ఎగ్జిట్ పోల్స్ పై సర్వత్రా ఉత్కంఠ

సార్వత్రిక ఎన్నికల అంకం పూర్తవుతోంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఏపార్టీకి ప్రజలు పట్టం కట్టారన్నది తేలనుంది. అయితే తుదిదశ పోలింగ్ ముగిసిన తర్వాత ఈసీ ఆదేశాలను అనుసరించి.. వివిధ ఏజెన్సీలు సర్వేలు వెల్లడించనున్నాయి. ప్రధాని మోడీ చెబుతున్నట్లుగా కూటమికి సొంతంగా 400 సీట్లు వస్తాయా..? ఇండియా కూటమి తన సీట్లను మెరుగుపరుచుకుంటుందా..? రాష్ట్రాల్లో ఏ గవర్నమెంట్లు రానున్నాయి. ప్రజల భావన ఎలా వ్యక్తీకరమైంది అన్నవిషయాలను ఎగ్జిట్ పోల్స్ వెల్లడించనున్నాయి.
ప్రధాని మోడీ నుంచి బీజేపీ కార్యకర్తల వరకూ చార్ సౌ బార్ అంటూ నినదిస్తున్నారు. అయితే విపక్ష ఇండియా మాత్రం.. ఎన్డీఏకు అంతసీన్ లేదంటోంది.గట్టిగా అయితే 230 నుంచి 250 వరకూ సీట్లు రావొచ్చని చెబుతోంది. మరోవైపు..తమకు రెండొందల ప్లస్ సీట్లు ఖాయమన్న అంచనాలో ఉంది. ఇండియా కూటమి.. కాంగ్రెస్ సీట్లు గణనీయంగా పెరగకున్నా.. మిత్రపక్షాలు బలంగా ఉన్నాయని.. వాటితో పొత్తువల్ల తమ విజయావకాశాలు మెరుగుపడతాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.మరి..సర్వే రిపోర్టులు ఏమని చెబుతాయో చూడాలి.
ఇక ఏపీలో అయితే ఓవైపు సంక్షేమ బటన్ నొక్కుతూ ఎన్నికలకు వెళ్లారు సీఎం జగన్. తమకు 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఖాయమంటున్నారు. మరోవైపు.. తమ కూటమికి 150కి పైగా సీట్లు వస్తాయని ఎన్డీయే కూటమి చెబుతోంది. మరి ఈరెండింటిలో వేటిని ఎగ్జిట్ పోల్స్ బలపరుస్తాయో చూడాలి.ఇక అందులోనూ పులివెందుల ఎంపీ స్థానం, పులివెందుల అసెంబ్లీ, కుప్పం అసెంబ్లీ, పిఠాపురం అసెంబ్లీ స్థానాలను ఎవరు గెలుస్తారన్న అంశంపైనా తమ రిపోర్టులు ఇవ్వనున్నాయి సర్వే రిపోర్టులు.
తెలంగాణలో ఇప్పటికే బలపడిన కాంగ్రెస్ .. తన బలాన్ని మరోసారి చాటాలనుకుంటోంది. పార్లమెంటు ఎన్నికల్లోనూ అధికస్థానాలు సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి టీమ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మరోవైపు అధికంగా ఎంపీ స్థానాలు దక్కించుకుని.. ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నది బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక బీఆర్ఎస్.. కనీసస్థానాలైనా గెల్చి, తన సత్తా చాటాలని తలస్తోంది. మరి ఓటరు మహాశయుడు.. దేనికి జై కొడతాడో వేచి చూడాలి.
నూటికి నూరుశాతం కచ్చితంగా లేకున్నా, గతంలో దారుణంగా అంచనాలు తప్పినా… ఎగ్జిట్‌పోల్స్‌పై ఆసక్తిమాత్రం తగ్గటం లేదు సరికదా… ప్రతిసారీ పెరుగుతోంది. కొద్దినెలల కిందటే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క తెలంగాణ విషయంలో తప్పిస్తే మిగిలిన రాష్ట్రాల విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లపై ఒక్కొక్కరు ఒక్కో అంచనా వేశారు. ఛత్తీస్‌గఢ్ ఫలితాలపైనైతే దాదాపు అంతా దెబ్బతిన్నారు. మరిలాంటి పరిస్థితుల్లో.. ఎగ్జిట్‌పోల్స్‌ను ఎలా చూడాలి? వాటినెంతవరకు నమ్మాలి?
ఓటర్లపై ప్రభావం పడకుండా ఉండటం కోసమని… పోలింగ్ చివరి రోజు ఓటింగ్ సమయం పూర్తయ్యాకే… ఎగ్జిట్‌పోల్స్‌ను విడుదల చేయాలని ఎన్నికల సంఘం నిబంధన విధించింది. ఓటు వేసి వచ్చిన ఓటర్లలోంచి కొంతమందిని యాదృచ్ఛికంగా ఎంపిక చేసి… అడిగి తెలుసుకున్న సమాచారాన్ని క్రోడీకరించి… విశ్లేషించి చేసే గణాంకాల గమ్మత్తే ఈ ఎగ్జిట్ పోల్స్! శాస్త్రీయంగా చెప్పాలంటే దీన్ని సెఫాలజీగా పిలుస్తారు. ఈ లెక్కలు, విశ్లేషణలు చేసేవారిని సెఫాలజిస్టులంటారు!
ఈ ఎగ్జిట్‌పోల్స్ కచ్చితత్వం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సర్వే చేసే సంస్థ ప్రామాణికత, అదెవరి కోసం పని చేస్తోందనేది తొలుత గమనించాల్సిన అంశం! ఎంత మందితో సర్వే చేస్తున్నారేది కీలకం. వారిలో భిన్నత్వం ఎంత అనేదీ ప్రధానం! ఎంత ఎక్కువ మందిని సర్వేచేస్తే కచ్చితత్వం అంతగా ఉంటుందనేది ఓ నమ్మకం.సాధారణంగా… ఓటు వేసి వచ్చిన తర్వాత ఓటర్లను నేరుగాగానీ, టెలిఫోన్ ద్వారాగానీ సంప్రదించి వారి నుంచి సర్వేయర్లు సమాచారం సేకరిస్తారు. తర్వాత దాన్ని విశ్లేషించి… ఆయా పార్టీలకు వచ్చే ఓట్లశాతాన్ని, ఓట్లను అంచనా వేస్తారు.