భారత సైన్యానికి మాల్దీవుల డెడ్ లైన్..
మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు… చైనా అనుకూల వైఖరిని కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటించినట్లుగానే.. భారత దళాల ఉపసంహరణపై ఫోకస్ పెట్టారు. మార్చి 15 నాటికల్లా భారతదళాలను ఉపసంహరించుకోవాలని డెడ్ లైన్ విధించింది.మాలేలోని విదేశాంగ మంత్రిత్వ శాఖతో మాల్దీవుల్లోని భారత హైకమిషన్ అధికారులు జరిపిన చర్చల్లో భాగంగా.. వాళ్లు ఈ అభ్యర్థన చేసినట్టు తెలిసింది. మాల్దీవుల స్థానిక మీడియా ప్రకారం.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిణామాలతో పాటు మాల్దీవుల్లోని భారత సైనిక సిబ్బంది ఉనికి గురించి ఇరువర్గాల మధ్య చర్చలు సాగాయి. ఈ క్రమంలోనే.. మార్చి 15లోపు తమ దళాల్ని వెనక్కి రప్పించుకోవాల్సిందిగా మాల్దీవుల ప్రతినిధులు భారత్‌ని కోరారు.
చైనా అనుకూల వ్యక్తిగా పేరుగాంచిన మహమ్మద్ ముయిజ్జూ.. తాను ఆ దేశాధ్యక్షుడు అవ్వడానికి ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత సైనిక సిబ్బందిని తొలగించి, వాణిజ్యాన్ని సమతుల్యం చేస్తానని వాగ్దానం చేశారు. సెప్టెంబర్‌లో జరిగిన అక్కడి అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. భారత సైన్యాన్ని ఉపసంహించుకోవాలని మాల్దీవుల ప్రజలు తనను కోరారని, మాల్దీవుల ప్రజల ప్రజాస్వామ్య సంకల్పాన్ని భారతదేశం గౌరవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే.. భారత దళాల్ని తిరిగి పంపడమే తన ధ్యేయమని చాలాసార్లు ప్రకటించారు. ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చాక.. అక్కడి ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో నిమగ్నమయ్యారు.
ఇటీవలే చైనాలో పర్యటించిన ముయిజ్జు ప్రతినిధుల బృందం.. ఆదేశంతో పలు ఒప్పందాలు చేసుకుంది. అదే సమయంలో తమదేశంలో టూరిజం పెంపుదలపై ఫోకస్ పెట్టారు ముయిజ్జు. ఎప్పుడైతే భారత్.. తన టూరిజం హబ్ గా లక్షద్వీప్ ను ఎంచుకుందో.. ప్రత్యామ్నాయంగా చైనా నుంచి సహకారాన్ని ఆశిస్తున్నారు ముయిజ్జు. అంతేకాదు.. మా దేశం చిన్నగా ఉన్నప్పటికీ, తమను ఎవరూ బెదిరించలేరన్నారు ముయిజ్జు. ఎవరికీ అలాంటి హక్కులు లేవన్నారు. మాల్దీవుల అంతర్గత వ్యవహారంలో ఎవరు జోక్యం చేసుకున్నా గట్టిగా వ్యతిరేకిస్తామంటూ చైనా సైతం పరోక్ష వ్యాఖ్యలు చేసింది.
ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో భారత్, మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తాయి. ముఖ్యంగా.. మోడీని టార్గెట్ చేసుకొని అవమానకర వ్యాఖ్యలు చేయడంతో సమస్య మొదలైంది. మోడీ ఒక జోకర్, కీలుబొమ్మ అంటూ కామెంట్స్ చేయడంతో.. ఈ వివాదం ముదిరింది. చివరికి మాల్దీవుల ప్రభుత్వం దిగివచ్చి.. అవి వారి వ్యక్తిగత వ్యాఖ్యలని, ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేదని చెప్తూ ఆ ముగ్గురు మంత్రుల్ని సస్పెండ్ చేసింది.













