మమత నేతృత్వంలో కూటమి సాధ్యమయ్యే పనేనా..?

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఆశించినంత స్థాయిలో ఫలితాలు రాలేదు. అసోంలో అధికారాన్ని నిలబెట్టుకోగా పుదుచ్చేరిలో కాంగ్రెస్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక తమిళనాడులో నాలుగు చోట్ల నెగ్గి ఫరవాలేదనిపించుకుంది. కేరళలో మాత్రం ఖంగుతింది. పశ్చిమ బెంగాల్ లో ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకుంటామని ధీమాగా ఉన్న బీజేపీకి అడియాశే మిగిలింది. దీదీని ఇంటికి పంపడం ఖాయమని మోదీ, షాలు ప్రకటించారు. కానీ అది వర్కవుట్ కాలేదు. తాము ఆశించినంత స్థాయిలో ఫలితాలు రాకపోగా.. మమత మాత్రం బీజేపీ అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తూ మరింత బలపడింది. దీంతో కేంద్రంలో మోదీని ఎదుర్కోగల నేత ఒక్క దీదీ మాత్రమేనని దేశమంతా కోడై కూస్తోంది. మరి ఇది నిజంగా సాధ్యమయ్యే పనేనా?
ప్రస్తుతం కరోనా కష్టకాలం నడుస్తోంది. సెకండ్ వేవ్ ను మోదీ సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో దీదీ అఖండ విజయం సాధించడంతో మోదీకి ప్రత్యామ్నాయం మమతేనంటూ జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. మమత నేతృత్వంలో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడి వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మోదీపై సమరశంఖం పూరిస్తారని సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ కూటమిపై గానీ, మోదీపై యుద్ధభేరి మోగించడంపై కానీ మమత ఎక్కడా నోరు విప్పట్లేదు.
అయితే.. కాంగ్రెస్ ప్రాభవం దారుణంగా పడిపోవడం, ప్రాంతీయ పార్టీలు బలపడడం.. లాంటి సంకేతాలు దేశంలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఓ కూటమి అవసరాన్ని చాటి చెప్తున్నాయి. బీజేపీని ఎదుర్కొనే సత్తా ఇప్పుడు కాంగ్రెస్ కు లేదనేది కాదనలేని సత్యం. అలాగని రీజనల్ పార్టీలు వేటికవి రాష్ట్రాలకు పరిమితమైపోతే బీజేపీని ఢీకొట్టడం సాధ్యమయ్యే పని కాదు. అందుకే బీజేపీని ఎదుర్కోవాలంటే ఓక్క మమత వల్లే సాధ్యమవుతుందని.. ఆమె నేతృత్వంలోనే కూటమి ఏర్పడితే బాగుంటుందని చెప్తున్నారు. కాంగ్రెస్ తో పాటు ఇతర రీజనల్ పార్టీలు కూడా ఈ కూటమిలో భాగస్వామి కావడం ద్వారా బీజేపీని ఎదుర్కోవడం ఈజీ అవుతుందనేది విశ్లేషకుల మాట.
కానీ మమతతో కూటమి సాధ్యమవుతుందా అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే మమతకు ఢిల్లీ పీఠంపై పెద్దగా ఆశలేదు. పశ్చిమ బెంగాల్ ను వదిలి హస్తిన పీఠాన్ని కైవసం చేసుకోవాలనే తపన మమతలో ఎప్పుడూ కనిపించలేదు. రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు దాన్ని విమర్శించడం వేరు. ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అవసరమైన శక్తిసామర్థ్యాలను కూడగట్టడం వేరు. మమత ఎప్పుడూ ఆ ఆలోచన చేయలేదు. ఒకవేళ మమత కూటమి కట్టే ఆలోచన ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఆ కూటమిలో చేరుతుందా.. అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. ఔనన్నా కాదన్నా కాంగ్రెస్ జాతీయ పార్టీ. జాతీయ పార్టీగా ఒక ప్రాంతీయ పార్టీ నేత సారథ్యంలో పనిచేయడానికి కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. కాబట్టి కూటమిలో కాంగ్రెస్ ఉంటుందని ఆశించలేం.
ఇక ఇతర ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే రీజనల్ పార్టీల్లో ఇప్పుడు అతిపెద్ద పార్టీగా ఉంది వైసీపీ. కానీ కేంద్రంలోని బీజేపీతో వైసీపీ అన్యోన్యంగా ఉంటోంది. కాబట్టి మమత నేతృత్వంలో బీజేపీపై కాలు దువ్వడానికి వైసీపీ ఏమాత్రం సిద్ధంగా ఉండదు. తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ మాత్రం మమతతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండొచ్చు. తమిళనాడులో అధికారం చేపట్టబోతున్న స్టాలిన్ ఇప్పటికే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ను కాదని వచ్చి మమతతో జట్టు కట్టకపోవచ్చు. ఒడిశాలోని నవీన్ పట్నాయక్ బీజేపీకి, కాంగ్రెస్ కు సమానదూరం పాటిస్తున్నారు. కాబట్టి ఆయన కూడా మమతకు జైకొట్టకపోవచ్చు.
అయితే ఆమ్ ఆద్మీ పార్టీ, అకాలీదళ్, సమాజ్ వాదీ పార్టీ, జేడీఎస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆర్జేడీ తదితర పార్టీలు మమత ఓకే అంటే కలిసి పనిచేసే అవకాశం ఉంది. అయితే ఈ పార్టీలన్నింటికీ ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఇబ్బందులు, అవసరాలు కూటమిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి మమత ముక్కుసూటి మనిషి. తాను చెప్పిందే వేదం అనే టైపు. కానీ కూటమిని నడపాలంటే కొన్ని పట్టువిడుపులు అవసరం. కానీ మమత దగ్గర అది ఆశించలేం. మరి ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పుడు కూటమి సాధ్యమా.. అనేది వేచి చూడాలి.