DSP: లేడీ డీఎస్పీ ‘లవ్ ట్రాప్’? వ్యాపారికి రూ.2 కోట్లు టోకరా!!
చట్టాన్ని రక్షించాల్సిన చేతులే అక్రమాలకు తెరలేపితే? సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్నవారే ‘హనీ ట్రాప్’ వంటి వ్యూహాలతో అమాయకులను దోచుకుంటే? ఛత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసిన ఒక ఘటన ఇప్పుడు పోలీసు శాఖ ప్రతిష్టనే ప్రశ్నార్థకం చేస్తోంది. దంతెవాడ డీఎస్పీ కల్పనా వర్మ తనను ప్రేమ పేరుతో మోసగించి, కోట్ల రూపాయలు కొల్లగొట్టారంటూ రాయ్‌పూర్‌కు చెందిన ఒక ప్రముఖ హోటల్ యజమాని చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
రాయ్‌పూర్‌కు చెందిన హోటల్ వ్యాపారి దీపక్ టాండన్ కు 2021 లో డీఎస్పీ కల్పనా వర్మతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా సాన్నిహిత్యంగా, ఆపై ప్రేమగా మారింది. నాలుగేళ్లుగా వీళ్లిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు. దీపక్ టాండన్‌కు అప్పటికే వివాహమైందన్న విషయం కల్పనకు తెలిసినప్పటికీ, ఆమె ఈ బంధాన్ని కొనసాగించింది. అయితే, ఈ బంధం వెనుక ప్రేమ కంటే ఆర్థిక అవసరాలే ఎక్కువని దీపక్ ఆరోపిస్తున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో కల్పన కోరికలు తీర్చడానికి తాను దాదాపు రూ. 2 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ఆయన వాపోయారు.
డీఎస్పీ కల్పన డిమాండ్ల చిట్టా వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. డైమండ్ రింగ్, ఖరీదైన బంగారు హారాలు, బ్రాస్లెట్, ఇన్నోవా కారు వంటి విలాసవంతమైన బహుమతులను ఆమె దీపక్ నుండి పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడితో ఆగకుండా, రాయ్‌పూర్‌లోని వీఐపీ రోడ్లో దీపక్ టాండన్ పేరు మీద ఉన్న ఒక హోటల్‌ను వ్యూహాత్మకంగా తన సొంతం చేసుకున్నారు. మొదట ఆ హోటల్‌ను తన సోదరుడి పేరు మీదకు, ఆ తర్వాత తన పేరు మీదకు మార్పించుకున్నారు. కేవలం ఈ రిజిస్ట్రేషన్ ఖర్చుల కోసమే దీపక్ రూ. 30 లక్షలు వెచ్చించడం గమనార్హం.
వ్యాపారంలో ఒడిదుడుకులు సహజం. ఎప్పుడైతే దీపక్ తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఇకపై డబ్బు ఇవ్వలేనని చెప్పారో, అప్పుడే కథ అడ్డం తిరిగింది. అప్పటి వరకు ప్రేమను నటించిన డీఎస్పీ, ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు. తన భార్యకు విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో పాటు, డబ్బు ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారని దీపక్ ఆవేదన వ్యక్తం చేశారు. విసిగిపోయిన దీపక్, తన వద్ద ఉన్న వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు, వివిధ ప్రాంతాల్లో ఇద్దరూ కలిసి ఉన్న సీసీటీవీ ఫుటేజీలను సాక్ష్యాలుగా సమర్పించి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
సాధారణంగా ఆన్లైన్లో గుర్తు తెలియని వ్యక్తులు చేసే ‘హనీ ట్రాప్’ మోసాలను మనం చూస్తుంటాం. కానీ, ఒక బాధ్యతాయుతమైన పదవిలో, అదీ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన డీఎస్పీ స్థాయి అధికారిణిపై ఇలాంటి ఆరోపణలు రావడం సమాజం ఎటు పోతోందనే ప్రశ్నకు అద్దం పడుతోంది. ఒక సామాన్యుడు తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుంది. కానీ, చట్టాన్ని చేతిలో ఉంచుకున్న అధికారిణి, తన హోదాను అడ్డం పెట్టుకుని ఒక వ్యక్తిని మానసికంగా, ఆర్థికంగా దోచుకోవడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. పోలీసులంటే భయం, భక్తి ఉండాలి. కానీ ఇలాంటి ఘటనలు పోలీసు వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని సన్నగిలేలా చేస్తాయి. వివాహితుడని తెలిసి కూడా సంబంధం కొనసాగించడం, ఆపై ఆస్తుల కోసం బెదిరించడం నైతిక పతనాన్ని సూచిస్తోంది.
అయితే డీఎస్పీ కల్పనా వర్మ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. ఇదంతా తన ప్రతిష్టను దిగజార్చడానికి జరుగుతున్న కుట్ర అని ఆమె అంటున్నారు. నిజానిజాలు పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. డబ్బు, విలాసాల కోసం ఎంతటి స్థాయివారైనా అడ్డదారులు తొక్కుతున్నారడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. విచారణ నిష్పక్షపాతంగా జరిగి, తప్పు ఎవరు చేసినా శిక్ష పడితేనే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం మిగులుతుంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ పోలీసు శాఖ ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ జరుపుతోంది.






