మంత్రి గారి మీదనే ఆశలుపెట్టుకున్న కేసీఆర్… తీరానికి చేరుస్తారా…?
ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయం సాధించాలి. లేకపోతే మాత్రం ఇబ్బందికర పరిణామాలు చాలా ఉంటాయి. ఇప్పటి వరకు చూసి చూడనట్టు వ్యవహరించిన బిజెపి అధిష్టానం కూడా ఈ బ్యాలెట్ తో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల మీద చాలా ఫోకస్ చేసింది. దుబ్బాక తర్వాత స్పీడ్ పెంచిన బిజెపి ఈ ఎన్నికల కోసం గట్టిగానే వ్యూహాలు సిద్దం చేసింది. ప్రభుత్వ లోపాల కంటే కూడా పార్టీ లోపాల మీద ఎక్కువగా దృష్టి సారించింది. పార్టీ సమస్యలతో తెరాస సతమవుతుంది అనే విషయాన్ని బిజెపి గ్రహించింది.
ప్రధానంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలలో తెరాసకు చాలా సమస్యలు ఉన్నాయి. వరంగల్ మినహా ఖమ్మం, నల్గొండలో కాంగ్రెస్, వామపక్షాలు చాలా బలంగా ఉన్నాయి. కాని ఈ రెండు జిల్లాలో తెరాస మాత్రం సమర్ధవంతంగా అడుగులు వేయలేకపోతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నేతల మధ్య ఉన్న విభేదాలను పరిక్షరించుకోవడం లేదు అని అంటున్నారు. నేతకో వర్గం ఈ రెండు జిల్లాల్లో ఉందని అంటూ ఉంటారు. తుమ్మల నాగేశ్వరరావు గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటున్నారు.
పువ్వాడ మంత్రి కావడం, నామా ఎంపీ కావడంతో జిల్లాలో తుమ్మలకు ప్రాధాన్యత లేదనే భావన చాలా మందిలో ఉంది. ఆయనతో పాటుగా మరికొంత మంది స్థానిక నేతలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి కూడా ప్రశాంతంగా రాజకీయం చేయడం లేదు. ఆయనకు తుమ్మలకు, నామాకు, పువ్వాడకు మధ్య గ్యాప్ ఉందనే మాటలు వినపడుతూ ఉంటాయి. దీనితో కొందరు ప్రతిపక్షాలకు సహకారం అందిస్తున్నారు. మరికొందరు సొంత వ్యాపారాలు చేసుకుంటూ హైదరాబాద్ లో ఉంటున్నారు.
ఇప్పుడు ఇదే ఇక్కడ పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర రెడ్డికి ప్రధాన సమస్య అయింది. పల్లా గెలుపుకోసం… ఖమ్మంలో నల్గొండ జిల్లా నుంచి వచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు గాని ఖమ్మం నేతలు ఆసక్తి చూపించడం లేదు. నల్గొండ జిల్లాలో ఉన్న సమస్యలు కూడా పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. ఎవరికి వారుగా వింత వింత కార్యక్రమాలు పెట్టుకుని పార్టీకి తలనొప్పి అయ్యారు. ఒకవేళ పల్లా ఓడిపోతే మాత్రం ఇబ్బందికర రాజకీయాలు ఉంటాయి. అందుకే సిఎం కేసీఆర్ కూడా ఇప్పుడు ఉమ్మడి జిల్లాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు.
అయితే మంత్రి పువ్వాడ అజయ్ మాత్రం అభివృద్ధి ఎక్కువగా చేయడం తెరాసకు ఈ రెండు జిల్లాల్లో కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవాలి. ఖమ్మం జిల్లాను తుమ్మల తర్వాత ఆ రేంజ్ లో అభివృద్ధి చేస్తుంది పువ్వాడ మాత్రమే. దీనితో ఇప్పుడు పల్లా… ఆయన మీదనే ఆశలుపెట్టుకున్నారు. మరి ఎంత వరకు విజయతీరాలకు తెరాస వెళ్తుందో చూడాలి.













