రగిలిన ‘రిజర్వేషన్ల’ పోరు..
విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండు చేస్తూ మహారాష్ట్రలో రెండోదఫా జరుగుతోన్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేల ఇళ్లను నిరసన కారులు తగులబెట్టారు. బీడ్ జిల్లాలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సందీప్ క్షీరసాగర్ ఇంటికి సోమవారం నిప్పు పెట్టారు. ఆయన ఇంటి వద్ద పార్క్ చేసిన వాహనాలను తగులబెట్టారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే నివాసంపై నిరసనకారులు దాడి చేసి నిప్పుపెట్టారు. దీంతో ఇల్లు మొత్తం దగ్ధమైంది. దాడి సమయంలో ఎమ్మెల్యే ఇంట్లోనే ఉన్నారు. అయితే ఈ ఘటనలో తనతోపాటు కుటుంబీకులు, సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.మహారాష్ట్రలోని వడ్గావ్ నింబాల్కర్ గ్రామంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పోస్టర్లను ధ్వంసం చేసి మరాఠా రిజర్వేషన్ ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకంగా మారడం, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి ఘటనలపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే స్పందించారు. ఈ నిరసనలు ఎటువైపు వెళ్తున్నాయో అనే విషయాన్ని మనోజ్ జరంగే పాటిల్ గమనించాలని అన్నారు. అవి తప్పుడు మార్గంలో వెళ్తున్నాయని సీఎం షిండే స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
మరోవైపు…రిజర్వేషన్ అంశంపై శివసేన నాయకుడు హేమంత్ పాటిల్ హింగోలి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. యవత్మాల్లోని నిరసన వేదిక వద్ద ఆయన తన రాజీనామా లేఖ రాశారు. ఎంపీ రాజీనామాపై స్పందించిన మనోజ్ జరంగే పాటిల్, ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్రంలోని మరాఠా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని పిలవాలని సూచించారు.
మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండు చేస్తూ సామాజిక కార్యకర్త మనోన్ జరంగే పాటిల్ .. అక్టోబర్ 25 నుంచి జాల్నా జిల్లాలోని అంతర్వాలీ సారథి గ్రామంలో ఆమరణ దీక్ష చేపట్టారు. ఏ రాజకీయ నాయకుడిని గ్రామంలోకి అనుమతించవద్దని పాటిల్ కోరడంతో గ్రామస్థులు లోనికి ఏ రాజకీయ పార్టీ నేతనూ రానివ్వడం లేదు. వైద్య పరీక్షలు చేసేందుకు జిల్లా అధికారులు, వైద్యులు ప్రయత్నిస్తున్నప్పటికీ అందుకు ఆయన నిరాకరిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తోన్న సమయంలోనే.. మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి.













