Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Netanyahu) భేటీ అయ్యారు. సమావేశం అనంతరం నెతన్యాహు మాట్లాడుతూ హమాస్ (Hamas) తో యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ (Israel) మరింత బలంగా మారిందని చెప్పారు. తమ దేశంలో శాంతిని నెలకొల్పడానికి, ప్రజలకు సురక్షితమైన భవిష్యత్తును అందించడం కోసం గాజా (Gaza)కు సంబంధించి మూడు కీలక లక్ష్యాలను నిర్దేశించుకున్నామని తెలిపారు. బందీలను విడుదల చేయడం, హమాస్ సైన్యాన్ని నాశనం చేయడం, తమ దేశానికి గాజా మరోసారి ముప్పు కల్పించకుండా చూసుకోవడం తాము నిర్దేశించుకున్న మూడు లక్ష్యాలని నెతన్యాహూ తెలిపారు. అమెరికాకు ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షులలో ట్రంప్ తనకు గొప్ప స్నేహితుడని నెతన్యాహు కొనియాడారు. యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి విదేశీ నేతగా తనను వైట్ హౌస్ (White House) కు ఆహ్వానించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.













