యుద్ధజ్వాలల్లో…
ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య హోరాహోరీగా సమరం సాగుతోంది. ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ మొదలుపెట్టిన ఇజ్రాయెల్ సైన్యం.. హమాస్ ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు..చాలా మంది బంధీలను సైతం రక్షించగలిగింది. ఈదాడుల్లో ఇప్పటివరకూ వందలాది మందిమృతి చెందారు. ఇది యుద్ధమేనని, ఆపరేషన్ కాదన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. గాజాలో ఉగ్రవాదులు దాక్కున్న భవనాలు శిథిలమవుతాయని, అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని నెతన్యాహు సూచించారు. నరమేధానికి గానూ హమాస్ కచ్చితంగా ఫలితం అనుభవిస్తుందన్నారు. గతంలో ఎన్నడూ చవిచూడనంత నష్టాన్ని అనుభవిస్తారని హెచ్చరించారు.
మరోవైపు…తమ పౌరులను కాపాడుకోవడానికి అవసరమైన ఏ చర్యలనైనా చేపడతామని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఇజ్రాయెల్ ప్రతినిధి గలీద్ ఎర్డాన్ వెల్లడించారు. శనివారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం గాజా పట్టీ నుంచి జరుగుతున్న దాడుల నుంచి తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని తెలిపారు.
ఇజ్రాయెల్‌పై తాము చేసిన మెరుపు దాడికి ఇరాన్ మద్దతు ఉందని మిలిటెంట్ సంస్థ హమాస్ ప్రకటించింది. ఆ సంస్థ ప్రతినిధి ఘాజీ హమీద్ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ కూడా ఈ దాడుల వెనుక ఇరాన్ హస్తం ఉండే అవకాశం ఉందని బలంగా నమ్ముతూ వస్తోంది. తాజాగా హమీద్ ప్రకటనతో అది నిజమని తేలింది. మరోవైపు ఇరాన్ కూడా హమాస్ దాడిని ఆత్మరక్షణగా అభివర్ణించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అణచివేతకు గురైనా పాలస్తీనా ప్రజలు ఆత్మరక్షణ కోసం చేసిన దాడిగా దీనిని అభివర్ణించింది.
పాలస్తీనా అధ్యక్షుడితో బ్లింకన్ చర్చలు..
మరోవైపు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఫోన్లో చర్చలు జరిపారు. వెస్ట్‌బ్యాంక్‌లో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పాలని కోరారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌పై జరిగిన ఉగ్రదాడులను ఖండిస్తున్నట్లు బ్లింకన్ వెల్లడించారు. ఆ ప్రాంతంలోని దేశాలు కూడా ఈ దాడిని ఖండించాలని సూచించారు. ఈ విషయాన్ని పాలస్తీనా అథారిటీ ప్రతినిధి కూడా ధ్రువీకరించారు.
కాగా.. ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులు జరిపిన ఆకస్మిక దాడుల్లో మృతుల సంఖ్య 400 దాటిందని అంతర్జాతీయ మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. దక్షిణ ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో రాకెట్ మోతలు ఇంకా మోగుతూనే ఉన్నాయని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. ఇక హమాస్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రారంభించిన ‘ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్’తో గాజాలో 230 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.













