నమో కేబినెట్ 3.0… నరేంద్రమోడీ అనే నేను..

దేశప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. 2014, 2019 ఎన్నికల్లో విజయం తర్వాత రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. తాజా ఎన్నికల్లో కూటమి గెలుపుతో వరసగా మూడోసారి పీఠమెక్కిన ఘనత సాధించారు. రాష్ట్రపతి భవన్‌లో ఆహ్లాదభరిత వాతావరణంలో అట్టహాసంగా జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఏడు దేశాల అధినేతలు, భారత మాజీ రాష్ట్రపతులు, వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినీతారలు, మత గురువులు, పారిశుద్ధ్య కార్మికులు, వందేభారత్ లోకోపైలట్లు సహా సమాజంలో వివిధ వర్గాలవారి సమక్షంలో ఈ కార్యక్రమం పూర్తయింది. ఇదివరకు ఎన్నడూలేని రీతిలో దాదాపు 9 వేల మంది ఆహ్వానితులు దీనికి హాజరయ్యారు. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత దేశంలో వరసగా మూడోసారి ప్రధాని అయిన ఘనతను 73 ఏళ్ల మోడీ సాధించారు.
ప్రధాని తర్వాత ప్రమాణం పూర్తిచేసిన 71 మంది కేంద్రమంత్రుల్లో 30 మందికి క్యాబినెట్ హోదా ఉంటుంది. ఐదుగురు స్వతంత్ర హోదాలో ఉంటారు. మిగిలిన 36 మంది సహాయ మంత్రులు. ఈసారి ఐదుగురు తెలుగువారికి మంత్రిమండలిలో చోటు దక్కింది. బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాను ఐదేళ్ల విరామం తర్వాత తిరిగి క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, మనోహర్‌లాల్ ఖట్టర్‌లకు కొత్తగా చోటు దక్కింది. గతంలో రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈసారి లోక్‌సభ బరిలో దిగి విజయం చేజిక్కించుకున్న పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్‌లకు మంత్రి పదవులు లభించాయి. అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, అశ్వినీ వైష్ణవ్, వీరేంద్రకుమార్, ప్రహ్లాద్ జోషి, గిరిరాజ్ సింగ్, జుయెల్ ఓరంలు భాజపా తరఫున మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో ఉన్నారు.
ఐదు మిత్ర పక్షాలకు ఒక్కో క్యాబినెట్ పదవి
ఎన్డీయే మిత్రపక్షాల తరఫున మంత్రులైన తెలుగువారిలో టీడీపీ నుంచి కె.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్; బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఉన్నారు. వీరితో పాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల తరఫున హెచ్.డి.కుమారస్వామి (జేడీఎస్), చిరాగ్ పాస్వాన్ (ఎల్‌జేపీ-ఆర్‌వీ), జితన్‌రామ్ మాంఝీ (హెచ్‌ఏఎం-సెక్యులర్), రాజీవ్‌రంజన్ సింగ్ ‘లలన్’ (జేడీయూ) తదితరులు ఉన్నారు. ఐదు మిత్ర పక్షాలకు ఒక్కో క్యాబినెట్ బెర్తు చొప్పున ఇచ్చారు.
81 మందికి అవకాశముండే కేంద్ర మంత్రివర్గంలోకి మోడీ ఒకేసారి 71 మందిని తీసుకున్నారు. ఈ అయిదేళ్లలో ఆర్థిక వ్యవస్థను వేగంగా పరుగులు తీయించి హామీలను అమలుచేయాల్సి ఉన్నందున ఆయన ఒకేసారి పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మూడింట రెండువంతుల మంది పాతవారికి అవకాశం ఇచ్చి.. సంకీర్ణ ధర్మం, ఇతరత్రా సర్దుబాట్ల దృష్ట్యా ఒక వంతు మందిని కొత్తవారికి తీసుకున్నారు.
వేడుకకు విపక్ష నేతలెవరూ హాజరు కాలేదు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక్కరే ఇండియా కూటమి నుంచి హాజరయ్యారు. పారిశ్రామిక దిగ్గజాలైన ముకేశ్ అంబానీ, అనంత్ అంబానీ, గౌతం అదానీ, ఆయన భార్య ప్రీతి అదానీ, ఆనంద్ పిరమాళ్ తదితరులు వేడుకకు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతులు రామ్‌నాథ్ కోవింద్, ప్రతిభా పాటిల్, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, నటులు షారుక్ ఖాన్, అనుపమ్‌ఖేర్, అనిల్ కపూర్, అక్షయ్‌కుమార్, రవీనా టాండన్, రజనీకాంత్,సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, పలువురు మతపెద్దలు కూడా వేడుకను ప్రత్యక్షంగా తిలకించారు.