అధికారానికి మార్గం..?
పాకిస్తాన్ లో మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో.. ఆదేశపాలకులకు ఓ అడ్డంకి తొలగిపోయిందా..? ప్రధాన పోటీదారు తొలగిపోవడంతో .. పాక్ అధికార కూటమిలో సంతోషం వ్యక్తమవుతోంది. ఇక వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లాలని పాక్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సమయంలో ఎన్నికలకు వెళితే, అధికారం సాధించడం తథ్యమన్న భావనలో ప్రస్తుత ప్రభుత్వముంది. ఇందులో భాగంగా మాజీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ కు తిరిగి స్వదేశం రావడానికి వీలు కల్పించేలా చర్యలు తీసుకుంది.మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే నవాజ్ షరీఫ్.. ప్రధాని అవుతారని ఇప్పటికే షెహబాజ్ ప్రకటించారు కూడా.
తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీకి క్రమంగా ప్రజాదరణ పెరుగుతోంది. ప్రజల్లో ఇమ్రాన్ పై సానుభూతి పెల్లుబుకుతోంది. ఇలాంటి సమయంలో ప్రధాని పదవికి ఇమ్రాన్ రేసులో ఉంటే.. కచ్చితంగా అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది . దీనికి తోడు ఇమ్రాన్ ఖాన్.. ఆ దేశ సైన్యంపై పదేపదే విమర్శలు చేస్తూ వచ్చారు. ఫలితంగా సైన్యం సైతం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. అవకాశం రావడంతో.. ఇమ్రాన్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించింది.
ఇప్పుడు మళ్లీ షెహబాజ్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే.. పాక్ సైన్యానికి ఫ్రీడమ్ ఉంటుంది. అక్కడి బలమైన సైన్యం నేరుగా పాలనలో జోక్యం చేసుకుని పాలించిన రోజులున్నాయి. కానీ ఇప్పటి పరిస్థితుల్లో సైన్యమే అధికారం చలయిస్తామంటే .. ఇతర దేశాలు , ముఖ్యంగా అమెరికా నుంచి పూర్తిగా సహకారం ఆగిపోయే పరిస్థితి ఉంది . అందుకే కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించి, తాము కింగ్ మేకర్లుగా అధికారం చలాయించాలన్నది పాక్ ఆర్మీ వ్యూహంగా కనిపిస్తోంది.
అయితే పాకిస్తాన్ ఇప్పుడు పూర్తిగా దివాళా తీసిన పరిస్థితిలో ఉంది. అప్పు చేస్తే కాని పూటగడవని పరిస్థితి. మిత్రదేశాలు దేహి అంటే యాచకుల్లా చూస్తున్నాయి. ఇప్పటికే రుణాల కోసం అంతర్జాతీయ సంస్థలను పాకిస్తాన్ ఆశ్రయిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం అంటే చాలా కష్టమైన ప్రక్రియ. ఎన్నికలకు కోట్లాది రూపాయలు ఖర్చవుతాయి. మరి అంత డబ్బు సమకూర్చుకోవడం ఎలా సాధ్యం?ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో ఎన్నికలకు అంత డబ్బు వృధా చేయగలదా? చేయకుండా ఉండడం ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకం. మరి పాకిస్తాన్ సర్కార్ ఏం చేస్తుంది?













