మోడీ కేబినెట్ లో ఛాన్స్ ఎవరికో..?

నేడు భారత ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.రాష్ట్రపతి భవన్ లో రాత్రి 7.15 గంటలకు ఈ కార్యక్రమం జరగనున్నది. మోడీతోపాటు కేబినెట్ లోని మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విదేశీ ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. వారి కోసం ఇప్పటికే ఢిల్లీలోని పలు హోటళ్లను కూడా సిద్ధం చేశారు. ప్రమాణస్వీకారోత్సవం నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
అయితే, ఇప్పటికే ఏపీ నుంచి మిత్రపక్షమైన టీడీపీకి రెండు బెర్తులు ఖరారయ్యాయి. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ..కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరోవైపు.. తెలంగాణకు సంబంధించి ..చాలా పేర్లు మంత్రిపదవులకు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. ఇక మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండిసంజయ్, ఈటల రాజేందర్, డికె అరుణలకు కేబినెట్ లో చోటు లభిస్తుందని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి విపక్షస్థానాన్ని చేజిక్కించుకునే పరిస్థితులున్నాయి. దీంతో ఈ రాష్ట్రానికి మంత్రిపదవుల్లో ప్రాముఖ్యం దక్కుతుందని భావిస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రానికి సమప్రాధాన్యమిచ్చేలా, అధిక పదవులు దక్కనున్నాయని సమాచారం. దీంతో మరింత మంది ఆశావహులు.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మోడీ కరుణిస్తే.. తమకు కేంద్రమంత్రిపదవి లేదా సహాయ మంత్రి పదవి దక్కుతుందని విశ్వసిస్తున్నారు.
మరోవైపు ఏపీలో బీజేపీ నుంచి రెండు ఇద్దరి పేర్లు మంత్రి పదవులకోసం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎం రమేష్, పురంధేశ్వరి.. వీళ్లిద్దరిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశముందంటున్నారు. పురంధేశ్వరికి.. దేశరాజకీయాలను ప్రభావితం చేసిన ఎన్టీఆర్ కుమార్తెగా గుర్తింపు ఉంది.దీనికి తోడు యూపీఏ పాలనలో కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం, వాగ్దాటి ఉండడం సానుకూలాంశం. ప్రస్తుతం పురంధేశ్వరి ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఇక సీఎం రమేష్.. ఇప్పటికే బీజేపీ ఎంపీగా ఉన్నారు. బీజేపీ హైకమాండ్ కు నిత్యం టచ్ లో ఉంటూ వస్తున్నారు. ఇటు టీడీపీకి మరీ ముఖ్యంగా చంద్రబాబుకు బాగా కావాల్సిన వ్యక్తి అంటారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.