జలవిలయం..
ఆఫ్రికా దేశం లిబియాలో డేనియల్ తుపాను జలవిలయం సృష్టించింది. ఈ మహా ప్రళయంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. 5,300 మందికి పైగా మృతి చెందారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 10 వేల మంది ఆచూకీ గల్లంతైంది. వరదనీటి ఉద్ధృతికారణంగా రెండు డ్యామ్లు బద్దలవడమే ఈ భారీస్థాయి ప్రాణనష్టానికి కారణంగా తెలుస్తోంది.
ముఖ్యంగా డెర్నా నగరంలోనే నష్టశాతం అధికంగా ఉంది. ఇక్కడ చాలా వరకూ గృహాలు పర్వత లోయలో ఉన్నాయి. దీని సమీపంలోని ఒక డ్యామ్ బద్దలు కావడంతో ఈ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోకి ఒక్కసారిగా భారీగా బురద నీరు చొచ్చుకొచ్చింది. ప్రజలు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. రెండు డ్యామ్లు కొట్టుకుపోవడంతో వరద తీవ్రత పెరిగిందని లిబియా ప్రధాని ఒసామా హమద్ తెలిపారు.
ఎటూ చూసినా లిబియాలో విషాద వాతావరణం కనిపిస్తోంది. చాలా వరకూ మృతదేహాలు మట్టిదిబ్బల్లో కూరుకుపోయాయి. ఇక శిధిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీయడం … కష్టసాధ్యంగా మారింది. కుటుంబాలకు కుటుంబాలే తుడిచి పెట్టుకుపోయాయి.తమ వారిని వెతుక్కుంటూ, వారి బంధువులు తిరుగుతుండడం.. హృదయ విదారకంగా మారింది.
కొన్నేళ్లుగా లిబియాలో పాలనాపరమైన సంక్షోభంతో మౌలిక సదుపాయాల కల్పనను గాలికొదిలేయడం..ఈ ఉత్పాతానికి దారితీసిందని తెలుస్తోంది. ఒకప్పుడు లిబియాను పాలించిన నియంత గడాఫీకి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో ఆయన గద్దె దిగిపోయారు. అప్పటినుంచి అక్కడ స్థిరమైన ప్రభుత్వం ఏర్పడలేదు. 2014 నుంచి రెండు ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయి. అబ్దుల్ హమీద్ బీబా.. రాజధాని నగరం ట్రిపోలి నుంచి పాలన సాగిస్తున్నారు. ఆయన ప్రభుత్వానికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. మరో పెద్ద నగరం బెంఘాజీ నుంచి ఒసామా హమద్ పాలిస్తున్నారు. దేశ తూర్పు ప్రాంతం ఈయన నేతృత్వంలో ఉంది. ఒసామాకు శక్తివంతమైన మిలిటరీ కమాండర్ ఖలిఫా హిఫ్తార్ మద్దతు ఉంది. ఇలా ఒకే దేశాన్ని ఇద్దరు ప్రధానులు పాలిస్తున్నారు.
ఇప్పుడు వీరంతా లిబియా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడతామని చెబుతున్నారు. కానీ సహాయక చర్యల్లో జాప్యం జరుగుతోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వీరి దృష్టి అంతా అధికారాన్ని కాపాడుకోవడంపైనే ఉంది. అంతర్జాతీయంగా, స్థానికంగా అందుతున్న మద్దతు ఈ రెండు వర్గాల మధ్య కుమ్ములాటలకు దారితీస్తోంది. 2021లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అవి ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
జలప్రళయం ధాటికి విలవిల్లాడిన డెర్నాలో చాలా కట్టడాలు 20వ శతాబ్దం మొదట్లో నిర్మించారు.అప్పట్లో అవి పర్యాటకంగా ఆకట్టుకునేవి కూడా. అయితే గడాఫీ ప్రభుత్వం కూలిన తర్వాత ఆ ప్రాంతం అతివాద గ్రూపులకు ఆవాసంగా మారింది. దాంతో గతంలో ఈజిప్టు అక్కడ వైమానిక దాడులు నిర్వహించింది. ఆ తర్వాత హిఫ్తార్ బలగాలు దానిని స్వాధీనం చేసుకున్నాయి. 2011 తర్వాత అక్కడ పెద్దగా మౌలిక నిర్మాణాల కల్పన జరగలేదు. దెబ్బతిన్న డ్యామ్ ఒకదాన్ని 1970ల్లో నిర్మించారు. నేతల నిర్లక్ష్య వైఖరితో పెనునష్టం సంభవించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.













