కమలా అగ్రెసివ్ …ట్రంప్ డిఫెన్సివ్… వాడివేడిగా అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్
ఆరంభంలో షేక్ హ్యాండ్.. ఆవెన్వెంటనే చురకత్తుల్లాంటి విమర్శలు.. పాలనా విధానాలు, వ్యక్తిగత అంశాలపై విమర్శలు.. ఎదుటి వారి విమర్శలకు ధీటైన సమాధానాలు..అబద్దాలు చెప్పేది మీరంటే మీరంటూ.. వాగ్వాదం.. వెరసి 90 నిముషాల పాటు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్.. తమ వాదనలు వినిపించారు.అమెరికా చరిత్రలో బైడెన్‌ను అత్యంత చెత్త అధ్యక్షుడిగా, కమలాను అత్యంత చెత్త ఉపాధ్యక్షురాలిగా ట్రంప్ అభివర్ణించారు. దాంతో ట్రంప్‌పై కమలా హ్యారిస్ ఎదురుదాడికి దిగారు. అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్న డోనల్డ్ ట్రంప్, కమలాహారిస్ మధ్య మొదటి డిబేట్ వాడివేడిగా సాగింది.పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలోగల ‘నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్’ వేదికగా రిపబ్లికన్ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి కమలాహారిస్ కీలక అంశాలపై ఒకరితో ఒకరు దూకుడుగా మాట్లాడారు.
అమెరికాలోకి మళ్లీ టెర్రరిస్టులనీ, నేరస్తులనూ అనుమతించారని.. జో బిడెన్ ప్రభుత్వంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఈ మొదటి టీవీ డిబేట్లో 59 ఏళ్ల కమలా హారిస్.. ట్రంప్‌ని గట్టిగానే ఎదుర్కొన్నారు. మహిళా ఓటర్ల సపోర్ట్ కాస్త ఎక్కువగా కలిగివున్న హారిస్.. సంతానం, అబార్షన్ అంశాలపై ట్రంప్‌ని గట్టిగానే సవాల్ చేశారు. అదే సమయంలో ట్రంప్.. ఆర్థిక వ్యవస్థ, ఇమ్మిగ్రేషన్ అంశాలపై హారిస్‌ని టార్గెట్ చేశారు. వేదికపైకి చేరుకోగానే కమలాహారిస్, ట్రంప్ కరచాలనం చేసుకున్నారు. నాలుగేళ్ల కిందటి కంటే అమెరికన్లు మెరుగ్గా ఉన్నారని నమ్ముతున్నారా అనే తొలి ప్రశ్నకు తొలుత హారిస్ నేరుగా సమాధానమివ్వలేదు. తాను ‘‘అవకాశాల ఆర్థిక వ్యవస్థ’ నిర్మాణానికి యోచిస్తున్నట్టు చెప్పారు. గృహనిర్మాణ వ్యయాన్ని భరించి యువతకు చేయూతనిస్తామన్నారు.ట్రంప్ గతంలోలానే ధనవంతులకు, కార్పొరేట్లకు పన్నులు తగ్గించాలనే యోచనలో ఉన్నారని హారిస్ అన్నారు.
ట్రంప్ కనుక అధికారంలోకొస్తే అమెరికన్లు తాము కొనే నిత్యావసరాలపై ‘ట్రంప్ టాక్స్’ను కట్టాల్సి ఉంటుందని హారిస్ అన్నారు. అయితే.. ఇంతలో ట్రంప్ …వాణిజ్యం, వలసల అంశాన్ని ప్రస్తావించారు.ఇతర దేశాలపై సుంకాలు విధిస్తామని ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన చైనా ప్రస్తావన తెస్తూ తాను అధికారంలో ఉండగా తీసుకున్న చర్యల కారణంగా, చైనా నుంచి సుంకాల రూపంలో భారీ ఆదాయం వచ్చిందని, తాను పదవి నుంచి వైదొలిగిన తరువాత కూడా ఈ పన్నులు వస్తున్నాయని చెప్పారు. అయితే హారిస్ ….ట్రంప్ ఆర్థిక విధానాలను విమర్శించారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ సాధించిన 16మంది ఆర్థికవేత్తలు, ట్రంప్ విధానాలు అమలు చేస్తే వచ్చే ఏడాదికల్లా ఆర్థిక మాంద్యం వస్తుందని నమ్ముతున్నారనే విషయాన్ని ప్రస్తావించారు.‘‘డోనల్డ్ ట్రంప్ వద్ద మీకోసం ఎలాంటి ప్రణాళికా లేదు. మీ కోసం పనిచేయడం కంటే ఆయన తనను తాను రక్షించుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపుతారని’’ హారిస్ ఆరోపించారు. దీనిపై ట్రంప్ గట్టిగా బదులిస్తూ తన విధానాలను ఆర్థికవేత్తలు ‘అద్భుతం’, ‘మంచి పథకాలు ’ అని మెచ్చుకున్నారని చెప్పారు.
