ఇస్రో ‘ఫ్యూచర్’ ప్లాన్స్..
వరుస విజయాలతో ఇస్రో దూసుకుపోతోంది. ఇప్పటికే చంద్రయాన్ -3, ఆదిత్య ఎల్-1తో విజయపరంపర కొనసాగిస్తోంది . ఈ ఒరవడిలో తాజాగా శుక్రుడు, అంగారకుడిపై ఇస్రో దృష్టి సారించింది. దీనికి సంబంధించిన పనులు కూడా మొదలైనట్టు ఇదివరకే ఇస్రో వెల్లడించింది . అయితే ఇది అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే.. ఈప్రయోగాలు ఆసాంతం సవాళ్లతో కూడుకున్నవి.
అంగారకుడి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు వ్యోమనౌక వేడెక్కడం, ల్యాండ్ అయ్యేందుకు సరైన ప్రదేశాన్ని కనుగొనడం వంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు బెంగళూరులోని యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఎం శంకరన్ . అంగారకుడు, శుక్రుడు లేదా ఇతర మిషన్లకు అవసరమైన భారీ పేలోడ్లను మోసుకెళ్లగల ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేయడం అంత సులువు కాదు. రెండేళ్లుగా అంగారక గ్రహంపై ల్యాండింగ్ కోసం మిషన్ కాన్ఫిగరేషన్లను అధ్యయనం చేస్తున్నామన్నారు శంకరన్. అయితే.. రెండు అంశాలు తమని వెనక్కు నెట్టేస్తున్నాయన్నారు. అందులో ఒకటి.. విజయవంతం కాని చంద్రయాన్-2 ల్యాండింగ్. ఈ మిషన్ ఫెయిల్ అవ్వడం.. ల్యాండింగ్‌కు అవసరమైన సెన్సార్లపై తమ విశ్వాసాన్ని మందగించేలా చేసిందన్నారు. సెన్సార్లు బాగా పని చేయలేదని కాదని, చివరి లక్ష్యాన్ని సాధించలేకపోయాం కాబట్టి ఇవి సరిపోతాయో లేదో తమకు తెలియదన్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కాబట్టి, ముందుకు సాగొచ్చన్నారు.
ప్రస్తుతమున్న LVM3 (లాంచ్ వెహికల్ మార్క్-3, ఇస్రో అభివృద్ధి చేసిన ప్రయోగ వాహనం) కెపాసిటీకి, ల్యాండింగ్ రిక్వైర్‌మెంట్స్‌కి కొంత గ్యాప్ ఉందని.. దీనిపై తాము అధ్యయనం చేస్తున్నామని శంకరన్ చెప్పారు. దీనికితోడు మరో సవాల్ కూడా ఉందన్నారు. అంగారకుడి గ్రహంలోని వేడిని తట్టుకోవడం కోసం ఒక రక్షణ కవచం అవసరం ఉంటుందని, దీంతో ద్రవ్యరాశి పెరుగుతుందని అన్నారు. ఈ విషయంపై తాము పరిశీలనలు జరుపుతున్నామని పేర్కొన్నారు. LVM3 మెరుగు పరిచే పనులు సాగుతున్నాయని.. వచ్చే రెండేళ్లలో 20-30 శాతం ఎక్కువ పేలోడ్ సామర్థ్యాన్ని ఇస్రో అంచనా వేస్తోందని ఆయన వివరించారు.
మార్స్ మిషన్‌కు తమకు ఇప్పుడు అవకాశం ఉందని, ఇందుకు ఒక ప్రణాళిక రూపొందించగలగాలని శంకరన్ పేర్కొన్నారు. ఔట్లైట్ ఉంది కాబట్టి.. ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రయాన్-3 సక్సెస్.. తమలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, శుక్రయాన్ ప్రాజెక్ట్ కూడా అలాగే విజయవంతం అవుతుందని తాము భావిస్తున్నామని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పనుల్ని ముందుకు తీసుకెళ్తామని శుభవార్త కూడా చెప్పారు. భూమి, సూర్యుని సాపేక్ష స్థితిని బట్టి.. అంగారకుడు, శుక్రుడు ప్రయోగాలను ఏ రోజైనా ప్రారంభించవచ్చని తెలిపారు. నాలుగైదు సంవత్సరాలలోపే ఇది సాధ్యం కావొచ్చని ఆయన చెప్పుకొచ్చారు.













