విపక్ష కూటమి దిశగా…
విపక్ష ఐక్యతా ప్రయత్నాలు జోరందుకున్నాయి. బెంగుళూరులో జరిగే విపక్షాల ఐక్యతా సమావేశానికి … బీజేపీ వ్యతిరేక పార్టీలకు ఆహ్వానాలు సైతం వెళ్లాయి. ఎక్కడికక్కడ ఎన్డీయే పక్షాలను దెబ్బతీసే వ్యూహాలపై ఇందులో చర్చించనున్నారు. అయితే… పోటీ ఎలా ఉండనుంది..? అవసరాన్ని బట్టి ముందుకెళా వెళ్లాలి అన్న అంశానికి సంబంధించి రూట్ మ్యాప్ సైతం ప్రిపేర్ చేసేపనిలో విపక్షాలున్నట్లు తెలుస్తోంది.
కాగా, కొత్తగా రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ (ఎం), విడుదలై చిరుతైగళ్ కట్చి, మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కళగం, కేరళ కాంగ్రెస్ (జె), ఫార్వార్డ్ బ్లాక్ పార్టీలు విపక్షాల ఐక్యతా సమావేశానికి మద్దతు ప్రకటించాయి. దీంతో బెంగళూరు సమావేశంలో 24కు పైగా పార్టీలు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇచ్చిన ఆహ్వానం మేరకు విపక్షాల ఐక్యతా సమావేశంలో తాము పాల్గొంటున్నట్టు నితీష్ కుమార్, తేజస్వి యాదవ్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, జయంత్ జౌదరి, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, సంజయ్ రౌత్, లలన్ సింగ్, మనోజ్ ఝా, సీతారాం ఏచూరి, డి.రాజా, ఎన్.కె.ప్రేమ్‌చంద్రన్ ఇప్పటికే ప్రకటించారు.
ఢిల్లీ ఆర్డినెన్స్ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ తీరుపై గుర్రుగా ఉన్న ఆప్ అధినేత కేజ్రీవాల్.. ఈసమావేశానికి హాజరుపై ఇంకా క్లారిటీ లేదు. అయితే కేజ్రీవాల్ హాజరవుతారని ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో ఆప్ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆపార్టీ నేతలపై కాంగ్రెస్ సైతం విరుచుకుపడుతోంది. లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ సహచరులు అరెస్టైన సంగతిని గుర్తు చేస్తోంది. దీంతో ఆప్ – కాంగ్రెస్ విబేధాలు కూటమి ఏర్పాట్లపై ప్రభావం చూపించకూడదని విపక్షాలు భావిస్తున్నాయి.
విపక్షాల తొలి సమావేశం ఇటీవల బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో పాట్నాలో జరిగింది. 16 పార్టీలకు చెందిన 32 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో కేజ్రీవాల్ పాల్గొన్నప్పటికీ సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొనలేదు. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్న కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ నుంచి స్పష్టమైన హామీ రాలేదు. విపక్షాల ఐక్యతా సమావేశం ఉద్దేశం వేరని, ఆర్డినెన్స్‌పై డిబేట్ కోసం ఉద్దేశించినది కాదని కాంగ్రెస్ ప్రకటించింది. పార్లమెంటు సమావేశాల్లో ఆర్డినెన్స్‌ను బిల్లుకు తెచ్చే సమయంలో పార్టీ వైఖరి ప్రకటిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో బెంగళూరులో జరుగనున్న విపక్షాల రెండో సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.