తాను మధ్య తరగతి నుంచి వచ్చానని గుర్తు చేశారు కమలా… అమెరికా కమ్యూనిటీ కోసం నా దగ్గర ప్లాన్ ఉంది. స్టార్టప్స్‌పై టాక్స్‌ను తగ్గించే ప్లాన్ నా దగ్గర ఉంది అని కమలా హారిస్ అన్నారు.మన ఎకానమీ భయంకరంగా మారింది. ద్రవ్యోల్బణం పెరిగింది. చరిత్రలో ఇంత దారుణంగా ఎప్పుడూ లేదు. ఇది ప్రజలకు పెద్ద విపత్తు అని డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు.ట్రంప్ వెళ్లిపోతూ.. నిరుద్యోగాన్ని దేశంపై రుద్దారు. దేశం తీవ్రమైన ఆర్థిక మాంద్యం లోకి వెళ్లింది. ప్రజాస్వామ్యంపై దాడి చేశారు. ప్రాజెక్ట్ 2025 అనే ప్రమాదకరమైన ప్లాన్ ప్రజలపై రుద్దాలని ట్రంప్ యత్నిస్తున్నారు. అని హారిస్ ఆరోపించారు.. అలాంటి ప్లాన్ ఏదీ లేదు. నేను తెరచిన పుస్తకాన్ని, నేను ఏం చేస్తానో ప్రజలకు తెలుసు అని ట్రంప్ అన్నారు.
ట్రంప్‌కి ఏ ప్లానూ లేదని కమలా హారిస్ అనడంతో.. హారిస్‌కి కూడా ప్లాన్ లేదనీ, ఆమె, బిడెన్‌ను కాపీ కొడుతోందని ట్రంప్ అన్నారు. కమలా హారిస్ ఒక మార్క్సిస్ట్ అన్న ట్రంప్.. ప్రమాదకరమైన పాలసీతో దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని టార్గెట్ చేశారు. తన హయాంలో అమెరికాలో ద్రవ్యోల్బణం లేదన్నారు ట్రంప్. కరోనా కాలంలోనూ ఆర్థికవ్యవస్థను నిలబెట్టానని గుర్తు చేశారు.బైడన్ అధికారంలోకి వచ్చాక అమెరికా ఆర్థికవ్యవస్థను చైనా చీల్చి చెండాడుతోందన్నారు. కమలా పెద్ద మార్కిస్టన్న ట్రంప్… కమలా-బైడన్ ద్వయం దేశ ఆర్థికవ్యవస్థను నాశనం చేసిందని దుయ్యబట్టారు.ప్రస్తుతం ఆర్థికంగా అన్ని వర్గాలకు విపత్తుగా మారిందని ట్రంప్ ఆరోపించారు. దీనికి హారిస్ సైతం గట్టిగానే కౌంటరిచ్చారు. ఆర్థికవ్యవస్థను ట్రంప్ చిన్నాభిన్నం చేశాడన్నారు. ట్రంప్ హయాంలో దేశం ద్రవ్యలోటు ఎదుర్కొంది.. దాన్ని బైడన్ హయాంలో సరిచేశామన్నారు.అమెరికాను ట్రంప్.. చైనాకు అమ్మేశారని ఆరోపించారు.బిలియనీర్లు, కార్పొరేట్లకు ట్రంప్ పన్నులు తగ్గిస్తారు. ఫలితంగా దేశ ఆర్థికవ్యవస్థకు 5 ట్రిలియన్ డాలర్ల లోటు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు హారిస్. స్టార్టప్ ల కోసం పన్నులు తగ్గించేందుకు తమ వద్ద ప్రణాళిక ఉందన్నారు హారిస్.
అబార్షన్ హక్కులపై ఎవరు ఏమన్నారు?
మోడరేటర్లు అమెరికా ఓటర్లకు ఎంతో కీలకమైన అబార్షన్ హక్కుల అంశాన్ని ప్రస్తావించారు. గతంలో ఈ అంశంపై మిశ్రమస్పందన తెలియజేసిన ట్రంప్‌ను ఈ విషయంపై ఆయన విధానమేమిటో చెప్పాలని అడిగారు. తొమ్మిదో నెలలో కూడా గర్భస్రావానికి అనుమతించాలని డెమొక్రాట్లు కోరుకుంటున్నారని ట్రంప్ చెప్పారు. ఈ విషయంలో వారు "రాడికల్"గా ఉన్నారని ఆయన చెప్పారు..ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ ఎంపిక చేసిన టిమ్ వాల్జ్, తొమ్మిదో నెలలో గర్భస్రావం కోసం వాదించారు.ఈ సమస్యపై నిర్ణయం తీసుకునే విషయాన్ని తిరిగి రాష్ట్రాల పరిధిలోకి తీసుకురావడానికి తాను సహాయపడ్డానని.. అత్యాచారం, అక్రమ సంబంధం కేసుల్లో మినహాయింపులను తాను నమ్ముతానని ట్రంప్ చెప్పారు. ట్రంప్ అధ్యక్షుడు అయితే.. నేషనల్ అబార్షన్ బ్యాన్ పై సంతకం పెడతారు అని కమలా హారిస్ అన్నారు. ఐతే.. ట్రంప్ మాత్రం.. తన వాదనను బలంగా వినిపించారు. తాను సంతకం పెట్టను అన్నారు. ఆ అవసరం లేదు అన్నారు.
