పంజాబ్‌లో కమలానికి ఎదురీతేనా..?
ఎంత ప్రయత్నించినా పంజాబ్ చిక్కడం లేదు. ఢిల్లీలోనే కాదు, పంజాబ్‌లోనూ ఆప్ కొరకరాని కొయ్యలా మారింది. దీనికితోడు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు కమలానికి కొరుకుడు పడడంలేదు. దీంతో శిరోమణి అకాలీదల్‌తో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుదామని భావించింది. కానీ అక్కడా చర్చలు సానుకూలంగా సాగలేదు. దీంతో పంజాబ్‌లో ఈసారి బీజేపీ ఒంటరిపోరుకు సిద్ధమైంది. ఇదే విషయాన్ని బీజేపీ స్పష్టంగా ప్రకటించింది.
13 లోక్‌సభ స్థానాలున్న పంజాబ్‌లో ఈసారి చతుర్ముఖ పోటీ నెలకొంది. ఓవైపు అధికార ఆప్.. అత్యధిక లోక్‌సభ సీట్లలో గెల్చి సత్తా చాటాలని భావిస్తోంది. ముఖ్యంగా పార్టీ చీఫ్ కేజ్రీవాల్ అరెస్టు కావడంతో ఆప్ సంక్షోభంలో పడింది. ఈసారి ఎన్నికల్లో ఎలగైనా గెల్చి, ఆప్ బలహీనం కాలేదని నిరూపించాలన్నది ఆపార్టీ థ్యేయంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత… అక్కడ ఢిల్లీ తరహా పాలనా విధానాలు అవలంభిస్తోంది. ప్రధానంగా స్కూల్స్, ఆస్పత్రులను బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.
మరోవైపు శిరోమణి అకాళీదళ్‌తో పొత్తుతో పంజాబ్‌లో సీట్లు గెలుద్దామని భావించిన బీజేపీకి…. అక్కడ చుక్కెదురైంది. బీజేపీ అధికంగా సీట్లు డిమాండ్ చేస్తుండడంతో.. పొత్తు చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈదఫా ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. 1996 నుంచి ప్రతి ఎన్నికల్లో ఎస్ఏడీ, బీజేపీ కలిసి పోటీ చేస్తూ వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో చెరో రెండు ఎంపీ స్థానాల్ని గెలుచుకున్నాయి. మోదీ సర్కార్ తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాలకు నిరసనగా, ఎన్డీయే కూటమి నుంచి శిరోమణి అకాలీదళ్ 2020 సెప్టెంబర్‌లో బయటకు వచ్చింది.
ముఖ్యంగా వివాదాస్పద సాగుచట్టాలు బీజేపీకి సమస్యాత్మకంగా మారాయి. ఢిల్లీలో ఏడాదిపాటు ఆందోళనలు చేసింది కూడా రైతులు ఈచట్టాలకు వ్యతిరేకంగానే. ఇప్పుడు కూడా వివాదాస్పద చట్టాలు, ఎంఎస్‌పీలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈసారి కూడా పంజాబ్‌లో పెద్దగా స్థానాలు దక్కే అవకాశం లేదన్నది బీజేపీనేతల అంతర్గత టాక్. ఏడు దశల్లో తలపెట్టిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి దశలో అంటే జూన్ 1న ఈ రాష్ట్రంలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.













