వ్యాక్సిన్ వృథాకు చెక్ పెట్టేందుకు కేంద్రం సూపర్ ప్లాన్!
కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. పరీక్షలు సకాలానికి చేయట్లేదు. రిపోర్టులు వెంటనే రావట్లేదు. ఓ వైపు మరోవైపు ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నాయి. వ్యాక్సినే ఇప్పుడు కోవిడ్ కట్టడికి అస్త్రంగా మారింది. వ్యాక్సిన్లు పెద్దఎత్తున ఉత్పత్తి అవుతున్నా వాటికి ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. వ్యాక్సిన్ల కోసం జనం ఎదురుచూపులు చూస్తున్నారు. అదే సమయంలో వ్యాక్సిన్ల వృథా అవుతుండడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంద.
దేశంలో లక్షల సంఖ్యలో వ్యాక్సిన్ డోసులు వృథా అయ్యాయి. ఆర్టీఐ సమాచారం ప్రకారం దేశంలో దాదాపు 45 లక్షల వ్యాక్సిన్ డోసులు వేస్ట్ అయ్యాయి. ఇప్పుడు దాని ప్రభావం పలు రాష్ట్రాలపై పడనుంది. మే ఒకటి నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, వ్యాక్సిన్లు మాత్రం ఆయా రాష్ట్రాలే సమకూర్చుకోవలసి ఉంటుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వేస్టేజ్ ఎక్కువగా ఉన్నందున వాటికి కేటాయించిన వాటాలో కొంత మేరకు కోత పడవచ్చని తెలుస్తోంది.
వ్యాక్సిన్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని వృథా చేస్తుండడంపై కేంద్రం సీరియస్ గా ఉంది. అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగించిన రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. అలాంటి రాష్ట్రాలకు మరింత ప్రోత్సహించేలా ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. 50 శాతం వ్యాక్సిన్లు రాష్ట్రాలకు అందుబాటులో ఉంచనున్నారు.
వ్యాక్సిన్ వృథా చేసిన రాష్ట్రాల్లో అసోం ముందుంది. ఇక్కడ 9.6 శాతం వృథా అయ్యాయి. ఆ తర్వాత 8.4 శాతంతో మణిపూర్ నిలిచింది. తమిళనాడు, హర్యానా, బిహార్, రాజస్థాన్‌లలో 6 శాతం వ్యాక్సిన్ డోసులు వృథా అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో 5 శాతానికి పైగా డోసులు వృథా అయినట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్, కేరళ, మిజోరం, గోవా రాష్ట్రాల్లో జీరో వేస్టేజ్‌తో వ్యాక్సినేషన్ కార్యక్రమం సక్రమంగా సాగింది.
కేంద్ర ప్రభుత్వ కొత్త వ్యాక్సిన్ పాలసీ తీసుకొచ్చింది. దీనిప ప్రకారం వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు నెలవారీ ఉత్పత్తిలో 50 శాతం కేంద్రానికి అందించాలి. మిగిలిన 50 శాతం ఆ కంపెనీలు రాష్ట్రాలకు, ఓపెన్ మార్కెట్లకు పంపిణీ చేసుకునేందుకు వీలు కల్పించింది కేంద్రం. ముందుగానే ధరను నిర్ణయించి, ప్రకటించిన తర్వాత రాష్ట్రాలకు పంపవచ్చు. తన వద్ద ఉన్న 50 శాతం వ్యాక్సిన్ నిల్వలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అక్కడ ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య, పనితీరు వేగవంతమైన ప్రక్రియ ఆధారంగా కేంద్రం సరఫరా చేస్తుంది. ఆ రెండు అంశాలతో పాటు గతంలో జరిగిన వ్యాక్సిన్ వృథాను సైతం పరిగణనలోకి తీసుకోనుంది. వ్యాక్సిన్లను ఎక్కువగా వృథా చేసే రాష్ట్రాలకు ప్రాధాన్యం తగ్గించనుంది. అలాగైనా వృథాను అరికడతారనేది కేంద్రం నమ్మకం.













