నాడు రాహుల్‌ను చూడొద్దనుకున్నారు.. నేడు ఆయనకే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి..!!
పార్లమెంటు సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మొదట్లో చాలా రోజుల పాటు సెషన్స్ ఎలాంటి చర్చా లేకుండానే ముగిశాయి. అయితే మణిపూర్ అంశంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం.. దాన్ని స్పీకర్ అంగీకరించడంతో విపక్షాలు శాంతించాయి. రేపు అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కానుంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చర్చను ప్రారంభించనున్నారు. రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న అంశాలకు సమాధానం చెప్పలేకే మోదీ ప్రభుత్వం ఆయనపై వేటు వేసి బయటకు పంపిందనే ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ మళ్లీ సభలోకి అడుగు పెట్టారు. ఆయన ప్రశ్నలకు ఇప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నాలుగు నెలలుగా రాహుల్ గాంధీపై జరుగుతున్న హైడ్రామా అందరికి తెలిసింది. మోదీ ఇంటి పేరు కలిగిన వాళ్లే ఎందుకు దొంగలవుతారో.. అనే అర్థం వచ్చేలా రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఈ కామెంట్స్ పై గుజరాత్ బీజేపీ నేత సూరత్ కోర్టులో కేసు పెట్టారు. దీనిపై తీర్పు చెప్పిన కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయనపై అనర్హత వేటు వేసింది లోక్ సభ సెక్రటేరియేట్. దీనిపై ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా ఎదురు దెబ్బ తగిలింది. సుప్రీంకోర్టులో మాత్రం రాహుల్ గాంధీకి ఊరట లభించింది. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. రాహుల్ పై అనర్హత వేటు తొందరపాటు నిర్ణయమని అభిప్రాయపడింది.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీపై అనర్హత వేటును ఎత్తివేసింది లోక్ సభ సెక్రటేరియేట్. దీంతో ఆయన ఇవాళ పార్లమెంటులో అడుగు పెట్టారు. రేపు ప్రారంభం కాబోయే అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీయే చర్చను ప్రారంభిస్తారని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. మణిపూర్ లో రాహుల్ గాంధీ ఇటీవలే పర్యటించారు. ఆయన పర్యటనకు అక్కడ ఆటంకాలు ఎదురయ్యాయి. చివరకు గవర్నర్ ను కలిసి చర్యలు తీసుకోవాలని కోరి వచ్చారు. అక్కడి పరిస్థితులపై రాహుల్ గాంధీపై అవగాహన ఉందని.. అందుకే ఆయన చర్చను ప్రారంభించడమే కరెక్ట్ అని కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో అనేక ప్రశ్నలను మోదీ ప్రభుత్వానికి సంధించారు. రేపు ఇంకెన్ని ప్రశ్నలను లేవనెత్తుతాడోననే ఆసక్తి అందరిలోనూ ఉంది.
రాహుల్ గాంధీ ని పప్పు పప్పు అని విమర్శించిన మోదీ సర్కార్ కు ఇప్పుడు ఆయనే పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఆయన్ను సభలో లేకుండా చేస్తే సమస్య లేకుండా పోతుందని భావించి ఆఘమేఘాలపై ఆయనపై వేటు వేసింది. కానీ ఇప్పుడు మళ్లీ రాహుల్ గాంధీ సభలోకి వచ్చేశారు. పైగా సరిగ్గా అవిశ్వాస తీర్మానంపై చర్చ సమయానికే ఆయన ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ప్రశ్నలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మోదీది. తప్పించుకునే ఛాన్సే లేదు.













