నితీష్ రూటే సెపరేటు..
ఆయారాం.. గయారాం పాలిటిక్స్..
నితీష్ కుమార్…అపర చాణక్యుడు. దేశ రాజకీయాల్లోని సీనియర్ నేతల్లో ఒకరు. 20 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అంటిపెట్టుకుని ఉన్న అత్యంత తెలివైన నేత. మరీ ముఖ్యంగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో…అవసరాన్ని బట్టి గోడదూకడంలో నితీష్‌ను మించిన రాజకీయ నాయకుడు దేశంలో ఎవరు లేరు. బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య నిరంతరం షటిల్ ఆడినట్లు రాజకీయాలు చేశారు నితీష్‌కుమార్. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూటర్న్ తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కూటమి ఏదైనా, సీట్లు ఎవరికి ఎక్కువున్నా పట్టించుకోరాయన. 2013 నుంచి ఇప్పటికి నాలుగుసార్లు కూటములు మార్చేశారు నితీష్.
తాజాగా తన మార్క్ రాజకీయానికి తెరలేపారు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. మళ్లీ యూటర్న్ తీసుకొని…బిహార్ పాలిటిక్స్‌కు కొత్త అర్థం చెప్పారు. మహాగడ్బంధన్కు రాంరాం చెప్పారు. నితీష్ కుమార్…యూటర్న్ తీసుకోవడం ఇదేం తొలిసారి కాదు…చివరి సారి కూడా కాబోదు. గతంలో అనేక సార్లు ఆయన కూటమిలు మార్చేశారు. మొదట్నుంచి నితీష్ రాజకీయ రూటే సపరేటు… జనతాదళ్‌తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నితీష్… ఆ పార్టీ తరపున 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994లో ఆ పార్టీని చీల్చి సమతాపార్టీ పెట్టుకున్నారు. 1996లో లోక్‌సభకు ఎన్నికైన ఆయన అటల్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 2003లో తన పార్టీని జేడీయూలో విలినం చేసేసారు. ఆ తర్వాత ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పట్నుంచి ఆయనకు తిరుగులేకుండా పోయింది.
2005లో బీజేపీతో చేతులు కలిపిన ఆయన ఘనవిజయం సాధించి తొలిసారి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. 2010లోనూ బీజేపీతో కలిసే ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. కానీ 2013లో బీజేపీ తన ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించడంతో నితీష్ కమలంతో తెగతెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిపి మహాగడ్బంధన్ ఏర్పాటు చేశారు. అయితే 2014లో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో సీఎంగా రాజీనామా చేసి మాంజీని ఆ పీఠంపై కూర్చోపెట్టారు. 2015లో మాంజీని దించేసి తాను మరోసారి సీఎం అయ్యారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే 2017లో మహాగడ్బంధన్కు హ్యాండిచ్చి కమలం గూటికి చేరిపోయారు.
ఐఆర్సీటీసీ కుంభకోణంలో…సీబీఐ లాలుప్రసాద్ ఇంట్లో సోదాలు చేసింది. ఈ కేసులో డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వి యాదవ్‌పై కూడా కేసు నమోదు చేసింది. దీంతో తేజస్వి యాదవ్‌ను డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరారు. ఆయన నిరాకరించడంతో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి గుడ్ బై చెప్పారు. 2020లో తక్కువ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2022లో మళ్లీ బీజేపీని వదిలి మహాగడ్బంధన్ అంటూ కూటమిని ఏర్పాటు చేశారు. ఆర్జేడీ కంటే జేడీయూకు తక్కువమంది ఎమ్మెల్యేలున్నా నితీషే సీఎం అయ్యారు. రెండేళ్లు కూడా కాకముందే మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. మొత్తంగా చూస్తే నితీష్‌కుమార్ పొలిటికల్ జర్నీ అంతా కాంగ్రెస్, ఎన్డీయే కూటముల మధ్య షటిల్ సర్వీస్‌లా మారింది.
సీఎం అంటే నితీష్‌కుమార్…నితీష్‌కుమార్ అంటే సీఎం అనేలా పాలిటిక్స్ చేస్తున్నారు ఈ సోషలిస్ట్ నేత. రాజకీయాల్లో తాను ఉన్నంత కాలం… మరొకరు సీఎంగా ఉండకూడదనేలా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. కూటమి ఏదైనా, మెజారిటీ సీట్లు ఎవరికి వచ్చినా ముఖ్యమంత్రి సీటు మాత్రం తనదేనంటారు నితీష్. ఆయన ఎప్పుడు కూటమి మారిపోతారో ఎవరికీ తెలియదు. ఆయన అన్నిసార్లు కూటములు మారుతున్నా ఆ పార్టీలు ఆయన వస్తానంటే నో అనలేవు. రారా అనడం తప్ప నో నో అని మాత్రం అనే ధైర్యం చేయలేకపోతున్నాయి. ఎన్నిసార్లు వెన్నుపోటు పొడుస్తున్నా రాజకీయ అవసరాల కోసం గతాన్ని మర్చిపోయి నితీష్‌కు స్నేహహస్తం చాస్తున్నాయి.