ట్రంప్ డిక్టేటర్.. కమలా మార్క్సిస్ట్..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో జో బైడెన్ అనుసరించిన విధానాన్ని మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. తాను ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆ యుద్ధం ముగుస్తుందని నొక్కి చెప్పారు. దీనిపై కమలా హ్యారిస్ స్పందిస్తూ, "ట్రంప్ ఉక్రెయిన్ను రష్యాకు వదిలేస్తారు. వ్లాదిమిర్ పుతిన్ లంచ్‌లో ట్రంప్‌ను మింగేస్తారు" అని చెప్పారు. అటు మిడిల్ ఈస్ట్ సంక్షోభంపై, ఇజ్రాయెల్- పాలస్తీనా సమస్య పరిష్కారానికి హ్యారిస్ మద్దతు పలికారు. అదే సమయంలో ట్రంప్ మాట్లాడుతూ డెమొక్రాట్లు ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తున్నారని అన్నారు. అయితే తాను ఎన్నికైతే యుద్ధాన్ని ముగించేందుకు ఏం చేస్తానో మీరే చూస్తారన్నారు. కమలా హారిస్ ను ట్రంప్ మార్క్సిస్ట్ అని సంభోదించగా.. అతణ్ని డిక్టేటర్ గా ఆమె అభివర్ణించారు.జనవరి 6 నాటి క్యాపిటల్ హిల్స్ అల్లర్ల పై , ట్రంప్ ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదంటూ… కానీ ఆనాటి గందరగోళాన్ని కమలాహారిస్ మరోసారి గుర్తు చేశారు. బైడన్ పాలన వైఫల్యాలపై ట్రంప్ దండెత్తగా.. మీరు పోటీ చేస్తోంది బైడన్ పై కాదు.. తనపై అని కమలా హారిస్ పలుమార్లు గుర్తు చేశారు."స్పష్టంగా చెబుతున్నా నేను జో బైడెన్ కాదు, అలాగే కచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ కాదు. నేను మన దేశానికి అందించేది కొత్త తరం నాయకత్వాన్ని. సాధ్యమయ్యే వాటిని విశ్వసించే వ్యక్తిని. మనం ప్రజలకు ఏమి చేయగలం అనే దానిపై ఆశావాద భావాన్ని కలిగించే వ్యక్తి ఎప్పుడూ అమెరికన్ ప్రజలను కించపరచడం జరగదు" అని ఆమె అన్నారు.
90 నిమిషాల పాటు సాగిన చర్చలో కమలా హారిస్ ట్రంప్‌ను అనేకసార్లు నిలదీశారు. జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి సమయంలో ఆయన వ్యవహరించిన తీరును, , ఆయనపై మాజీ అధికారులు చేసిన విమర్శలను పదేపదే ప్రస్తావించి ఆయన రక్షణాత్మక ధోరణిలో పడేలా చేశారు. చర్చ సాగుతున్న కొద్దీ హారిస్ ట్రంప్‌ను డిఫెన్స్‌లోకి నెట్టేశారు. ఆయనను బలహీనుడని పిలిచారు. విదేశీ నేతలు ఆయనను చూసిన నవ్వుకుంటున్నారన్నారు. ఆయన ర్యాలీలకు వచ్చే ప్రజలు ముందుగానే వెళ్లిపోతున్నారని విమర్శించారు. జులైలో జరిగిన చర్చలో ట్రంప్ ముందు బైడెన్ తేలిపోయిన విషయం తెలిసిందే. కానీ కమలా మాత్రం ఆయనకు దీటుగా బదులిచ్చారు.
ఇక తొలి డిబేట్లో అంతగా ప్రభావం చూపని అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి మధ్యలోనే తప్పుకున్నారు. ఆ రోజు బైడెన్‌పై ట్రంప్ పైచేయి సాధించారు. అదే స్ట్రాటజీతో ఇవాళ్టి చర్చలోనూ హ్యారిస్‌పై ట్రంప్ ఎదురుదాడి చేసినప్పటికీ, ఆమె ఏమాత్రం తగ్గలేదు. నవంబర్‌లో జరగనున్న ఈ ఎన్నికల్లో నల్ల జాతి వారసురాలిగా, దక్షిణాసియా మహిళగా కమలా హారిస్ పోటీ పడుతుంటే.. ఆమెకు గట్టి పోటీ ఇస్తూ.. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిపై కన్నేశారు. తాజా పోల్స్‌లో దేశవ్యాప్తంగా ట్రంప్‌కి 48 శాతం సపోర్ట్ ఉండగా.. హారిస్‌కి 47 శాతం సపోర్ట్ దక్కింది. అందుకే తాజా డిబేట్ కోసం హారిస్.. 5 రోజులపాటూ.. ప్రిపేర్ అయ్యారు. ఐతే.. ఆడియన్స్ లేని ఈ డిబేట్లో ట్రంప్ మాత్రం రిలాక్స్‌గా కనిపించారు.






