తొలిడిబేట్ లో ట్రంప్ డామినేషన్.. బైడన్ తత్తరపాటు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్, డెమొక్రాటిక్ అభ్యర్థులైన ట్రంప్, బైడన్ మధ్య డిబేట్ హోరాహోరీగా జరిగింది. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా ఉన్న ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడన్, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం, వలసలు, ఇతర అంశాలపై అభ్యర్థులు ఆరోపణలకు దిగారు. ఈడిబేట్ లో ట్రంప్ దూకుడు ప్రదర్శించారు.ప్రస్తుత అధ్యక్షుడు జో బైడన్ మాత్రం కొన్ని చోట్ల తడబడ్డారు. దీంతో ఇప్పుడు జో బైడన్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిబేట్లో ట్రంప్‌ను సరిగ్గా ఎదుర్కోలేకపోవడంతో సొంత పార్టీ నుంచే జో బైడన్‌ను అసంతృప్తి వ్యక్తం అవుతోంది. బైడన్ తీరుపై డెమోక్రాట్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
బైడెన్ ఫెయిల్యూర్.. ట్రంప్ దోషి..
చర్చలో భాగంగా సంయమనం కోల్పోయిన బైడన్, ట్రంప్ తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ దూకుడు ప్రదర్శించగా.. కొన్నిచోట్ల బైడన్ తడబడ్డారు. బైడన్ ఒక ఫెయిల్యూర్ అని ట్రంప్ పేర్కొనగా.. దానికి గట్టిగా బదులిచ్చిన బైడన్.. ట్రంప్ దోషి అంటూ ఆరోపించారు. ట్రంప్ సర్కార్.. ధనికులకు మాత్రమే అనుకూలంగా వ్యవహరించడంతో ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోయిందని.. నిరుద్యోగం 15 శాతానికి చేరిందని బైడన్ మండిపడ్డారు. అయితే వాటిని ఖండించిన ట్రంప్.. బైడన్ ప్రభుత్వంలో కేవలం అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చిన వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని.. ట్యాక్స్ కట్ల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంత దారుణస్థితిని ఎదుర్కొంటోందని ఆరోపించారు.అమెరికా విదేశాంగ విధానం, అబార్షన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కొవిడ్-19, సామాజిక భద్రత, మెడికేర్, ట్యాక్సులు, ట్రంప్‌పై కేసులు, 2020 క్యాపిటల్ దాడులు, మాజీ సైనికుల భద్రత, నాటో వంటి అంశాలను చర్చించారు.
బైడన్ తీరుపై సొంతపార్టీలో అసహనం..
అయితే డిబేట్లో బైడన్ కంటే ట్రంప్ మరింత దూకుడు ప్రదర్శించారు. కొన్ని విషయాల్లో ట్రంప్‌ను కట్టడి చేయడంలో బైడన్ వెనుకంజ వేయడంతో ఆయన సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే డిబేట్లో ట్రంప్‌ను నిలువరించడంలో బైడన్ విఫలం అయ్యారని డెమోక్రాట్ల నుంచే తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. అంతేకాకుండా వయసు కారణంగా బైడన్ చురుగ్గా డిబేట్లో పాల్గొనలేకపోయారని మండిపడుతున్నారు. బైడన్ కారణంగా డెమోక్రటిక్ పార్టీ వెనుకడుగు వేస్తోందని.. ఆయన పోటీ నుంచి పక్కకు తప్పుకోవాలని డెమోక్రాట్ల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఈ డిబేట్‌కు ముందుగానీ తర్వాత గానీ.. ఇద్దరు నేతలు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోకపోవడం గమనార్హం. ఇక నిబంధనల ప్రకారం ఈ డిబేట్లో కేవలం నిర్వాహకులు మాత్రమే పాల్గొనగా.. ట్రంప్, బైడన్లలో ఒకరు మాట్లాడుంటే మరొకరి మైక్‌లను మ్యూట్ చేశారు. ఇక ఈ డిబేట్‌పై సీఎన్ఎన్ నిర్వహించిన పోల్‌లో బైడన్‌పై ట్రంప్ పైచేయి సాధించినట్లు అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తం 90 నిమిషాల డిబేట్లో ట్రంప్ 23 నిమిషాల 6 సెకన్లు.. బైడన్ 18 నిమిషాల 26 సెకన్లు మాట్లాడారు.
ఈ ఏడాది నవంబర్ 5 వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధికార డెమోక్రటిక్ పార్టీ తరఫు నుంచి మరోసారి ప్రస్తుత అధ్యక్షుడు 81 ఏళ్ల జో బైడన్ బరిలో నిలిచారు. ఇక ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ తరఫు నుంచి మాజీ అధ్యక్షుడు 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగానే ఈ ఇద్దరు రెండు నేతలు.. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత తొలిసారి డిబేట్లో ఎదురుపడ్డారు. అట్లాంటాలోని సీఎన్ఎన్ ఆఫీస్‌లో 90 నిమిషాల డిబేట్ జరిగింది.






