దక్షిణాదిపై కమలం కన్ను..
దేశంలో దక్షిణాది రాష్ట్రాలు కమలం పార్టీకి అందని ద్రాక్షలా మారాయి. ఉన్న ఒక్క రాష్ట్రం కర్నాటకలోనూ పార్టీ ఓటమి చవిచూసింది. దీంతో ఈసారి దక్షిణాదిలో తగినన్ని సీట్లు సంపాదించాలన్న థ్యేయం.. బీజేపీ హైకమాండ్ లో కనిపిస్తోంది. అందుకే వరుసగా దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రమంత్రులు, అగ్రనేతలు పరుగులు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో అయితే అధికార బీఆర్ఎస్ ను నేరుగా టార్గెట్ చేస్తున్నారు. తమిళనాడులో ఎన్నికలను ఎదుర్కొనేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు.
ఈసారి బీజేపీకి ఉత్తరాదిలో ఎంపీసీట్లు కొంతవరకూ తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆసీట్లను దక్షిణాది నుంచి పూరించాలన్నది బీజేపీ ఆలోచనగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిలో భాగంగా తమిళనాడుపై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.. నూతన పార్లమెంటులో సెంగోల్ ప్రతిష్టాపన సమయంలో అమిత్ షా.. తమిళనాడు పూర్వపరంపర గురించి గొప్పగా ప్రస్తావించారు. అప్పుడే షా వ్యాఖ్యలపై చర్చ జరిగింది. ఇప్పటివరకూ తమిళనాడులో డీఎంకే,అన్నాడీఎంకే మధ్య పోటీ ఉండేది. జయలలిత మృతి తర్వాత ఆస్థానాన్ని పూరించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నా.. అది సాధ్యం కావడం లేదు. లోకల్ బీజేపీ నేతలతో పని కాకపోవడంతో.. నేరుగా ప్రధాని మోడీనే రంగంలోకి దింపాలని కమలం పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోడీని…తమిళనాడులోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రం రామేశ్వరం నుంచి పోటీ చేయించాలని బీజేపీ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. తమిళనాడు బీజేపీ వర్గాలు సైతం దీనిపై తమకు స్పష్టమైన సంకేతాలు అందినట్లు చెబుతున్నాయి. ప్రధాని మోడీ ఈసారి రామేశ్వరం నుంచి పోటీ చేస్తారని.. దీంతో తమిళ ఓటర్ల ఆలోచనల్లో మార్పు వస్తుందని కమలం నేతలు భావిస్తున్నారు. దీనికి తోడు మోడీ పోటీ చేసే పరిస్థితి వస్తే.. ముందుగానే ఆర్ఎస్ఎస్, అనుబంధ సంఘాలు రంగంలోకి దిగి పరిస్థితులు చక్కదిద్దడం కామన్ గావస్తోంది. ఫలితంగా క్షేత్రస్థాయిలోనూ అనుకూల వాతావరణం ఏర్పడుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
గత ఎన్నికల్లో వారాణసీ నుంచి పోటీ చేసిన మోడీ…ఈసారి కాశీతోపాటు రామేశ్వరంలోనూ పోటీ చేయాలని భావిస్తున్నారు. స్వయంగా ప్రధానే ఇక్కడి నుంచి పోటీ చేస్తే, ఆ ప్రభావం ఓటర్లపై పడటంతోపాటు, తమ పార్టీ అభ్యర్థుల్లోనూ ఉత్సాహం కలుగుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మోడీ రెండు చోట్లా విజయం సాధించడం ఖాయమని ఆ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత వారాణసీ నియోజకవర్గానికి మోడీ రాజీనామా చేస్తారంటున్నాయి.













