దౌత్యం ఫెయిల్..?
చైనాతో సంబంధాల విషయంలో అమెరికా రెండంచెల విధానం సత్ఫలితాలివ్వడం లేదా? ఓవైపు డ్రాగన్ దుందుడుకు వైఖరిని.. అంతర్జాతీయ సమాజం అండతో నిలువరించేందుకు ప్రయత్నిస్తూనే…. చైనాతో ఆర్థిక, మిలటరీ సంబంధాలను సాదారణస్థితికి తెచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు బిడెన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఓవైపు భారత్ సహా చైనా సరిహద్దు, శత్రు దేశాలను సమన్వయం చేస్తూనే.. మరోవైపు దౌత్యవేత్త బ్లింకెన్ ను.. చైనాతో చర్చలకు పంపించారు.
ఓవైపు భారత ప్రధాని మోదీ.. అమెరికాలో స్టేట్ విజిట్ జరుగుతోంది. మోదీకి అమెరికా ఇస్తున్న ఆతిథ్యం, ఇరుదేశాల బంధాలు మరో అత్యున్నతస్థాయికి చేరుకోవడం సహజంగానే చైనాకు మండిపోతోంది. ఇప్పటికే అమెరికా మాటలకు, చేతలకు సంబంధం ఉండదని.. భారత్ ను పరోక్షంగా హెచ్చరించిన చైనా.. ఇప్పుడు బ్లింకెన్ తో చర్చల్లోనూ తమ విధానంపై మరింత క్లారిటీ ఇచ్చారు. తమ డిమాండ్లను అమెరికా ముందుంచినట్లు తెలుస్తోంది. దీంతో బిడెన్ సైతం ఆగ్రహానికి లోనయ్యారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ను జో బిడెన్ ఓ నియంతగా అభివర్ణించారు. ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి సాధారణ స్ధాయికి తీసుకొచ్చేందుకు అమెరికా దౌత్యవేత్త ఆంటోనీ బ్లింకెన్.. బీజింగ్‌లో పర్యటించిన మరుసటి రోజే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ జీ జిన్‌పింగ్‌ను నియంతగా ప్రస్తావించారు. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా గగనతలంపై అనుమానాస్పద చైనీస్ గూఢచారి బెలూన్ను పేల్చినప్పుడు జిన్ పింగ్ చాలా ఇబ్బందిపడ్డాడని బిడెన్ వెల్లడించారు. అంతేకాదు.. చైనా ఆర్థికంగా బలంగా లేదన్నారు.
చైనా మీద ఆగ్రహంగా ఉన్న అమెరికా ఇప్పుడేం చేస్తుంది..? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. మరోసారి చర్చల ప్రక్రియను చేపట్టనుందా..?మరీ ముఖ్యంగా చైనాను ఎలా దారికి తెస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. చైనా మార్కెట్ అతిపెద్దది కావడంతో.. వ్యాపార ప్రయోజనాల రిత్యా దాని ఇంపార్టెన్స్ దానికి ఉంది. అందుకే ఎంతగా విమర్శిస్తున్నా.. వ్యాపార విషయంలో అమెరికా సర్దుకుపోతోంది. కానీ చైనా మాత్రం తనను తాను సూపర్ పవర్ గా ప్రపంచానికి పరిచయం చేయాలని భావిస్తోంది.
తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని.. ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తోంది. సహజంగానే ప్రపంచ పెద్దన్నగా ఉన్న అమెరికాకు అది రుచించడం లేదు. దీంతో చైనాకు ముకుతాడు వేసేందుకు ఎక్కడికక్కడ ప్రాంతీయశక్తులను బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది.






