గాజా ‘ఆక్రందన’..
ఇజ్రాయెల్ ప్రతిదాడులతో గాజా వణికిపోతోంది. భీకర దాడుల్లో ఇప్పటివరకు 1200 మంది ప్రాణాలు కోల్పోగా గాయపడిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. క్షతగాత్రులతో అక్కడి ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటికే విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోవడం, ఇంధనం, ఆహారం, ఇతర అత్యవసర వస్తువుల సరఫరా కూడా ఆగిపోయింది. ఈ క్రమంలో గాజాలో ఆరోగ్య వ్యవస్థ పతనం అంచుకు చేరుకుందని పాలస్తీనా ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
‘గాజా ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. ఆసుపత్రి పడకలన్నీ రోగులతో నిండిపోయాయి. అత్యవసర చికిత్స కోసం కొత్తగా వచ్చే రోగులకు ఇక్కడ చోటే లేదు’ అని పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అష్రాఫ్ ఆల్ఖద్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో పడకల కంటే కొత్తగా వస్తున్న రోగుల సంఖ్య భారీగా ఉందన్నారు. నెల రోజులకు సరిపోయే ఔషధాలు, వైద్య సదుపాయాలు ఒక్క రోజులోనే ఖాళీ అవుతున్నాయన్నారు. గాజాలో ఆసుపత్రులకు సంబంధించి అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ కూడా ఇదేవిధంగా స్పందించింది. ఆసుపత్రులకు విద్యుత్ నిలిచిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆసుపత్రులే మార్చురీలుగా మారే ప్రమాదం ఉందని పేర్కొంది. ఒకవేళ సరిహద్దులు తెరవకుంటే.. గాజా ఆరోగ్య వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుందని హెచ్చరించింది.
ఇజ్రాయెల్ దళాలు గాజాను పూర్తిగా దిగ్బంధం చేయడంతో .. ఇంధనం, ఔషధాలు, ఇతర వస్తువుల రవాణా నిలిచిపోయింది. ఇంధనం లేకపోవడంతో జనరేటర్ల మీదే ఆధారపడిన ఇళ్లతోపాటు ఆసుపత్రులకు సవాలుగా మారింది. ముఖ్యంగా వెంటిలేటర్లపై ఉండే రోగులు, ఇంక్యుబేషన్లో ఉండే చిన్నారులు, కిడ్నీ రోగులకు చేసే డయాలసిస్ వంటి అత్యవసర విభాగాలకు ముప్పు ఏర్పడింది. ప్రస్తుతం అక్కడి ఆసుపత్రులకు రోజుకు 3, 4 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అందుతున్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో ఇంధనం నిలిచిపోతే అత్యవసర చికిత్స తీసుకునే రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయమని స్థానిక వైద్యులతోపాటు అంతర్జాతీయ సేవా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి..
గాజాపై జరుగుతోన్న భీకర దాడుల్లో ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు వేల మంది గాయాల బారిన పడుతున్నారు. వీరికి చికిత్స అందించేందుకుగాను క్షేత్ర స్థాయి ఆసుపత్రులను ఏర్పాటు చేయడంలో సాయం చేయాలని పాలస్తీనా ఆరోగ్యశాఖ అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. ఆపరేషన్ థియేటర్లు, ఎమర్జెన్సీ వార్డులు, ఐసీయూలు, వైద్య పరికరాలతోపాటు ఔషధాలను అందించాలని ఆరోగ్య మంత్రి డాక్టర్ మాయ్ అల్ కైలా వేడుకున్నారు. లేదంటే గాజా .. ఓస్మశానంగా మారిపోయే ప్రమాదముందన్నారు.













