సాయం సరే.. పంపిణీ కత్తి మీద సామే..!

భారత్‌లో కరోనా సునామీ సృష్టిస్తోంది. దీంతో భారత్ ను ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయి. తమకు తోచిన మేర సాయమందిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల నుంచి అవసరమైన వైద్య పరికరాలు, ఔషధాలు, మెడికల్ కిట్లు.. భారత్‌కు చేరుకుంటున్నాయి. రేపోమాపో మరిన్ని దేశాల సామాగ్రి భారత్ చేరుకోనుంది. పలు రాష్ట్రాల్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్, అత్యవసర మందులు దొరక్క ఇబ్బంది పడుతున్నాయి. అయితే పలు దేశాల నుంచి వైద్య సామాగ్రి పెద్దఎత్తున వస్తోంది. దీన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయడం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది.
విదేశాల్లో ఉన్న భారత రాయబారులు దేశానికి అత్యవసరమైన పరికరాలను సమకూర్చి, పంపించే పనిలో ఉన్నారు. మరోపక్క దేశీయ యంత్రాంగం అవసరమైన పరికరాలు, ఔషధాలు సేకరించేందుకు పని చేస్తున్నాయి. ఇందుకోసం పెద్ద యంత్రాంగమే రంగంలోకి దిగింది. గత ఏడాది తొలి లాక్‌డౌన్ ప్రారంభంలో మహమ్మారిని ఎదుర్కోవడానికి 11 సాధికారిక ప్యానెళ్లు ఏర్పడ్డాయి. వాటిని ఐదు చిన్న గ్రూపులుగా ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థల సమన్వయంతో దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన సాయాన్ని వెంటనే పంపించడమే ఈ గ్రూపుల లక్ష్యం. సరుకు వచ్చిన తర్వాత ఆ సమాచారం ప్రధాన కమిటీకి అందిస్తారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో సంప్రదించి వాటిని పంపణీ చేస్తారు. సరఫరా వ్యవహారాలను రహదారి, రవాణా మంత్రిత్వ శాఖ చూసుకుంటుంది. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ నేతృత్వంలోని అధికారుల కమిటీ విదేశీ సహాయాన్ని సమన్వయం చేస్తుంది.
అయితే ఇప్పుడు మాత్రం విదేశాల నుంచి మన దేశానికి వస్తున్న మెజారిటీ వనరులను ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్న పరికరాలను కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అత్యంత వేగంగా క్లియర్ చేస్తోంది. ఆరోగ్య, వాణిజ్యం, రవాణా, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలతో పాటు పలు శాఖలు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగనున్నాయి. వైద్య వనరులు, ముఖ్యంగా ఆక్సిజన్ లభ్యతను నిర్ధారించడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ నేతృత్వంలో కీలక ప్యానెల్ పని చేస్తుంది. విదేశాల నుంచి అందిన సామగ్రిలో ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆస్పత్రులకు, కేంద్రాలకు వెళ్తున్నాయి. రాష్ట్రాల్లో అవసరాలను బట్టి.. విదేశాల నుంచి వచ్చిన పరికరాలను ప్రాధాన్యత క్రమంలో పంపిస్తోంది.
దేశంలో ఆక్సిజన్ కొరత ఉన్నందున, వివిధ ప్రాంతాలకు ఆక్సిజన్ చేర్చేందుకు 10 మిలియన్ టన్నులు, 20 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న 20 క్రయోజెనిక్ ట్యాంకర్లను దిగుమతి చేసుకుంది కేంద్రం. వాటిని ఆక్సిజన్ కొరత ఉన్న రాష్ట్రాలకు పంపించింది. తూర్పు ప్రాంతం నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించి, ఆక్సిజన్ రవాణాను పెంచేందుకే ఈ ట్యాంకర్లను కేంద్రం దిగుమతి చేసుకుంది. ఓవరాల్ గా దేశంలో కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అన్ని స్థాయిల్లోని అధికార యంత్రాంగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.