కలహించుకుంటూ.. కలసి సాగుతూ..!
అగ్రరాజ్యం అమెరికాలో జిన్ పింగ్ పర్యటన పాక్షికంగా ఫలవంతమైందని చెప్పొచ్చు. అమెరికాలో అడుగుపెట్టిన దగ్గర నుంచి జిన్ పింగ్ .. ద్వైపాక్షిక బంధాలపై ఫోకస్ పెట్టారు. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం విషయంలో అమెరికా, చైనా చెరోపక్షం వహించాయి. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలోనూ ఇదే పరిస్థితి ఉంది. దీనికి తోడు వ్యాపార రంగంలో సైతం అగ్రరాజ్యం అమెరికాను తోసిరాజనే రీతిలో చైనా దూసుకెళ్తోంది. ఈతరుణంలో చైనా .. సరిహద్దు దేశాలతో వైరం విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది. దీంతో చైనా దూకుడును నియంత్రించే పనిలో అమెరికా బిజీబిజీగా మారింది.
ఈ తరుణంలో జిన్ పింగ్.. అమెరికా పర్యటన ఆసక్తి రేపుతోంది. నాలుగు గంటల పాటు బైడెన్ తో భేటీ అయిన జిన్ పింగ్.. పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా అమెరికా, చైనాల మధ్య అత్యున్నత స్థాయి సైనిక సంప్రదింపుల ప్రక్రియను పురుద్ధరించాలని అధ్యక్షులు జో బైడెన్, షీ జిన్పింగ్ నిర్ణయించారు. మాదక ద్రవ్యాల నిరోధంలో పరస్పరం సహకరించుకోవాలని తీర్మానించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న విభేదాలు పరిష్కరించుకోగల స్థాయిలోనే ఉన్నాయని, సంబంధాలు తెగదెంపులు చేసుకునేంత పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. అమెరికా శాన్ఫ్రాన్సిస్కోకు సమీపంలోని వుడ్సైడ్లో జిన్సింగ్.. జో బైడెన్ బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. కలిసి భోజనం చేశారు. అమెరికాతో సంబంధాలను స్థిరీకరించుకోవాలని భేటీ అనంతరం జిన్పింగ్ అభిప్రాయపడ్డారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నియంతే అని తాను ఇప్పటికీ విశ్వసిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. జిన్ పింగ్ తో భేటీ తర్వాత బైడెన్ ఈ కామెంట్లు చేశారు. చైనా అధ్యక్షుల తీరు ఎలా ఉంటుందో అమెరికాకు తెలుసు.. అయితే ఎప్పటికప్పుడు పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు గానూ.. క్షేత్రస్థాయిలో మిలటరీ సంబంధాలను పునరుద్ధరించుకోవడంపై ఇరుదేశాలు దృష్టి పెట్టాయి. మరోవైపు చైనా పరిస్థితి అంతర్జాతీయంగా ఇబ్బందికరంగానే ఉంది.దేశీయంగానూ సమస్యలతో సతమతమవుతోంది. రియల్ ఎస్టేట్ రంగం పతనం అంచున ఉంది. తయారైన ఉత్పత్తులకుమార్కెటింగ్ సమస్యగా మారుతోంది. ఎందుకంటే యూరోపియన్ దేశాలు… చైనా ఉత్పత్తులను తగ్గించుకుంటుున్నాయి. అతిపెద్ద మార్కెట్ కలిగిన భారత్ ను తరచూ చైనా కవ్విస్తుండడంతో… భారత్ సైతం చాలా విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తోంది.
చైనాకు భారత్ ఎక్కడ పోటీగా మారుతుందో అన్న ఆందోళన జిన్ పింగ్ లో ఉంది. దౌత్యరంగంలో భారత విజయాలు చైనాకు కంటగింపుగా మారాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ముఖ్యంగా భారత్-అమెరికా సంబంధాలు మునుపెన్నడూ లేనంతగా బలోపేతమయ్యాయి. భారత్ తో కలసి క్వాడ్రియేట్ కూటమి విన్యాసాలు సైతం చైనాకు నచ్చడం లేదు. ఈతరుణంలో చైనా తన విదేశాంగ నీతికి మరింత పదునుపెట్టడంలో నిమగ్నమైంది.













