Washington: అగ్రరాజ్య ధోరణిపై రగులుతున్న పొరుగుదేశాలు..

ఎవరేమనుకున్నా.. ఎలాంటి పరిస్థితుల్లోనూ తాను అనుకున్నది జరిగి తీరాలంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump). అక్రమవలసదారులపై ఉక్కుపాదం మోపుతామన్నట్లుగానే..వారిని తిరిగి ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపిస్తున్నారు. అయితే ఈసందర్బంగా వారితో అమెరికా సైన్యం అనుసరిస్తున్న విధానం మాత్రం.. విమర్శలకు తావిస్తోంది. వారి హక్కులకు అమెరికా భంగం కలిగిస్తోందంటూ.. పలు దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వలసదారులను గుర్తించి ప్రత్యేక విమానాల్లో వారి స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరుపై కొలంబియా, బ్రెజిల్(Brazil) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా వచ్చే వలసదారుల విమానాలను అనుమతించమని కొలంబియా తేల్చి చెప్పింది. మరోవైపు తమ పౌరులకు సంకెళ్లు వేసి ప్రత్యేక విమానాల్లో తీసుకురావడంపై బ్రెజిల్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
‘‘కొలంబియా వలసదారులను తీసుకువచ్చే అమెరికా విమానాలను మా దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నా’ అని కొలంబియా(Colombia) అధ్యక్షుడు గుస్తావో పెట్రో పేర్కొన్నారు. వలసదారులను గౌరవంగా పంపించేందుకు అమెరికా నిబంధనలు రూపొందిస్తేనే వాటిని అనుమతిస్తామన్నారు. ఇప్పటికే అమెరికా సైనిక విమానాలను వెనక్కి పంపించినట్లు చెప్పారు. అయితే, నేరస్థులుగా చిత్రించకుండా, అమెరికా పౌర విమానాల్లో పంపిస్తే మాత్రం వాటిని అనుమతిస్తామని పెట్రో స్పష్టం చేశారు.
మరోవైపు అక్రమ వలసదారులను తిరిగి వెనక్కి పంపించే క్రమంలో అమెరికా అనుసరిస్తున్న విధానంపై బ్రెజిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా వలసదారుల చేతులకు సంకెళ్లు వేసి పంపించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇలా చేయడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది. ఇదిలాఉంటే, దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు దొంగతనాలకు, హింసకు పాల్పడే వారిని అగ్రరాజ్యం నిర్బంధిస్తోంది.. అధ్యక్షుడి ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా ఇప్పటికే 538 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు.