అధిష్ఠానం ‘అప్పజెప్పిన’ పనిలో విఫలమైన కిరణ్ బేడీ….తలనొప్పిగా మారకూడదనే తొలగింపా?
పుదుచ్చేరి వివాదం కాస్తా సద్దు మణిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని ఇంటికి పంపే వరకూ విశ్రమించేది లేదంటూ భీష్మించుకున్నారు సీఎం. అంతేకాకుండా ఏకంగా రాజ్‌భవన్ ముందు మూడు రోజుల పాటు ధర్నాకు దిగారు. ఎల్జీ బేడీతో రాష్ట్రంలో సమస్యలు తలెత్తుతున్నాయని, వెంటనే ఆమెను ఎల్జీ బాధ్యతల నుంచి తప్పించాలంటూ సీఎం నారాయణ స్వామి చాలా రోజులుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మరో నాలుగు నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో సీఎం నారాయణ స్వామి దీక్షకు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రభుత్వం ఏ పని చేసినా లెఫ్టినెంట్ గవర్నర్ మోకాలడ్డుతున్నారని, కీలక ఫైళ్లను తిరిగి వెనక్కి పంపిస్తున్నారని సీఎం మండిపడ్డారు. అంతేకాకుండా ఆమెకు రాజ్యాంగం పట్ల గౌరవం లేదని, తనకు తానే ఓ రాజ్యాంగంగా అనుకుంటోందంటూ విరుచుకుపడ్డారు. దీంతో ఎట్టకేలకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కిరణ్ బేడీని తప్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఎల్జీ వివాదాన్ని కాంగ్రెస్ ఎన్నికల అంశంగా మార్చుకోకుండా బీజేపీ ముందు జాగ్రత్తగానే ఆమెను పదవి నుంచి తప్పించింది. దీంతో సీఎం నారాయణ స్వామి ఎట్టకేలకు విజయం సాధించారు. ఆయన పోరాటానికి తగిన ప్రతిఫలమే దక్కింది.
కేంద్రానికి తలనొప్పిగా మారిన బేడీ?
కొన్ని నెలలుగా సీఎం నారాయణ స్వామి వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పుదుచ్చేరి రాజకీయాలు మారిపోయాయి. సీఎం నారాయణ స్వామి ఏ నిర్ణయం తీసుకున్నా…. ఎల్జీ కిరణ్ బేడీ వ్యతిరేకించేవారు. ప్రతి చిన్న విషయాన్నీ ఆమె రాజకీయంగా చేసి, రాజకీయాల్లో చికాకు తెప్పిస్తున్నారని కేంద్రం భావించిందని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా ఎన్నికల కాలం వచ్చేస్తోంది. ఈ సమయంలో కిరణ్ బేడీ తీసుకునే నిర్ణయాలు బీజేపీ తలబొప్పిగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అధిష్ఠానం ఆలోచనగా కొందరు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ రాని పక్షంలో రాజకీయ వ్యూహం వేసి పుదుచ్చేరిని దక్కించుకోవాలని బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఆ సమయంలో కిరణ్ బేడీ ఎల్జీగా ఉంటూ… బీజేపీ అధికార ఏర్పాటుకు ప్రయత్నిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న జాగ్రత్తలో బీజేపీ ఉంది. అంతేకాకుండ కాంగ్రెస్‌కు అనవసరంగా ఓ వివాదాన్ని చేతికి ఇచ్చినట్లన్న భావతో బీజేపీ పెద్దలున్నారు. వీటితో పాటు కిరణ్ బేడీ స్థానంలో ఓ రాజకీయ వేత్తను ఉంచితే… పరిస్థితులు పూర్తి అనుకూలంగా మార్చేస్తారన్న అభిప్రాయమూ కమలంలో ఉంది. ఇలా అనుకున్న స్కెచ్ కాకుండా.. బేడీ పూర్తి భిన్నంగా వెళిపోతున్నారు. ఈ పరిణామాలతో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయన్న భావనతోనే బీజేపీ అధిష్ఠానం అలర్ట్ అయ్యింది. సీనియర్ నేతలైన అర్జున్ మేఘవాల్, రాజీవ్ చంద్రశేఖర్‌కు పుదుచ్చేరి బాధ్యతలను అప్పగిచ్చింది. అయినా సరే పరిస్థితిలో మార్పు కనిపించలేదు. అయితే వీరిద్దరూ బేడీ విషయంలో ఓ రిపోర్ట్ కూడా ఇచ్చినట్లు కొందరు నేతలు పేర్కొంటున్నారు.
బీజేపీ టార్గెట్‌ను సుగుమం చేయలేకపోయిన బేడీ!
