మోడీ తీరుపై సంఘ్ అసంతృప్తిగా ఉందా..?

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శనపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అసంతృప్తిగా ఉందా..? మరీ ముఖ్యంగా అబ్ కీ బార్ చార్ సౌ పార్ అంటూ మోడీ ఇచ్చిన నినాదం ఫలితం కనిపించకపోవడం..సంఘ్ లో అసహనాన్ని కలిగించిందా..? అందుకే నిజమైన సేవకుడు అహంకారం కలిగిఉండడు. ఇతరులకు ఎలాంటి హాని కలిగించకుండా పని చేస్తాడు’’ అంటూ ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారా..? అంటే అవుననే సమాధానం వినవస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన నుంచి ఈవ్యాఖ్యలు వచ్చాయి. ఈ తరుణంలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో భాగవత్ మధ్య భేటీ ఆసక్తి కలిగిస్తోంది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆశించిన స్థాయి విజయం సాధించలేక.. 240 సీట్లకే పరిమితమైంది. అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో షాక్ తగిలింది. 80 స్థానాలకుగానూ 33 సీట్లనే సొంతం చేసుకుంది. 2019లో ఆ సంఖ్య 62గా ఉంది. విపక్ష ‘ఇండియా’ కూటమి 43 చోట్ల గెలుపొందింది. ఈ ఫలితాల తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక ఆర్గనైజర్‌లో ఒక వ్యాసం ప్రచురితమైంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ కార్యకర్తల అతి విశ్వాసాన్ని కళ్లకు కట్టాయని, వారితోపాటు నేతలంతా ‘గాలి బుడగ’ను నమ్ముకుని పని చేశారని, కేవలం మోడీ చరిష్మాపై ఆధారపడ్డారని, వీధుల్లో ప్రజల గొంతుకలను వినలేదని ఆ వ్యాసం పేర్కొంది.
ప్రధాని మోడీ పిలుపునిచ్చిన 400కుపైగా సీట్ల లక్ష్యం తమది కాదని బీజేపీ నేతలు, కార్యకర్తలు భావించారు. ఆయనవల్లే గెలుస్తామనే నమ్మకంతో వారు పనిచేయలేదు. స్థానిక నాయకులను తక్కువ చేసి చూడటం, పార్టీ ఫిరాయించిన వారికి టికెట్లు ఇవ్వడం, బాగా పనిచేసిన పార్లమెంటు సభ్యులకు టికెట్లు ఇవ్వకపోవడం వికటించింది. మహారాష్ట్రలో పార్టీలను చీల్చడం వంటి అనవసర రాజకీయం కూడా దెబ్బతీసింది’’ అని అభిప్రాయం వ్యక్తంచేసింది. అందుకే రెండు కూటములు అక్కడే ఆగిపోయాయని తెలిపింది.
ఇటీవలే ఆపార్టీ చీఫ్ నడ్డా సైతం.. తాము సొంతంగా పోటీ చేసి గెలిచేస్థాయికి చేరామని ప్రకటించారు. ఒకప్పుడు అంటే ఆపరిస్థితి లేక ఆర్ఎస్ఎస్ పై ఆధారపడ్డామన్నారు. మోడీనాయకత్వంలో తమపార్టీ .. ఆర్ఎస్ఎస్ పై ఆధారపడే స్థాయిని దాటిపోయిందన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ నిరాశాజనక ఫలితాలతో .. బీజేపీ తీరుపై ఆర్ఎస్ఎస్ నాయకులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలను బీజేపీ కూడా నిశితంగా గమనిస్తోంది. దీంతో ఆపార్టీ అగ్రనేతలు సైతం.. ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలతో అలర్టయ్యారు. ఆర్ఎస్ఎస్ తో వ్యాఖ్యల విభేదాల్ని తొలగించుకునేపనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.