ఎన్నికల ప్రచారంలో మోదీ ఇంటిపేరు పెట్టుకున్న వాళ్లంతా దొంగలే అని రాహుల్ గాంధీ విమర్శించారు. లలిత్ మోదీ, నీరవ్ మోదీ..లను ఉటంకిస్తూ రాహుల్ ఈ కామెంట్స్ చేశారు. అయితే రాహుల్ గాంధీ కామెంట్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పరువు నష్టం దావా వేశారు బీజేపీ నేత. దీనిపై సూరత్ కోర్టులో సుదీర్ఘ విచారణ అనంతరం ఇవాళ తీర్పు వచ్చింది. రాహుల్ గాంధీకి ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పేందుకు నిరాకరించడం వల్లే కోర్టు జైలు శిక్ష విధించిందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. తాను జైలు శిక్షకే మొగ్గు చూపుతానని రాహుల్ చెప్పినట్టు సమాచారం. తన ధర్మం సత్యం, అహింసలపై ఆధారపడిందని ఆయన స్పందించారు. అదానీ-మోదీ వ్యవహారంపై జేపీసీకి రాహుల్ పట్టుబడకపోతే రాహుల్ లండన్లే చేసిన కామెంట్స్ పై క్షమాపణ చెప్పకపోయినా పర్లేదని బీజేపీ రాయబారం పంపిందని.. అయితే అందుకు రాహుల్ గాంధీ నిరాకరించారని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు రాహుల్ కు జైలు శిక్ష విధించడపై ఆప్ అధినేత కేజ్రివాల్ స్పందించారు. తనకు కాంగ్రెస్ పార్టీతో విభేదాలున్నా.. రాహుల్ కు జైలు శిక్ష విధించడం సరికాదన్నారు. బీజేపీ కక్ష సాధింపు చర్యలకు ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదన్నారు. రాహుల్ గాంధీకి జైలు శిక్ష వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. యథాలాపంగా చేసిన కామెంట్స్ ను బీజేపీ జైలు శిక్ష వరకూ తీసుకొచ్చిందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.













