PM Modi: ఇలాగైతే కష్టమే.. తెలుగు ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్..!!
భారతీయ జనతా పార్టీలో (BJP) క్రమశిక్షణకు, పనితీరుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్వయంగా ఎంపీల పనితీరుపై నిఘా ఉంచడం, ఎప్పటికప్పుడు వారికి దిశానిర్దేశం చేయడం పరిపాటి. అయితే, తాజాగా ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల (Telugu States) బీజేపీ ఎంపీలకు (BJP MPs) ప్రధాని మోదీ ఇచ్చిన క్లాస్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ పరిస్థితి, ఎంపీల వ్యవహారశైలిపై మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష వైసీపీ, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. అయితే, ఈ విమర్శలను తిప్పికొట్టడంలో బీజేపీ ఎంపీలు, నేతలు పూర్తిగా విఫలమవుతున్నారని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ ఎంపీలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం లేదని ప్రధాని ప్రస్తావించారు. “అధికారంలో ఉన్నాం కదా అని రిలాక్స్ అవుతున్నారా?” అని ప్రశ్నించినట్లు సమాచారం. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం జరుగుతుంటే, కేవలం టీడీపీ నేతలు మాత్రమే కౌంటర్ ఇస్తున్నారని, జనసేన అడపాదడపా స్పందిస్తోందని, కానీ బీజేపీ నేతలు మాత్రం తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరించడం సరికాదని ఆయన హెచ్చరించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న సాయం గురించి ప్రజలకు చెప్పడంలోనూ, విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడంలోనూ దూకుడు పెంచాలని ఆదేశించారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే ప్రధాని మోదీ మరింత ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందన్న వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది తప్ప, బీజేపీ గొంతు ఎక్కడా వినిపించడం లేదు. ఈ అంశాన్నే మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. “తెలంగాణలో అసలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా? ప్రజా సమస్యలపై పోరాటం ఎక్కడ?” అని మోదీ ఎంపీలను నిలదీశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహా మిగిలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కడా కనిపించడం లేదని, కేడర్ మొత్తం స్తబ్దుగా మారిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలోనూ, బయటా ప్రజా సమస్యలపై గళం విప్పడంలో బీజేపీ వెనుకబడిపోయిందని, ఇదే కొనసాగితే పార్టీ ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు.
రాజకీయాల్లో నాయకుడు ఎంత బలంగా ఉన్నా, క్షేత్రస్థాయిలో పనిచేసే టీమ్ లేకపోతే ఫలితాలు రావు. తెలంగాణ ఎంపీలను ఉద్దేశించి మోదీ ఇదే పాయింట్‌ను లేవనెత్తారు. “సమర్థవంతంగా పనిచేయడానికి, ప్రజా సమస్యలను ఎత్తిచూపడానికి మంచి టీమ్‌ను నియమించుకోవడంలో మీకు వచ్చిన సమస్య ఏంటి?” అని ప్రశ్నించారు. ఎంఐఎం అధినేత ఓవైసీ స్థాయిలో కూడా బీజేపీ నేతలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేరని చురకలంటించారు. కేవలం పదవులు అనుభవించడం కాదని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఎంపీలపైనే ఉందని గుర్తుచేశారు.
ప్రధాని మోదీ తాజా హెచ్చరికలు తెలుగు రాష్ట్రాల బీజేపీ శాఖల్లో నెలకొన్న స్తబ్దతకు అద్దం పడుతున్నాయి. ఏపీలో కూటమి ఉన్నప్పటికీ, బీజేపీ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమవుతోంది. వైసీపీని ఎదుర్కోవడంలో టీడీపీపైనే పూర్తిగా ఆధారపడటం వల్ల, భవిష్యత్తులో బీజేపీ కేవలం తోక పార్టీగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అధికారంలోకి వస్తామన్న ధీమా నుంచి, ఇప్పుడు కనీసం ఉనికిని కాపాడుకునే స్థాయికి పార్టీ పడిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పోరాడటంలో బీజేపీ విఫలమైతే, ఆ స్పేస్‌ను బీఆర్ఎస్ పూర్తిగా ఆక్రమించేస్తుంది. అదే జరిగితే బీజేపీకి తెలంగాణలో భవిష్యత్తు ప్రశ్నార్థకమే.
మొత్తానికి ప్రధాని మోదీ క్లాస్ పీకడంతోనైనా బీజేపీ ఎంపీలు నిద్రలేస్తారా? సోషల్ మీడియాలో, ప్రజా క్షేత్రంలో దూకుడు పెంచుతారా? లేక పాత పద్ధతిలోనే సాగుతారా? అన్నది వేచి చూడాలి. రాబోయే రోజుల్లో వారి పనితీరులో మార్పు రాకపోతే, అధిష్టానం నుంచి మరింత కఠిన చర్యలు తప్పకపోవచ్చు.






