బీజేపీ మాస్టర్ స్ట్రోక్… మహిళకు పట్టం..
మహిళకు పట్టం..
దేశచరిత్రలోనే ఓ నవశకం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా చట్టసభల్లో గొంతు వినిపించాలన్న మహిళల ఆకాంక్ష నెరవేరబోతోంది. ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటూ ఓట్లు దండుకుంటున్న పార్టీలన్నీ.. ఎట్టకేలకు ఒకే తాటిపైకి వచ్చాయి. మహిళా నీకు వందనమంటూ… బేషరతుగా బిల్లుకు మద్దతు పలికాయి. దీంతో మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెచ్చిన నారీశక్తి వందన అధినియం బిల్లు చట్టంగా మారనుంది. దేశంలో సగంసంఖ్యలో ఉన్న మహిళలు.. వారి గొంతును వినిపించడం ద్వారా ఓ కొత్త శకానికి తెరతీయనున్నారు. ఇప్పటివరకూ ఓవైపు నుంచే సమస్యలు చూశాం.. ఇక నుంచి రెండోవైపు నుంచి కూడా సమస్యల్ని గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేసేందుకు తాజా చట్టం సహకరించనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ మాస్టర్ స్ట్రోక్…
మహిళా రిజర్వేషన్ బిల్.. ఓ రకంగా చెప్పాలంటే ఎన్నికల ముందు బీజేపీ ప్రయోగించిన మాస్టర్ స్ట్రోక్ గా చెప్పాలి. ఎందుకంటే సమాజంలో సగం మంది మహిళలే ఉన్నారు. ఓటింగ్ లోనూ మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో వారికోసం చారిత్రాత్మక బిల్లును ఆమోదించడం అంటే .. అది మహిళల మనసులను చూరగొన్నట్లే. దీంతో ఈబిల్… తమకు ఎన్నికల సంద్రం నుంచి ఈజీగా గట్టెక్కిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.
మోడీ రాజకీయ చతురత..
గతంలో బీజేపి ప్రభుత్వం సహా ఎన్నో ప్రభుత్వాలు మహిాళా బిల్లును తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే వాటి ప్రయత్నాలు కొన్ని కారణాల వల్ల సఫలీకృతం కాలేదు. ఇప్పుడు మాత్రం మోడీ సర్కార్ కు పూర్తిస్థాయి మద్దతుండడంతో.. బిల్లును తెచ్చే సాహసం చేయగలిగింది. అంతే కాదు…బిల్లును పూర్తి పార్లమెంటు ఆమోదించేలా చేయడంలో చాకచక్యాన్ని ప్రదర్శించింది. దీంతో కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు… మనస్ఫూర్తిగా మద్దతు పలికాయి. అంటే ఇది మోడీ.. రాజకీయ చతురతగానే భావించాలి.
మోడీ సర్కార్ ఘనతే…
ఈ బిల్ కోసం ఏకంగా ప్రత్యేక సమావేశాలే పెట్టింది ఎన్డీఏ సర్కార్. అంతే కాదు.. ఇందులో ఓ ప్రాధాన్యత ఉందని ప్రధానమంత్రి మోడీ లీకులిచ్చారు. దీంతో విపక్షం అప్రమత్తమైంది.ఏదో రహస్య అజెండా ఉందని మీడియా ఎదుటే విపక్షనేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో సమావేశాలు ఎలా జరుగుతాయన్న అన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి.తీరా సభ ముందుకు మహిళాబిల్ వచ్చేసరికి.. పార్టీలన్నీ తప్పనిసరిగా బిల్లుకు ఆమోదం తెలపాల్సి వచ్చింది. గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన ఆర్జేడీ, ఎస్పీ పార్టీల ఎంపీలు కూడా బిల్లుకు అనుకూలంగా ఓటేశారు . అదీ మోడీ స్టైలంటే…
క్రెడిట్ పాలిటిక్స్…
ఎప్పుడైతే బిల్లు ఆమోదం పొందిందో ఇంక దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు మొదలైపోయాయి. బీజేపీ మహిళా ఎంపీలు హర్షాతి రేకాలు వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు.ఇక మహిళా బిల్ తెచ్చింది మోడీ సర్కార్ అంటూ కార్యకర్తలు, నేతలు ప్రచారం చేస్తున్నారు. ఆ క్రెడిట్.. తమ పార్టీకే దక్కుతుందని సగర్వంగా ప్రకటిస్తున్నారు.ఏది ఎలా ఉన్నప్పటికీ… రాజకీయ ప్రయోజనాలో, ఇంకొకటో అన్నది పక్కన పెడితే బిల్ తెచ్చిన ఘనత మాత్రం మోడీ సర్కార్ దే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇది ఇప్పటికిప్పుడు అమల్లోకి రానప్పటికీ.. ఓపెద్ద ముందడుగు పడిందని మహిళాలోకం ఆనందం వ్యక్తం చేస్తోంది.
స్వాగతించిన విపక్షం..
ఈ బిల్లును ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ స్వాగతించింది. ఇది తమ హయాంలోనే తెచ్చేందుకు ప్రయత్నించామని..కాని, కొన్ని మిత్రపక్షాలు సహకరించకపోవడంతో .. నిలిచిపోయిందన్నారు సోనియాగాంధీ. అయినా సరే రాజ్యసభలో ఆమోదించామని గుర్తు చేశారు. మరోవైపు ఈ బిల్లు అసంపూర్తిగా ఉందన్నారు రాహుల్.అందులో ఓబీసీ రిజర్వేషన్ గురించి ఎలాంటి చర్చ లేదని… ఇందులో రెండు తప్పులు ఉన్నాయని, ముందుగా దాన్ని సరిచేయాలని అన్నారు. లోక్‌సభ, రాజ్యసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ బిల్లును ఇక నుంచి అమలు చేయాలి. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ రిజర్వేషన్‌ను కూడా చేర్చాలని కోరుకుంటున్నాను అని రాహుల్ గాంధీ అన్నారు. డీలిమిటేషన్ మరియు జనాభా లెక్కలు అవసరం లేదని.. ఈ రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని కోరారు.
ఓబీసీ, ఎస్సీ,ఎస్టీ, కులగణనతో కౌంటర్…
ఎప్పుడైతే బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్ తో ముందుకొచ్చిందో.. విపక్షాలు కౌంటర్ స్టార్ట్ చేశాయి. కులగణన, ఎస్సీ,ఎస్టీ కోటా తెరపైకి తెచ్చాయి .వాటిని అమలు చేయకుండా , అసంపూర్తి బిల్లుగా తెచ్చారని ఆరోపించారు. ఇది ఎప్పటికి అమల్లోకి వస్తుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కులగణన, ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు అమల్లోకి తెస్తే.. అది కాస్త తమ ఓటు బ్యాంకుకు గండిపడుతుందన్న భయం కమలనాథుల్లోనూ ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. మహిళా బిల్ ప్రయోజనాన్ని .. అందుకునేలోపే.. ఈ పరిణామం తమకు ఇబ్బందికరంగా మారుతుందని యోచిస్తున్నట్లు సమాచారం.ఈ రిజర్వేషన్లు అమల్లోకి తెస్తే… అవి కొన్ని ప్రాంతీయపార్టీలకు ఓట్లుగా మారే అవకాశముంది. అంతేకాదు.. ఆయా పార్టీలకు చెందిన మహిళానేతల చరిష్మా.. తమకు ఎక్కడ ఇబ్బందికరంగా మారుతుందా అన్న ఆందోళన ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లులో కోటా లేకుండా ఉన్నంత వరకూ మొత్తంగా మహిళల ఓట్లు తమకే పడతాయని వారి భావనగా తెలుస్తోంది.
డీ లిమిటేషన్ తర్వాతే..
2026 జనాభా లెక్కల తర్వాత నిర్వహించే తదుపరి డీలిమిటేషన్ కసరత్తు తర్వాతే మహిళలకు రిజర్వేషన్ అమలులోకి వస్తుందని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు చెబుతోంది. అంటే 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ మార్పులు చేపట్టవచ్చు. ఈ నిబంధన కేవలం 15 ఏళ్లు మాత్రమే ఉంటుందని బిల్లులో తెలిపారు.. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో ఎస్సీ/ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేసిన ప్రతి మూడు స్థానాల్లో ఎస్సీ/ఎస్టీ గ్రూపులకు చెందిన మహిళలకు ఒకటి లభిస్తుందని బిల్లు చెబుతోంది.
చట్టసభల్లో గణనీయమైన మార్పు…
ఈ బిల్లు వల్ల చట్టసభల్లో గణనీయమైన మార్పు కనిపించనుంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, ఢిల్లీలో ప్రతి మూడు స్థానాల్లో ఒకటి మహిళలకు దక్కుతుందని ఈ బిల్లు చెబుతోంది. అంటే 33% సీట్లు మహిళలకు మాత్రమే రిజర్వ్ అయి ఉంటాయి. అయితే ఈ రిజర్వేషన్ మహిళలకు తక్షణమే రాకపోవచ్చు. భారతదేశంలో ఎంత మంది నివసిస్తున్నారు, ప్రతి ప్రాంతంలో ఎన్ని సీట్లు ఉండాలో ప్రభుత్వం నిర్ణయించాక మాత్రమే ఈ సీట్ల కేటాయింపు అమల్లోకి వస్తుంది.
ఈ బిల్లు ఒక మినహాయింపుతో 2010లో మునుపటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మాదిరిగానే ఉంది. కాకపోతే ఈ రెండింటి మధ్య ఒక తేడా ఉంది. అదేంటంటే కొత్త దాంట్లో 2026 జనాభా లెక్కల తర్వాత ఇది అమల్లోకి వస్తుందనే రూల్ ఉంది. అంటే తదుపరి డీలిమిటేషన్ ఎక్సర్సైజు తర్వాత వరకు ఇది అమలు కాదు.
రాష్ట్ర, జాతీయ స్థాయిలో విధాన రూపకల్పనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ అని బిల్లు పేర్కొంది. 2010లో రాజ్యసభ కూడా ఇదే విధమైన బిల్లును ఆమోదించిందని, అయితే అది లోక్‌సభ ఆమోదం పొందలేదని హైలెట్ చేసింది.
నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువ మంది మహిళలు పాల్గొనడం ముఖ్యమని, ఇది కొత్త దృక్కోణాలను తీసుకువస్తుందని, చర్చలు, నిర్ణయం తీసుకోవడంలో నాణ్యతను మెరుగుపరుస్తుందని మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తావించింది.
మహిళా రిజర్వేషన్ బిల్ ప్రయోజనాలు..
దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర పెంచడానికి రూపొందించినదే ఈ ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం లోక్‌సభలో 542 సీట్లకు గాను.. 78 మంది మహిళా ఎంపీలుంటే.. రాజ్యసభలో 224 సీట్లలో 24 మంది మహిళలున్నారు. ఉభయసభల్లో మొత్తం 102 మంది మహిళా ఎంపీలున్నారు. ఈ లెక్కన చూస్తే.. పార్లమెంట్లో 13.3 శాతం మాత్రమే మహిళలున్నారు. ఈ సంఖ్యను 33 శాతానికి పెంచాలనే ఉద్దేశంతో మహిళా రిజర్వేషన్ బిల్లును రూపొందించారు.
27 ఏళ్ల క్రితమే..
ఈ ఆలోచనకు దాదాపు 27 ఏళ్ల క్రితమే అంకురార్పణ జరిగింది. 1996లో హెచ్డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలుత లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్‌పేయీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినా ఈ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. చివరకు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగ్‌లోనే ఉండిపోయింది.ఆపై 2014లో లోక్‌సభ రద్దు కావడంతో మరోసారి బిల్లు అడుగున పడిపోయింది. మరలా తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి ఈ బిల్లు తెరమీదకొచ్చింది. అయితే ఈసారి కేబినెట్ ఆమోదం తెలపడంతో తాజాగా లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ఇది చట్టరూపం దాల్చితే.. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు దక్కితే.. ప్రస్తుతం ఉన్న మహిళా ఎంపీల సంఖ్య 181కి పెరుగుతుంది. ప్రస్తుతం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో ఎస్సీలు, ఎస్టీల కోసం 131 సీట్లను రిజర్వ్ చేశారు. వీటిల్లో నుంచి సుమారు 43 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు.
ఎస్సీ, ఎస్టీ కోటా..
ప్రస్తుతం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ)ల కోసం రిజర్వ్ చేసిన సీట్లు ఉన్నాయి.ఆ రిజర్వ్ చేసిన స్థానాల్లో ఇప్పుడు మూడోవంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు.ప్రస్తుతం ఎస్సీలు, ఎస్టీల కోసం 131 సీట్లను రిజర్వ్ చేశారు. వీటిల్లో నుంచి సుమారు 43 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు.ఈ 43 సీట్లను కూడా సభలో మహిళలకు రిజర్వ్ చేసిన మొత్తం సీట్లలో భాగంగానే లెక్కిస్తారు.అంటే, మహిళలకు రిజర్వ్ అయ్యే 181 స్థానాల్లో, 138 సీట్లు జనరల్ కేటగిరీ మహిళలకు అందుబాటులో ఉంటాయి.అయితే, ఈ లెక్కలన్నీ ప్రస్తుతం లోక్‌సభలో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య ఆధారంగా చేసినవే. ఒక్కసారి డీలిమిటేషన్ కసరత్తు మొదలైతే ఈ గణాంకాలు మారొచ్చు.ప్రాక్టికల్‌గా చూస్తే, ఈ రిజర్వేషన్ల అమలు 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందువరకు సాధ్యం కాదని అనిపిస్తోంది.మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాక 15 ఏళ్ల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఎస్సీ, ఎస్టీలకు కూడా ఒక పరిమిత సమయం వరకే సీట్లను రిజర్వ్ చేస్తారు. తర్వాత వాటిని పదేళ్లపాటు పొడిగిస్తారు.
రిజర్వ్డ్ సీట్లను ఎలా నిర్ణయిస్తారు?
ప్రతీ డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత రిజర్వ్డ్ సీట్లను రొటేట్ చేస్తామని బిల్లులో పేర్కొన్నారు. ఈ వివరాలను పార్లమెంట్ తర్వాత నిర్ణయిస్తుంది.పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్లను ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వానికి ఈ రాజ్యాంగ సవరణ అధికారాన్ని కల్పిస్తుంది.అయితే సీట్ల రొటేషన్, డీలిమిటేషన్ చేపట్టడానికి ఒక ప్రత్యేక చట్టం, నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.లడఖ్, పుదుచ్చేరి, చండీగఢ్ వంటి కేవలం ఒక ఎంపీ సీటు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజర్వేషన్ ఎలా ఉంటుందో ఇంకా నిర్ణయించలేదు.ఈశాన్య రాష్ట్రాలైన మణిపుర్, త్రిపురల్లో రెండు చొప్పున, నాగాలాండ్‌లో ఒకే ఎంపీ స్థానం ఉంటుంది.