కిరణ్ బేడీ…. తొట్ట తొలి మహిళ ఐపీఎస్. ఐపీఎస్‌గా సుదీర్ఘకాలం సేవలందించారు. ధీరోదాత్తగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరి క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కొన్నాళ్ల పాటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా సేవలందించారు. ఆ తర్వాత ఆమెను పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కేంద్రం పంపింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే బాధ్యతను బీజేపీ అప్పజెప్పింది. కానీ… ఈ బాధ్యతను కిరణ్ బేడీ భుజానికెత్తుకోకుండా ప్రతి చిన్న ప్రభుత్వ నిర్ణయాన్నీ పెద్దదిగా చేసి చూపిస్తోందన్న వాదన ఒకటి రాష్ట్రంలో బలంగా పాతుకుపోయింది. చివరికి… సంక్షేమ పథకాలు, ప్రజలకు ఉపయోగపడే పథకాలకు కూడా కిరణ్ బేడీ రెడ్ సిగ్నల్ ఇస్తున్నారని, మోకాలడ్డుతున్నారన్న భావన ప్రజల్లో కూడా పాతుకుపోయింది. సరిగ్గా ఇదే విషయాన్ని సీఎం నారాయణ స్వామి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. దీంతో బీజేపీ అధిష్ఠానం అలర్ట్ అయ్యింది. కిరణ్‌బేడీ స్వతహాగా రాజకీయ నాయకురాలు కారు. ఏ విషయాన్ని ఎలా తమకు అనుకూలంగా మలుచుకోవాలన్న విషయంలో బేడీ విఫలమయ్యారు. బేడీ విఫలం కావడంతో బీజేపీ అలర్ట్ అయ్యింది. ఎన్నికల నాటికి తిరిగి… పూర్తి అనుకూల పరిస్థితులు తలెత్తడానికి అధిష్ఠానం పావులు కదుపుతోంది.
తెలంగాణ గవర్నర్ తమళసైకే అదనపు బాధ్యతలు ఎందుకంటే…..
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కిరణ్ బేడీని తప్పించి, తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్‌కు పుదుచ్చేరి ఎల్జీగా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. ఈ కోణంలోనే కేంద్రం ఎందుకు ఆలోచించిందన్నదే ప్రశ్న. కేవలం క్రియాశీల రాజకీయవేత్త కోసమే కేంద్రం చూడటం లేదని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. క్రియాశీల రాజకీయాలతో పాటు తమిళ ప్రజలను కూడా విశేషంగా ఆకట్టుకునే నేత అవసరమని బీజేపీ భావించింది. అందుకే తమిళసైని బీజేపీ ఎంచుకుంది. అక్కడి పరిస్థితులను తమిళ ప్రజల కోణంలో చూసే గవర్నర్ ఉండాలని, కేవలం చట్టాల ప్రకారమే నడుచుకునే నేత ఉంటే రాజకీయంగా సరిపోదని బీజేపీ భావించింది. తమిళసై తమిళ మూలాలున్న నేత కాబట్టే… బీజేపీ ఆమెకు పుదుచ్చేరి అదనపుగా బాధ్యతలు అప్పజెప్పింది.
గవర్నర్లు వర్సెస్ ప్రభుత్వాలు
ప్రస్తుతం మహారాష్ట్ర, బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్‌గా మారిపోయింది. కొన్ని రోజులుగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ వర్సెస్ గవర్నర్ కోషియారీగా నడుస్తోంది. గవర్నర్ కోషియారీ డెహ్రాడూన్ పర్యటన నిమిత్తం విమానాన్ని అడిగితే.. ప్రభుత్వం అందుకు నిరాకరించింది. రెండు గంటల పాటు విమానాన్ని పంపకుండా ప్రభుత్వం ఆయన్ను వెయింటింగ్‌లో ఉంచింది. రెండు గంటల తర్వాత కూడా పంపక పోవడంతో ప్రైవేట్ విమానాన్ని బుక్ చేసుకొని వెళ్లిపోయారు. ఇక బెంగాల్లో కూడా సీఎం వర్సెస్ గవర్నర్‌గా వ్యవహారం నడుస్తోంది. వీరిద్దరి మధ్య వివాదం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఇక… పుదుచ్చేరిలోనూ దాదాపు ఐదేళ్ల నుంచి సీఎం నారాయణ స్వామి వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీగా వ్యవహారం మారిపోయింది. చివరకు ఎల్జీ బాధ్యతల నుంచి కిరణ్ బేడీని తప్పించడంతో వివాదం సద్దుమణిగింది.













