అసమ్మతి సెగలు..
సర్కార్ ఏర్పడి రెండునెలలైనా పూర్తికాకముందే.. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలో లుకలుకలు బయటపడ్డాయి. ప్రభుత్వంలో పదవులు ఆశించి భంగపడిన నేతలు…మంత్రులు తమను నిర్లక్ష్యం చేశారంటూ నేరుగా సీఎంకు లేఖ రాశారు. ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ లెటర్‌హెడ్‌లో ఏకంగా 30 మంది సంతకాలతో లేఖ రాయడం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది.
కర్నాటకలో పార్టీలో లుకలుకలపై కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమైంది. ఆరంభంలోనే పరిస్థితి అదుపు చేయకుంటే పెను ముప్పు తప్పదని భావించి చర్యలకు ఉపక్రమించింది.సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు మంత్రులందరూ… ఆగస్టు 2న ఢిల్లీ రావాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆదేశించారు.
మరోవైపు..పార్టీలో తలెత్తిన విభేదాలను నియంత్రించాల్సిందేనని సీఎం సిద్దరామయ్యకు అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది.దీంతో శాసనసభ్యుల సమావేశంలో మంత్రులకు.. సీఎం పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. విపక్షాల ట్రాప్ లో చిక్కుకోవద్దని… మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు సమాచారం.
ప్రధానంగా ఇద్దరు మంత్రుల తీరుపై ఎక్కువ మంది ఎమ్మెల్యేల అసంతృప్తి నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, వారికి కొంత సమయాన్ని కేటాయించాలని హైకమాండ్ సూచించినట్లు సమాచారం. ఢిల్లీలో జరగనున్న సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, రాహుల్‌గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సుర్జేవాలా పాల్గొంటారు. కేబినెట్లో చోటు లభించక అసంతృప్తితో ఉన్న బీకే హరిప్రసాద్‌కు ఢిల్లీ సమావేశానికి ఆహ్వానం పంపినట్లు సమాచారం.
ఇటీవల ముఖ్యమంత్రిని చేయడం తెలుసు అంతకంటే దించడం కూడా వచ్చుననే బికె హరిప్రసాద్ వ్యాఖ్యలపైనా సమావేశంలో చర్చ జరిపే అవకాశం ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వ్యవహరించాల్సిన వ్యూహాలపై సలహాలు ఇస్తూనే మంత్రుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకోదలచినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది.













