తగులబడుతున్న ‘కన్నడ’సీమ…
వరుస ఆందోళనలతో కర్నాటక అట్టుడుకుతోంది. మొన్నటివరకూ కావేరి వివాదంతో రగిలిన కన్నడసీమ.. ఇప్పుడు భాషా వివాదంతో ఉద్రిక్తంగా మారింది. వ్యాపారసంస్థలు, మాల్స్, దుకాణాలు, హోటల్స్ … ఇలా ఒకటేమిటి ఎక్కడైనా సరే కర్నాటక భాషలోనే బోర్డులు ఉండాలని కన్నడ భాషా పరిరక్షణ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్లు కాస్తా.. దాడులకు , విధ్వంసానికి దారి తీస్తున్నాయి. బుధవారం పలుచోట్ల కన్నడ భాషా పరిరక్షణ ప్రతినిధులు.. పలుసంస్థలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ఆస్తులపై దాడులకు దిగారు. దీంతో మాల్స్, వ్యాపార సంస్థల ప్రతినిధుల్లో ఆందోళన కనిపిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో అధికార భాష కన్నడ బోర్డులు లేకుండానే వ్యాపారాలు చేయడంపై కర్ణాటక రక్షణ వేదిక ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించింది. అంతేకాకుండా విమానాశ్రయం సమీపాన ఉండే సాధహళ్లి టోల్ గేట్ నుంచి కన్నడ రక్షణ వేదిక నేతలు ర్యాలీ నిర్వహించారు. పలుచోట్ల ఆంగ్లంలో ఉన్న బోర్డులను ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణ గౌడ సహా 53 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. అయితే తక్షణమే ఆందోళనకు దిగిన వారిని విడుదల చేయాలని కర్నాటక రక్షణ వేదికప్రతినిధులు డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు… భాషా పరిరక్షణకోసం ఆందోళనలు సమంజసమైనప్పటికీ.. హింసాత్మక ఘటనలు మాత్రం ఆమోదయోగ్యం కావన్నారు రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాము చెప్పినట్లుగానే 60శాతం కన్నడ నేమ్స్ ఉండాలని బిల్లు తెస్తామన్నారు. అంతవరకూ హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దని సూచించారు.
కర్ణాటక రాష్ట్రంలో సాధారణంగా ఐటీ పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. అందువల్లే ఈ ప్రాంతాన్ని దేశ ఐటీ రాజధానిగా పిలుస్తారు. బహుళ జాతి కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధి, చదువుల కోసం ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. వారి అవసరాలు తీర్చేందుకు రకరకాల వ్యాపార సముదాయాలు కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటవుతున్నాయి.
అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఆ రాష్ట్రంలో ఏర్పాటుచేసిన వివిధ సంస్థలకు సంబంధించిన బోర్డులన్నీ ఇంగ్లీషులో ఉండడంతో అక్కడి కన్నడ ప్రజలను ఇబ్బందికి గురిచేస్తోంది. మా ప్రాంతంలో కార్యకలాపాలు సాగించుకుంటూ.. మా భాషలో కాకుండా ఇంగ్లీషులో బోర్డులు ఏర్పాటు చేయడం ఏంటని అక్కడి కన్నడ భాష అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అదే ఈ విధానానికి చరమగీతం పాడాలని కొంతకాలంగా వారు వివిధ రకాల సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వానికి వినతులు కూడా చేశారు. అప్పటికి ఉపయోగం లేకపోవడంతో వారు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.













