చారిత్రక పర్యటన ..
కాస్మోడ్రోమ్ లో పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ సమావేశం.. ప్రపంచదేశాలను హడలెత్తిస్తోంది. మరీ ముఖ్యంగా అమెరికా , యూరోప్ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించి 560 రోజులు దాటాయి.ఇప్పటివరకూ విజయం సాధించే పరిస్థితులు లేవు . మరోవైపు.. అగ్రదేశమైన అమెరికా, యూరప్ ఆంక్షలతో కునారిల్లుతున్న ఉత్తరకొరియా… ఇప్పుడు రష్యా సాయంకోసం ఆశగా ఎదురుచూస్తోంది. దీంతో ఇరుదేశాల అగ్రనేతల సమావేశంలో ఎలాంటి నిర్ణయాలుంటాయన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
“రష్యా ఒక పవిత్ర యుద్ధం చేస్తోంది. అధ్యక్షుడు పుతిన్, రష్యా నాయకత్వ నిర్ణయాలకు మేం ఎల్లప్పుడూ మద్దతిస్తూనే ఉంటాం. సామ్రాజ్యవాదానికి వ్యతిరేక పోరాటంలో మేం కలిసే ఉంటాం’’ అని కిమ్ వ్యాఖ్యానించారు. అంతకుముందు, వోస్టోచ్నీ సందర్శకుల పుస్తకంలో కిమ్ తన వ్యాఖ్యను రాశారు. “మొదటగా అంతరిక్షాన్ని జయించిన వారికి జన్మనిచ్చిన రష్యన్ మహిళ ఎప్పటికీ అమరురాలు” అని ఆ పుస్తకంలో కిమ్ రాశారు.
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు రష్యాకు దూరమైన వేళ, కిమ్ పుతిన్‌కు మరింత దగ్గరవుతున్నారు.అయితే ఇది వీరిద్దరి మధ్య స్నేహం మాత్రమే కాదు. దీనికి బలమైన భౌగోళిక, రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి.ఈ రెండు దేశాల పరస్పర ప్రయోజనాలు మిళితమై ఉన్నాయి.. ఉక్రెయిన్ యుద్ధంలో అవసరమైన ఫిరంగులు, మందుగుండు సామగ్రిని ఉత్తరకొరియా ..రష్యాకుఅందించే అవకాశముంది. మరోవైపు దశాబ్దాల తరబడి ఆర్థిక ఆంక్షలతో ఉత్తరకొరియా.. తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనికితోడు చమురు, నగదు కొరత కూడా ఉత్తరకొరియాను వేధిస్తోంది.
ఉత్తర కొరియా, రష్యా దేశాలు అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. ఒక రకంగా ఈ రెండు దేశాలు అంతర్జాతీయ ప్రపంచంలో ఒంటరిగా మారాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలకు రష్యా మరింత దూరమైంది. యుద్ధాని కంటే ముందే పశ్చిమ దేశాలకు, రష్యాకు మధ్య దూరం మొదలైంది. 2019లో కిమ్ జోంగ్ ఉన్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య చర్చలు విఫలమయ్యాయి. అప్పటి నుంచి అంతర్జాతీయ ప్రపంచం నుంచి ఉత్తర కొరియా బహిష్కరణకు గురైంది. దీనికి తోడు అణ్వాయుధాలను ప్రయోగిస్తామని హెచ్చరికలు పంపిస్తోంది. ఇది పరిస్థితి మరింత అదుపుతప్పేలా చేసింది.
అమెరికా గత కొన్నేళ్లుగా దక్షిణ కొరియాకు దగ్గరవుతోంది. ఆసియాలో తన సైనిక ఉనికిని పెంచుకుంటోంది. ఇదంతా ఉత్తర కొరియాకు మింగుడు పడని విషయం. నిజానికి పాశ్చాత్య ఆంక్షల తర్వాత చైనాకు దగ్గరవ్వడం రష్యాకు తప్పనిసరిగా మారింది. అదే సమయంలో ఉత్తర కొరియా పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. చైనా మినహా అంతర్జాతీయ ప్రపంచంలో ఉత్తర కొరియాకు మంచి స్నేహితులు లేరు. చైనాపై ఉత్తర కొరియా ఎక్కువగా ఆధారపడుతోంది.













