లాక్ డౌన్ కు సరిగ్గా ఏడాది..! మళ్లీ తప్పదా..?
గతేడాది కరోనా మిగిల్చిన విషాదం అంతాఇంతా కాదు. ఆ మహమ్మారి వల్ల ప్రపంచమంతా స్తంభించిపోయింది. దాదాపు అన్ని దేశాలూ లాక్ డౌన్ విధించి ప్రజలను ఇళ్లకే పరిమితం చేశాయి. భారత్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు భారత్ జనతా కర్ఫ్యూ విధించింది. చైనాలోని వుహాన్ లో 2019 డిసెంబర్ లో ప్రారంభమైన ఈ మహమ్మారి క్రమంగా ఆ దేశం దాటి ప్రపంచానికి పాకడం మొదలుపెట్టింది. మన దేశంలో జనవరి చివరి నాటికి విస్తరించింది. ఆ తర్వాత క్రమంగా ఉధృతి పెరగడం ప్రారంభమైంది. మహమ్మారి ఉధృతి మరింత పెరుగుతోందని భావించిన కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది.
సరిగ్గా మార్చి 22న ప్రధాని నరేంద్రమోదీ జనతా కర్ఫ్యూ ప్రకటించారు. వైరస్ ను కట్టడి చేయాలని.. ఆ లింక్ ను కట్ చేయకపోతే మరింత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఒక్కరోజు పాటు ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని కోరారు. అంతేకాక.. సాయంత్రంపూట బయటకు వచ్చి వైద్యులకు సంఘీభావంగా చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చారు. అప్పటివరకూ సందడి సందడిగా కనిపించిన దేశం.. ఆ ఒక్కరోజు పూర్తిగా ఇంటికే పరిమితమైపోయింది. దేశం మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని దేశం చూడలేదు.
అయితే ఆ లాక్ డౌన్ ఆ ఒక్కరోజుకే పరిమితమవుతుందని చాలా మంది అంచనా వేశారు. కానీ కేసుల ఉధృతి అమాంతంగా పెరిగిపోతుండడంతో కేంద్రం కఠిన నిర్ణయం తీసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. మార్చి 23 నుంచి దేశమంతా నిరవధిక లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. దీంతో దేశ, రాష్ట్రాల మధ్య సరిహద్దులు కూడా క్లోజ్ అయ్యాయి. ఎక్కడివాళ్లక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వలస కూలీలకు ఉన్న చోట పని లేక.. సొంతూళ్లకు వెళ్లలేక అనేక అవస్థలు పడ్డారు. కొంతమంది కిలోమీటర్ల కొద్దీ చంటిపిల్లలను ఎత్తుకుని సొంతూళ్లకు ప్రయాణం సాగించారు. వారి బాధలు వర్ణనాతీతం.
అలా మొదలైన లాక్ డౌన్ 70 రోజుల పాటు కొనసాగింది. జూన్ 1 వరకూ అనేక ఆంక్షలు కొనసాగాయి. అయితే ఆ తర్వాత క్రమంగా పాక్షిక సడలింపులు ఇవ్వడం మొదలుపెట్టింది ప్రభుత్వం. ఇలాంటి మహమ్మారులను గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదు. పైగా మన దేశంలో వైద్యసదుపాయాలు కూడా అంతంతమాత్రమే. జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు లేవు. అయినా వైద్యసిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది తమ ప్రాణాలను అడ్డుపెట్టి దేశాన్ని కాపాడారు. కొంతమంది నెలల తరబడి ఇళ్లకు కూడా వెళ్లకుండా సేవలందించారు. పిల్లలకు, కుటుంబానికి దూరంగా ఉంటూ సేవ చేశారు.
ఏడాది దాటినా ఈ మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పట్లో దీని నుంచి విముక్తి పొందే సూచనలు కూడా కనిపించట్లేదు. దాదాపు తగ్గిపోయిందని అనుకుంటున్న సమయంలో మళ్లీ కేసులు భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మరోసారి లాక్ డౌన్ తప్పదేమోననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రజలు తప్పనిసరిగా భౌతికదూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచిస్తోంది. లేకుంటే ఈ చైన్ ను తెంచడం సాధ్యం కాదని చెప్తోంది. అయితే వ్యాక్సీన్ అందుబాటులోకి రావడం.. గతంతో పోల్చితే వైద్యసదుపాయాలు మెరుగుపడడం.. వైరస్ మరణాల రేటు భారీగా పడిపోవడం కాస్త ఊరట కలిగించే అంశాలు.













