స్పీకర్ అలిగినవేళ..
మణిపూర్ ఘటనతో భారత పార్లమెంటు రగిలిపోతోంది. పూర్తిస్థాయి చర్చ జరిగి, ప్రధాని మోడీ ప్రకటన ఇవ్వాలంటూ సభాకార్యక్రమాలను విపక్షాలు అడ్డుకుంటున్నాయి. స్పీకర్ ఎంత చెప్పినా తగ్గేది లేదంటున్నాయి. సస్పెండ్ చేస్తారా చేసుకోండంటూ.. తేల్చి చెబుతున్నాయి. దీంతో సభను నిర్వహించడం స్పీకర్ ఓంబిర్లాకు కష్టతరంగా మారింది.దీంతో ఆయన సభ్యులు హుందాగా, సభా కార్యక్రమాల నిర్వహణకు సహకరించేవరకూ… సభా కార్యక్రమాలకు హాజరు కానని ప్రకటించారు.
ఇది భారత పార్లమెంటు చరిత్రలో నమోదుకాని అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు. సాదారణంగా సభ నడిచే పరిస్థితి లేనప్పుడు స్పీకర్… సభను వాయిదా వేస్తారు. తర్వాత అన్నిపక్షాలను పిలిచి మాట్లాడతారు. దానికో పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తారు. కొన్ని సమయాల్లో కఠినంగానూ వ్యవహరిస్తారు. అయితే విపక్షాలకు వార్నింగిస్తారు. లేదంటే సమస్యను పరిష్కరించాలని.. పార్లమెంటు వ్యవహారాల మంత్రికి సూచిస్తారు. కానీ ఇక్కడ మాత్రం స్పీకర్.. తన విధులకు హాజరుకానని ప్రకటించారు. అంతే తాను పార్లమెంటును నడపలేనని సూటిగా చెప్పేశారు.
అయితే స్పీకర్ ప్రకటనతో విపక్షాలు మెత్తబడతాయా? అంటే లేదని తెలుస్తోంది. ఎందుకంటే విపక్షాలు మణిపూర్ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాని మోడీ దిగివచ్చేవరకూ, సభను నడపనివ్వమంటున్నాయి. ఇలాంటి కీలక సమయంలో వెనుకంజ వేస్తే, మోడీ సర్కార్ .. ఏమాత్రం దిగిరాదని విపక్షాలకు తెలుసు. దీంతో స్పీకర్ చెప్పారని విపక్షాలు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాదు.. స్పీకర్ గా ఎవరుంటే ఏమి.. తమ డిమాండ్ నెగ్గితే చాలనే పరిస్థితుల్లో విపక్షాలు కనిపిస్తున్నాయి.
గతంలో చాలా మంది పార్లమెంటు స్పీకర్లుగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా ఉంది. అలాంటి సమయంలో అప్పటి స్పీకర్ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారు. సభా కార్యక్రమాలు సాగి, బిల్లు పెట్టేందుకు అన్నివిధాలుగా ప్రయత్నించారు. అంతే తప్ప, కాడి కిందపడేయలేదు. చాలా మంది .. క్లిష్టతరమైన పరిస్థితుల్లోనూ విధులు నిర్వర్తించి, విపక్షాలతో కూడా ప్రశంసలు అందుకున్నారు. 1998-2002 మధ్య స్పీకర్ గా విధులు నిర్వర్తించిన బాలయోగి అయితే.. తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. ఎంతలా అంటే రెండోదఫా కూడా బాలయోగి నిలబడతానంటే.. తాము మద్దతిస్తామని ఆసమయంలో విపక్ష కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. స్వయంగా బాలయోగికి చెప్పారు. మరి అలాంటి ఉన్నతస్థానంలో ఉన్నవ్యక్తి, వ్యక్తులు కాస్త సమన్వయంతో వ్యవహరించాల్సింది పోయి.. ఇలా బేలగా ఉండకూడదని రాజనీతిజ్ఞులు సూచిస్తున్నారు.













