హస్తానికి ‘కన్నడ’ ఊపిరులు…
కర్నాటకలో హస్తం జయకేతనం ఎగురవేసింది. 136 సీట్లను గెల్చుకుని అధికార పీఠం దక్కించుకోవడం ఆపార్టీ శ్రేేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. పదేళ్లుగా అప్రతిహతంగా వెలిగిపోతున్న మోదీ ప్రభకు.. అడ్డుకట్ట వేశామన్న ఆనందం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. కాంగ్రెస్ కు మంచిరోజులు వస్తున్నాయన్న విశ్వాసం వారిలో కనిపిస్తోంది. ఇదే ఊపును కంటిన్యూ చేయాలన్న తలంపుతో కాంగ్రెస్ హైకమాండ్, క్యాడర్ లో కనిపిస్తోంది..
వివిధ రాష్ట్రాల్లో వరుస ఓటములతో కాంగ్రెస్ పనైపోయిందంటూ అధికార బీజేపీ వెక్కింరిపులు.. మిత్రపక్షాలైన టీఎంసీ లాంటి పార్టీలు కాంగ్రెసును బీ టీమ్ గా జమకట్టిన పరిస్థితులు హస్తం నేతలను తీవ్ర వేదనకు గురి చేశాయి. దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఓ వెలుగు వెలిగి.. ఇప్పుడు చిన్న, చితకపార్టీలు సైతం తేలిగ్గా తీసిపడేయడం కాంగ్రెస్ నేతలకు బాధాకరంగా పరిణమించింది.
వరుస పరాజయాలతో తల్లడిల్లుతున్న హస్తానికి.. పార్టీకి సుదీర్ఘకాలం అండగా ఉన్న గులాంనబీ ఆజాద్, జ్యోతిరాదిత్య సిందియా లాంటి నేతలు వివిధ కారణాలను సాకుగా చూపిస్తూ .. గుడ్ బై చెప్పడం మరింత ఆందోళనకు గురి చేసింది. జ్యోతిరాదిత్య సింథియా అయితే కాంగ్రెస్ పనైపోయిందంటూ.. బీజేపీలో చేరి కేంద్రమంత్రి పదవి సైతం పట్టేశారు.
ఇక పార్టీలోనూ జి G-23 పేరుతో ఓ అమ్మతి గ్రూప్ తయారైంది. అది సాక్షాత్తూ గాంధీ కుటుంబం ఆధిపత్యాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టింది. పార్టీలో సంస్కరణలు రావాలంటూ నేరుగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. మరోవైపు.. వరుస ఓటములు పార్టీ శ్రేణులను కుంగదీశాయి..కాంగ్రెస్ పనైపోయిందని, ఇక తామే దేశానికి ఆశాకిరణాలమంటూ ఆప్, టీఎంసీ, జేడీయూ లాంటి పార్టీలు ప్రచార పర్వాన్ని మొదలెట్టేశాయి. ప్రధాని మోదీ అయితే కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ నేరుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్, యూపీఏ కూటములు సైతం కూల్చేదిశగా ప్రయత్నాలుసాగిస్తూ ముందుకెళ్తున్నారు.ఈ పరిణామాలు కాంగ్రెస్ అభిమానుల్లోను ఆందోళన పెంచాయి.
ఎప్పుడైతే పార్టీ పరిస్థితి దిగజారడం మొదలైందో … గాంధీ కుటుంబం అప్రమత్తమైంది. రాహుల్, ప్రియాంకలు .. ప్రజల్లోకి వచ్చి పోరాటం మొదలుపెట్టారు. యూపీలో అమ్మాయిలపై గ్యాంగ్ రేప్ ల విషయంలో.. నేరుగా యోగిసర్కార్ పై విమర్శలు సంధిస్తూ ప్రజల్లోకి వెళ్లారు. అయితే ఆ ఎన్నికల్లో ఫలితం రాకున్నా.. రాజకుమారులు అన్న విమర్శ తుడిచిపెట్టినట్లైంది. అంతే కాదు.. కార్యకర్తలకు మేమున్నామంటూ ఓ అభయహస్తం చూపించినట్లైంది. ఇక…యూపీపై ప్రియాంక ఫోకస్ పెట్టగా.. రాహుల్ దేశవ్యాప్తంగా ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు. కాంగ్రెస్ జోడో యాత్రతో యావత్ దేశం చుట్టేశారు. అంతే కాదు.. ఎక్కడైతే కాంగ్రెస్ కాస్త బలంగా ఉందో అక్కడ ఎక్కువ సమయం పాదయాత్ర చేపట్టి, మరింత బలోపేతంగా మార్చారు.
కర్నాటకలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్కడే అధిక సమయం గడిపారు. ఏకంగా ఇరవై నాలుగు రోజుల్లో ఐదువందల కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. ప్రతీ వర్గం సమస్యలు వింటూ… కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగారు. ఓవైపు బీజేపీ అవినీతి పాలనతో విసుగెత్తిన ప్రజలు… రాహుల్ పాదయాత్రకు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్రంలో సిద్ధరామయ్య, డికె. శివకుమార్ ఐక్యతారాగం..రాహుల్ భరోసా వెరసి కాంగ్రెస్ కు అఖండ విజయ సాధించి పెట్టారు. దీంతో ఇదే తరహాలో దేశవ్యాప్తంగా మ్యాజిక్ రిపీట్ చేయాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. బీజేపీపై గెలుపు ఎలా సాధించవచ్చన్నది .. కర్నాటక ఫలితాలు తెలియజేశాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.













